షర్మిల ప్రసంగంతో వైఎస్ఆర్ సీపీలో చీలిక

 

 

 

సాధారణంగా ఎక్కడైనా ఒక పార్టీకి చెందిన అగ్రనాయకులు పర్యటిస్తే ఆ ప్రాంతంలో సదరు పార్టీ ఎంతోకొంత బలోపేతం అవుతుంది. అప్పటివరకు అభిమానులుగా మాత్రమే ఉన్నవారు కూడా పార్టీ సభ్యులుగా చేరే అవకాశం ఉంటుంది. కానీ, జగన్ పార్టీలో అందుకు పూర్తి భిన్నంగా జరుగుతోంది. తొందరపడి ఒక కోయిల ముందే కూసినట్లు.. నోటిఫికేషన్ వెలువడగానే జగన్ కుటుంబంలోని ముగ్గురు నాయకులు తలో మైకు పట్టుకుని మూడు ప్రాంతాలకు వెళ్లిపోయారు. వాళ్లలో జగనన్న వదిలేసిన బాణం షర్మిల మాటలు ఇప్పుడు ఆ పార్టీ చాపకిందకి నీళ్లు తెస్తున్నాయి.


కృష్ణా జిల్లా నూజివీడులో షర్మిల చేసిన ప్రసంగం ఆ పార్టీకి చేటు తెచ్చింది. మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు నూజివీడు అసెంబ్లీ స్థానం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ఆమె బహిరంగంగా ప్రకటించారు. దీంతో ఇదే సీటు ఆశిస్తున్న మరో నాయకుడు లాకా వెంగళరావు యాదవ్ తీవ్ర ఆవేదనకు గురై.. అక్కడినుంచి వెళ్లిపోయారు. ఇది ఏకంగా పార్టీలోనే చీలికకు కారణం అయ్యేలా ఉంది. ఉదయం 9.30 గంటలకే షర్మిల వస్తారని నాయకులు ప్రకటించడంతో రెండు గంటల పాటు జనం ఎండలో వేచి ఉండాల్సి వచ్చింది. ఇక ప్రతాప్ పేరు ప్రకటించగానే వెంగళరావు యాదవ్ అనుచరులు, ఆయన అభిమానులు ఒక్కొక్కరుగా అక్కడినుంచి వెళ్లిపోయారు. పార్టీలో రాబోయే రోజుల్లో పరిస్థితికి ఇది అద్దం పడుతోందని పలువురు వ్యాఖ్యానించారు.