నేడు లోక్ సభకి తెలంగాణ బిల్లు

 

రాష్ట్ర విభజన బిల్లుని మొదట రాజ్యసభలో ప్రవేశపెడదామని ప్రయత్నించి భంగపడిన కాంగ్రెస్ అధిష్టానం, అధికార ప్రతిపక్ష పార్టీ నేతలనేకమంది రాష్ట్ర విభజన బిల్లు లోపభూయిష్టంగా, రాజ్యాంగ విరుద్దంగా ఉందని గట్టిగా వాదిస్తుండటంతో, మరోమారు అటువంటి చేదు అనుభవం ఎదుర్కోకూడదనే ఆలోచనతో బిల్లుపై కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ సలహా కోరింది. రాష్ట్ర విభజన బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు ఎటువంటి సవరణలు, మార్పులు చేయనవసరం లేదని, బిల్లుని యధాతధంగా లోక్ సభలో ప్రవేశపెట్టవచ్చని, బిల్లుని ఆమోదించడానికి సాధారణ మెజార్టీ సరిపోతుందని న్యాయశాఖ చెప్పడంతో కాంగ్రెస్ అధిష్టానానికి ఏనుగంత బలం చేకూరినట్లయింది. అందుకే ఈరోజు మధ్యాహ్నం 12.30గంటలకు బిల్లుని లోక్ సభలో ప్రవేశపెట్టేందుకు హోంమంత్రి సుషీల్ కుమార్ షిండే సిద్దమవుతున్నారు.

 

అదేవిధంగా సీమాంధ్ర యంపీలు, మంత్రులు ఎట్టిపరిస్థితుల్లోనూ బిల్లుని సభలో ప్రవేశపెట్టకుండా అడ్డుకొనేందుకు కృత నిశ్చయంతో ఉన్నారు. అందువలన ఈరోజు పార్లమెంటు రణరంగంగా మారే అవకాశముంది గనుక, కాంగ్రెస్ అధిష్టానం వారందరినీ సభ నుండి సస్పెండ్ చేయమని స్పీకర్ మీరాకుమార్ కి ముందే సూచించి ఉండవచ్చును. ఇంతవరకు జరిగిన వ్యవహారమంతా కాంగ్రెస్ అధిష్టానానికి అనుకూలంగా ఏకపక్షంగానే సాగుతోంది గనుక, ఈరోజు స్పీకర్ కూడా అధిష్టానం మాట మన్నించి వారిని సభ నుండి సస్పెండ్ చేసి బిల్లుని ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమం చేయవచ్చును.