సీమాంధ్ర ఎంపీల డ్రామా..కాంగ్రెస్ కుట్ర!

 

ఈరోజు లోక్ సభ సాక్షిగా రాష్ట్ర కాంగ్రెస్ యంపీలు తెలుగు ప్రజల పరువు పూర్తిగా తీశారు. విభజన బిల్లు ప్రవేశపెట్టకుండా హోంమంత్రి షిండేని అడ్డుకోవాలని సీమాంధ్ర యంపీలు, వారిని నిలువరించాలని తెలంగాణా యంపీలు వారి అధిష్టాన దేవత సోనియాగాంధీ కళ్ళ ముందే ఒకరినొకరు కొట్టుకొన్నంత పని చేసారు. ఆతరువాత అందరూ మీడియా ముందుకు వచ్చి ఒకరినొకరు నిందించుకొంటూ తెలుగు జాతి పరువుని పూర్తిగా గంగలో కలిపేసారు.

 

బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ మీడియాతో మాట్లాడుతూ, "ఇటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లో తెలంగాణా బిల్లుని ప్రవేశపెట్టవద్దని మేము ప్రధానమంత్రికి ముందే సూచించాము. కానీ, కాంగ్రెస్ పార్టీ మా సూచనను పట్టించుకోకుండా సభలో బిల్లు ప్రవేశపెట్టి, తన సభ్యులే ఒకరితో మరొకరు కలహించుకొంటుంటే సోనియాగాంధీ నిర్లిప్తంగా చూస్తూ కూర్చోన్నారు. స్వంత పార్టీ సభ్యులనే అదుపు చేయలేనివారు దేశాన్ని ఏవిధంగా పాలిస్తున్నారో వారికే తెలియాలి?" అని ఆమె ఎద్దేవా చేసారు.

 

ఏమయినప్పటికీ, ఈరోజు సీమాంధ్ర కాంగ్రెస్ యంపీలు వ్యవహరించిన తీరు వలన బిల్లుకు వ్యతిరేఖంగా ఓటు వేద్దామనుకొన్నవారు సైతం అనుకూలంగా వేసేందుకు సిద్దపడినట్లయితే, ఆవిధంగా వారిచేత ఓటు వేయించేందుకే కాంగ్రెస్ అధిష్టానం తన యంపీల చేత ఈ నాటకం ఆడించిందని భావించవలసి ఉంటుంది. బిల్లుని ఆమోదించడానికి సభలో సాధారణ మెజారిటీ సరిపోతుందని న్యాయశాఖ స్పష్టం చేసింది గనుక, సభలో తన సభ్యులచేతనే ఈవిధంగా రాద్ధాంతం చేయించి, వారిని సభ నుండి సస్పెండ్ చేసి, సభలో మిగిలినవారి సహకారంతో మూజువాణి ఓటు ద్వారా బిల్లుని ఆమోదింపజేయాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తున్నట్లు ఉందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. "కాంగ్రెస్ యంపీలందరూ ఒకరితో ఒకరు కుమ్ములాడుకోవడం కాంగ్రెస్ కుట్రగానే మేము భావిస్తున్నామని" సుష్మా స్వరాజ్ చెప్పడం చూస్తే ఈ అనుమానం నిజమేననిపిస్తుంది. విభజన బిల్లుని తమ వోటు ద్వారా కాక మంద బలంతో అడ్డుకొందామని వారు భావించడం వలన బిల్లుకి అనుకూలంగా పరిస్థితులు మారవచ్చుననే గ్రహింపు వారికి లేదని భావించలేము. కనుక సుష్మా స్వరాజ్ చెపుతున్నట్లు, వారు బిల్లుని అడ్డుకోవడానికి కాక దానిపై ఎటువంటి చర్చ జరగకుండా అడ్డుకొని ఆమోదింపజేసేందుకే సభలోఈ విధంగా గొడవ చేస్తూన్నారని అనుమానించక తప్పదు.