ఉగాది నాటికి దోస్తీ?

 

 

 

ఇరు పార్టీల మధ్య రెండు మూడు రోజులపాటు మాటల తూటాలు పేలినా మళ్లీ వాతావరణం చల్లబడింది. పొత్తు చర్చల బాధ్యత తీసుకొన్న బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ప్రకాశ్ జవదేకర్ గురువారం హైదరాబాద్‌లోనే గడిపారు. ముందు తమ పార్టీ నేతలతో మాట్లాడిన ఆయన తర్వాత టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్‌తో ఫోన్లో చర్చలు జరిపారు. రెండు మూడు రోజులు ఇక్కడే ఉండి పొత్తుల వ్యవహారాన్ని ఓ కొలిక్కి తీసుకురావాలని జవదేకర్ చూస్తున్నారు. వీలైతే ఈ నెల 31వ తేదీ ఉగాది రోజున పొత్తుపై అధికారిక ప్రకటన వెలువడేలా చూడాలన్నది యోచన అంటున్నారు.

 

పంచుకోవాల్సిన సీట్లపై ఇరు పార్టీలు కుస్తీలు పడుతున్నాయి. తాజాగా వెల్లడైన సమాచారం ప్రకారం బీజేపీ.. తెలంగాణాలో తొమ్మిది ఎంపీ సీట్లు, 45 అసెంబ్లీ సీట్లు, సీమాంధ్రలో 6 ఎంపీ సీట్లు, 20 అసెంబ్లీ సీట్లు కోరింది. అయితే తెలంగాణలో 6 ఎంపీ సీట్లు, 25అసెంబ్లీ సీట్లు, సీమాంధ్రలో 3 ఎంపీ సీట్లు, 8 అసెంబ్లీ సీట్లు ఇవ్వడానికి టీడీపీ సిద్ధపడింది. స్థానికంగా సీట్ల వ్యవహారం తేలకపోతే అంతిమంగా బీజేపీ జాతీయ నేత అరుణ్ జైట్లీ రంగంలోకి దిగి టీడీపీ అధినేత చంద్రబాబుతో మాట్లాడి దీనికి ముగింపు పలికే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.



ఒక పక్క పొత్తు చర్చలు జరుగుతుండగానే.. బీజేపీ నేతలు భిన్న స్వర్వం వినిపిస్తున్నారు. పొత్తులున్నా, లేకపోయినా తమ పార్టీ మాత్రం ఎన్నికలకు సిద్ధంగా ఉందని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు చెప్పగా, తాము పొత్తులకు సిద్ధంగా లేమని, కేవలం సర్దుబాట్లకే సిద్ధంగా ఉన్నామని బీజేపీ తెలంగాణా శాఖ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.