పది పరీక్షలు రద్దు.. ఇంటర్ ఎగ్జామ్స్ వాయిదా..

తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు రద్దయ్యాయి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. ఈ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సీబీఎస్ఈ పరీక్షలు రద్దు కాగా, ఇప్పుడు స్టేట్ ఎగ్జామ్స్ కూడా క్యాన్సిల్ కావడంతో విద్యార్థుల్లో అయోమయం. 

కరోనా ఉధృతితో దేశవ్యాప్తంగా పరీక్షలు లేకుండా పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నాయి ప్రభుత్వాలు. సెకండ్ వేవ్ కేసులతో ఇప్పటికే అన్ని రాష్ట్రాలు స్కూల్స్‌ను మూసి వేశాయి. పరీక్షలు నిర్వహించడం కష్టంగా మారడంతో.. ఎగ్జామ్స్ లేకుండానే విద్యార్థులను పై తరగతులకు పంపాలని పలు రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. పంజాబ్‌, హరియాణా, ఒడిశా రాష్ట్రాలు పరీక్షల రద్దు లేదా వాయిదాకు సిద్ధమవుతున్నాయి. 

పంజాబ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలు లేకుండానే 5, 8, 10 తరగతుల విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తోంది. 8, 10 తరగతుల విద్యార్థుల ఉత్తీర్ణతను.. ప్రీ-బోర్డ్‌ ఎగ్జామ్స్‌, ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ ఆధారంగా నిర్ణయిస్తారు.  

విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 10, 12వ తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. 10వ తరగతి పరీక్షల రద్దుతో పాటు, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు హరియాణా సర్కారు తెలిపింది.  

కొవిడ్‌ కేసులు భారీగా నమోదవుతున్న యూపీలో మే 15 వరకు పాఠశాలలను మూసి వేస్తున్నట్లు యోగి ప్రభుత్వం ప్రకటించింది. 10, 12 తరగతుల బోర్డ్‌ ఎగ్జామ్స్‌ను కూడా మే 20 వరకు వాయిదా వేశారు.