మహిళా స్థానంలో పురుషుడి పోటీ?

 

 

 

ఓ జడ్పీటీసీ స్థానం జనరల్ మహిళకు రిజర్వేషన్ అయింది. పార్టీల్లో చాలా రోజుల నుంచి తిరుగుతున్న నేతలు తమ సతీమణులను బరిలోకి దింపుతారు. ఇది సాధారణంగా జరిగే సంగతి. అయితే.. మహిళా రిజర్వేషన్ స్థానంలో ఓ ఎస్టీ వ్యక్తి నామినేషన్ వేశాడు. స్వీకరించిన అధికారులు అన్నీ పరిశీలించి ఆటోరిక్షా గుర్తు సైతం ఇచ్చారు. మహిళా రిజర్వేషన్‌ స్థానంలో పురుషుని నామినేషన్ ఎలా చెల్లుబాటు చేశారంటూ ఎవరో అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో తేరుకుని రాత్రికి రాత్రి హడావుడిగా ఫైనల్ జాబితా నుంచి తొలగించారు.


వరంగల్ జిల్లా కొత్తగూడ జడ్పీటీసీ స్థానం జనరల్ మహిళకు రిజర్వు చేశారు. ఇక్కడ నుంచి టీడీపీ, కాంగ్రెస్‌తో సహా ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు ఫైనల్ జాబితాలో బరిలో నిలిచినట్లు ప్రకటించారు. జనరల్ మహిళ స్థానంలో ఇదే మండలం పూనుగుండ్ల గ్రామానికి చెందిన పెనుక కృష్ణారావు (ఎస్టీ) నామినేషన్ దాఖలు చేశాడు. నామినేషన్ సమయంలో కుల ధ్రువీకరణ పత్రం లేకపోవడంతో అధికారులు జనరల్ అభ్యర్థులకు తీసుకునే డిపాజిట్ రూ. 5000 తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీలకు రూ. 2500 తీసుకుంటారు. నామినేషన్ల పరిశీలనలో పేజీని నాలుగుసార్లు చూసిన అధికారులు అన్నీ ఒకే చెప్పారు. ఉపసంహరణల తర్వాత రంగంలో ఉన్న అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. అందులో కృష్ణారావుకు ఆటో గుర్తు ఇచ్చారు. చివరకు ఎవరో అభ్యంతరం వ్యక్తం చేయడంతో నాలుక కొరుక్కుని.. తూచ్ అంటూ కృష్ణారావు పేరు తీసేశారు.