నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష....బీజేపీ మీద కాంగ్రెస్ రివర్స్ ఎటాక్ ?

 

నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష,  ఎవరికీ చెడు విద్యలు నేర్పించకు. అవతలి వాడు ఆ విద్యలు నీ మీద కూడా ప్రయోగించగలడు. నీటిలో నీ ముఖం ప్రతిబింబించినట్టుగా నీవు ఇతరులకి నేర్పిన విద్య నీ మీద కూడా ప్రతిఫలించ గలదని చెప్పారు మహానుభావులు. ఇప్పుడు అదే బీజేపీ విషయంలో నిజమయ్యింది. తాజాగా మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది. 

బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు నారాయణ్ త్రిపాఠీ, శరద్ కౌల్ కాంగ్రెస్ గూటికి చేరారు. దాంతో కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని కూలుస్తామని బెదిరించిన బీజేపీకి ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు తగ్గినట్లైంది. నిజానికి కర్ణాటకలో ఆపరేషన్ కమలం పూర్తవ్వడంతో బీజేపీ తదుపరి లక్ష్యం మధ్యప్రదేశ్ అని చర్చ జరిగింది. 

దానికి ఊతం ఇచ్చేలాగా మోదీ, అమిత్ షా కనుసైగ చేస్తే చాలు 24 గంటల్లోనే మీ ప్రభుత్వం కూలిపోతుందని అసెంబ్లీలోనే బీజేపీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. దీంతో ఆపరేషన్ కమలం మధ్యప్రదేశ్‌లో మొదలైనట్టేనని భావించారు. కానీ కర్ణాటకను చేజార్చుకున్న కాంగ్రెస్ ఇక్కడ ముందుకు ముందే జాగ్రత్త ఒఅడింది. శాసనసభలో నీ ప్రభుత్వం కూల్చేస్తాం జాగ్రత్త అని పరోక్షంగా తనకే వార్నింగ్ ఇచ్చిన కమలనాథులకు సీఎం కమల్‌నాథ్ ఎదురు దాడి చేశారు. 

నిన్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో క్రిమినల్ లా చట్ట సవరణకు ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు. ఈ ఓటింగ్ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలు నారాయణ్ త్రిపాఠి, శరద్ కౌల్‌లు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేశారు. అంతేకాదు బుధవారం రాత్రి సీఎం కమల్‌నాథ్ ఇచ్చిన విందులో వీరు పాల్గొన్నారు.  దీంతో మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని త్వరలో గద్దె దించుతామన్న ఆ పార్టీకి షాక్ తగిలింది. 

క్రిమినల్ లా సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సమయంలో బీఎస్పీ ఎమ్మెల్యే సంజీవ్ సింగ్ దీనిపై ఓటింగ్ జరగాలని డిమాండ్ చేశారు. దాంతో స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు. ప్రభుత్వానికి అనుకూలంగా 122 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 121 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. కానీ దానికి 122 ఓట్లు వచ్చాయి. ఒక ఓటు స్పీకర్‌ది. విపక్షాలకు ఒక్క ఓటు కూడా రాలేదు. ఎందుకంటే ఓటింగ్‌లో బీజేపీ పాల్గొనలేదు. 

అయితే, బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటు వేశారు. మధ్యప్రదేశ్‌లోనూ కర్ణాటక పరిణామాలు రిపీట్ ఆయె అవకాశాలు ఉన్న నేపథ్యంలో.. ఆపరేషన్ కమలానికి చెక్ పెట్టేలా ద్వారా కాంగ్రెస్ పార్టీ ముందుగా మేల్కొని ఆపరేషన్ కమల్‌నాథ్ చేపట్టింది.  మధ్యప్రదేశ్ లో శాసనసభ్యుల సంఖ్య 230 కాగా సాధారణ మెజారిటీ 116 సీట్లు, అయితే కూటమి పార్టీలతో కలిసి కాంగ్రెస్‌ బలం 121 సీట్లు, అందులో కాంగ్రెస్‌ (114), బీఎస్పీ (2), ఎస్పీ(1), స్వతంత్రులు (4) ఉండగా, బీజేపీ బలం 109 సీట్లు. 

కమల్ నాథ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు మద్దతుగా ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు నారాయణ్ త్రిపాఠి, శరద్ కౌల్ ఓటు వేశారు. ఆ ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ తన హస్తాల్లో పెట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తమకు అనుకూలంగా ఓటేసిన బీజేపీ ఎమ్మెల్యేలిద్దరిని కాంగ్రెస్ ఎవరికి తెలియని ప్రదేశంలో రహస్యంగా ఉంచింది.