ప్రభుత్వ లోపాలే 108 నిర్లక్ష్య వైఖరికి కారణాలా...

 

అత్యవసరం అనగానే ముందుగా మనకు గుర్తోచ్చేది 108.నిర్వహణ లోపమో కానీ సిబ్బంది దుడుకుతనమో కానీ, ఫోన్ చేసినా స్పందించని వైనంతో, సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకొని తత్వం, అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడాల్సిన 108 సర్వీసులు ప్రాణాల్ని హరిస్తున్నాయి. అసలే చాలీచాలని సర్వీసులు, అందులోనూ నిర్లక్ష్యం. తెలంగాణలో 108 అంబులెన్సులు మొత్తం మూడు వందల ముప్పై ఏడు పనిచేస్తున్నాయి. వీటిలో నూట యాభై అంబులెన్స్ లు కొత్తవి కాగా మిగతావన్నీ ఆరు సంవత్సరాల పైబడినవే అందువల్ల అవి సరిగ్గా పనిచేయ్యటంలో విఫలముతున్నాయి. అందువల్ల  సరిపడినన్ని అంబులెన్స్ లేక అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. సకాలంలో వైద్యం అందక ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. 

ప్రస్తుతం వీటి నిర్వహణను జీవీకే, ఈఎంఆర్ లు నిర్వహిస్తున్నాయి. కాలం చెల్లిన వాహనాలను వినియోగిస్తుండడంతో పాటు సిబ్బందికి జీతాలు కూడా సక్రమంగా చెల్లించక పోవడంతో సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పడుతున్న ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. పాము కాట్లు, అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు సకాలంలో అంబులెన్స్ లు రాక ప్రాణాలు కోల్పోయిన వారు ఎంతో మంది ఉన్నారు. దాదాపు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వరకు ఒక్కో అంబులెన్స్ కూడా లేని పరిస్థితి. దీని వల్ల పేషెంట్ దగ్గరకు సరైన సమయంలో వెళ్ళలేక పోతున్నారు. అత్యున్నత ప్రమాణాలను పాటించకపోవడం అంబులెన్సుల్లో ఆధునిక వైద్య పరికరాలు లేకపోవడం వల్ల కూడా ప్రాణాపాయ స్థితికి రోగులు చేరుకుంటుంటారు. దీనికంతటికీ కారణం నిర్వహణ లోపమే అని 108 ఉద్యోగులంటున్నారు. జీతాలు సక్రమంగా ఇవ్వకపోవడంతో పాటు అదనపు గంటలు పని చేయించడం వల్ల ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

హైదరాబాదులో కూడా చాలినన్ని అంబులెన్సులు లేవు. ఇప్పుడున్న పరిస్థితిలో కనీసం అరవై అంబులెన్సులు అవసరం ఉంది. కానీ అన్ని లేవు, దీని వల్ల రోగులకు సకాలంలో వైద్యం అందడం లేదన్నది ఓ వాదన. దీనికి తోడు ఇరుకు రోడ్లు,భారీ ట్రాఫిక్ కూడా ప్రధాన సమస్యగా మారింది. ఏదైనా యాక్సిడెంట్ జరిగితే పది నిమిషాల్లో రావలసిన అంబులెన్స్ లు గంటలు గడిచినా రావడం లేదని రోగులు బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో నాణ్యమైన వైద్యం అందడం లేదంటున్నారు. ఒక్కొ సారి ఫోన్ చేసినా స్పందించడం లేదని ఎవరూ సరిగ్గా పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. దీనికి తోడు లంచం కూడా ఇవ్వాల్సి వస్తోందని మరికొందరు ఆరోపిస్తున్నారు. అత్యవసరమైతే తామూ రాలేమని చెప్పేస్తున్నారని పలువురు ఆరోపణలు చేస్తున్నారు. చివరికి వేలకు వేలు చెల్లించి ప్రైవేటు వాహనాల్లో ఆశ్రయించాల్సి వస్తోంది అంటున్నారు.