రాజధానిలో ఎన్టీఆర్ భారీ విగ్రహం

 

ఎన్టీఆర్ మెమోరియల్‌ను అద్భుతంగా నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. అమరావతిలోని నీరుకొండపై ఏర్పాటు చేయనున్న ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ప్రాజెక్టుకు సంబంధించి.. ఎల్‌అండ్‌టీకి చెందిన డిజైన్స్‌ అసోసియేట్స్‌ రూపొందించిన డిజైన్లను సీఎం చంద్రబాబు పరిశీలించారు. కొండపై 32 మీటర్ల ఎత్తున నిర్మించే భవనంపై 60 మీటర్ల ఎత్తైన ఎన్టీఆర్‌ కాంస్యవిగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 200 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును పర్యాటక ఆకర్షక ప్రదేశంగా తీర్చిదిద్దనున్నారు. ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ప్రాజెక్టు ఏర్పాటుచేసే కొండ చుట్టూ జలాశయాన్ని నిర్మించి ప్రాజెక్టు ప్రాంతాలను దీవిలా తీర్చిదిద్దుతారు. ఈ ప్రాజెక్టుకు రూ.406 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. విగ్రహ నిర్మాణానికి రూ.155 కోట్లు అవసరమని తేల్చారు. 10వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే మెమోరియల్‌కు మరో రూ.112.50 కోట్లు కావాలని అధికారులు తెలిపారు. ఈ మొత్తం లో చాలా వరకూ విరాళాల రూపంలో సేకరించాలని భావిస్తున్న ప్రభుత్వం.. ఒక ట్రస్ట్‌ ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది.

జలాశయం దాటి కొండ వద్దకు చేరుకోడానికి బోట్లు ఏర్పాటుచేస్తారు. వాహనాలలో వెళ్లేందుకు కాజ్‌వే కూడా ఉంటుంది. ఈ విగ్రహం లోపల అమర్చే లిఫ్ట్‌ల ద్వారా సందర్శకులు పైవరకూ వెళ్లి, అక్క డ నుంచి రాజధానిని వీక్షించవచ్చు. విగ్రహం లోపలే ఎన్టీఆర్‌ మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. చుట్టూ వాటర్‌ఫ్రంట్‌, ఆడిటోరియం, సెల్ఫీ పాయింట్‌, కేఫ్‌, యాంఫీ థియేటర్‌, మినీ ట్రైన్లతో పాటు స్టార్‌ హోటల్‌, షాపింగ్‌ సెంటర్లు, రెస్టారెంట్లు, రిసార్టులను కూడా నెలకొల్పనున్నారు. 46 నెలల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనేది లక్ష్యం.