రాజీనామా చేస్తా...విలీనం చేస్తారా?..విజయశాంతి

 

 

 

కాంగ్రెస్ పార్టీకి తాను రాజీనామా చేస్తే, టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తారా? అని ఎంపీ విజయశాంతి ప్రశ్నించారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మెదక్ ఎంపీ విజయశాంతి టీఆర్ఎస్ విలీనంపై మీడియాతో మాట్లాడారు. ఒకవేళ తనని కాంగ్రెస్ పార్టీలో చేర్చుక్కునందుకే విలీనంపై వెనక్కి తగ్గినట్లయితే..తాను రాజీనామా చేయడానికి సిద్దంగా వున్నానని స్పష్టం చేశారు.

 

తనను కాంగ్రెస్ లో చేర్చుకోవడం తప్పు అయితే , కాంగ్రెస్ ఎమ్.పిలను మందా జగన్నాధం, వివేక్ లను టిఆర్ఎస్ లో ఎలా చేర్చుకున్నారని ఆమె గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే పార్టీని విలీనం చేస్తానని చెప్పిన కేసిఆర్ కుంటిసాకులతో తప్పించుకోవాలని చూస్తున్నారని అన్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన టీఆర్ఎస్, ఇచ్చిన మాటకు కట్టుబడి వుండాలని పేర్కొన్నారు. ఆ మాట అడిగితె ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు.

 

తెరాసలో తనని చాలా ఇబ్బంది పెట్టారని అన్నారు. షోకాజ్ నోటిసులు ఇవ్వకుండా పార్టీ నుండి సస్పెండ్ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ అధిష్టానం అప్పగించే బాధ్యతలు నిర్వహించేందుకు సిద్దంగా వున్నానని తెలిపారు. తెలంగాణ ప్రజల కోసమే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని అన్నారు.