11మంది రెబల్స్ కు మంత్రి పదవులు... కర్నాటకలో బీజేపీ సేఫ్ గేమ్

కర్నాటక ఉపఎన్నికల్లో ఎలాగైనాసరే గెలిచి... మళ్లీ సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేయాలనుకున్న కాంగ్రెస్‌-జేడీఎస్ ఆశలు ఆవిరయ్యాయి. మొత్తం 15 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరగగా... కాంగ్రెస్ రెండు సీట్లకు మాత్రమే పరిమితమవగా, జేడీఎస్ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. ఇక, ఉపపోరులో పూర్తి ఆధిపత్యం కనబర్చిన బీజేపీ.... 12 స్థానాల్లో విజయదుందుబి మోగించింది. అయితే, అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే కనీసం ఆరేడు స్థానాలకు కచ్చితంగా గెలవాల్సిన బీజేపీ ఏకంగా 12 సీట్లను దక్కించుకోవడంతో ముఖ్యమంత్రి యడియూరప్ప పట్టలేని సంతోషాన్ని వ్యక్తపరిచారు. అత్యధిక స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని నిలబెట్టుకున్న యడియూరప్ప... ఉపఎన్నికల్లో గెలిచిన 12మందిలో 11మందికి మంత్రి పదవులు ఇవ్వనున్నట్లు సంచలన ప్రకటన చేశారు. దీనిపై అధిష్టానంతో చర్చించేందుకు త్వరలో ఢిల్లీ వెళ్లనున్నట్లు యడియూరప్ప తెలిపారు.

కర్నాటకలో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే 111మంది ఎమ్మెల్యేలు కావాల్సి ఉంది. ఉపఎన్నికలకు ముందు 105 సీట్లే ఉండగా, మ్యాజిక్ ఫిగర్ కు ఆరు స్థానాలు తక్కువగా ఉన్నాయి. అయితే, ఉపపోరులో బీజేపీ 12 స్థానాలను గెలవడంతో యడియూరప్ప ప్రభుత్వ బలం 117కి చేరింది. దాంతో బీజేపీ ప్రభుత్వానికి ఢోకా లేకుండాపోయింది. అయితే, కర్నాటక ఉపఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన వారంతా ఇంతకుముందు కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలే. వీళ్లంతా కలిసి అసమ్మతి ఆట ఆడటం వల్లే బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. అయితే, ఈ రెబల్స్ వెంటనే ఎన్నికల్లో పోటీ చేయకుండా అప్పటి స్పీకర్ వేటేసినా, సుప్రీంను ఆశ్రయించి, ఉపఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేశారు. దాంతో, ఉపఎన్నికల్లో బీజేపీ తరపున 12మంది అత్యంత కీలకంగా మారారు. అందుకే, 11మందికి ఏకంగా మంత్రి పదవులు ఇచ్చేందుకు యడియూరప్ప సిద్ధమయ్యారు. 

ఇదిలాఉంటే, కన్నడ ప్రజలు కాంగ్రెస్‌కు గట్టి గుణపాఠం చెప్పారన్న మోడీ... ప్రజాతీర్పునకు వ్యతిరేకంగా ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన పార్టీలకు ఇది ఒక హెచ్చరిక లాంటిదన్నారు. త్వరలోనే వాళ్లకు కూడా తగిన సమాధానం లభిస్తుందంటూ పరోక్షంగా మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.