సహారా సుబ్రతోరాయ్: చిప్పకూడే గతి!

 

 

 

జనాల చెవ్లులో క్యాలీఫ్లవర్లు పెట్టి లక్షల కోట్ల రూపాయలు మింగేసిన సహారా సంస్థ అధినేత సుబ్రతోరాయ్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో వున్నాడు. ఆయన్ని తీహార్ జైల్ నుంచి గృహ నిర్బంధంలోకి మార్చాలని ఆయన లాయర్ రామ్ జెఠ్మలానీ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. సహారా సంస్థకి వున్న అప్పులు తీర్చాలంటే ఆస్తులు అమ్మాలి. ఆస్తులు అమ్మాలంటే వాటిని కొనుగోలు చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి చూపిస్తున్న వారితో చర్చలు జరపాలి. ఆ చర్చలు తీహార్ జైల్లో జరిపే అవకాశం లేదు. వాటిని సుబ్రతోరాయ్ తన ఇంట్లో జరపాల్సి వుంటుంది. అందువల్ల సుబ్రతోరాయ్‌ని తీహార్ జైల్లోంచి గృహ నిర్బంధంలోకి పంపించాలని రామ్ జెఠ్మలానీ కోర్టుకు విన్నవించారు. అయితే న్యాయస్థానం అందుకు అంగీకరిచంలేదు. తాము సుబ్రతోరాయ్‌కి శిక్ష విధించలేదని, జ్యుడీషియల్ కస్టడీలో మాత్రమే ఉంచాం కాబట్టి గృహ నిర్బంధం చేసే అవకాశం లేదని కోర్టు చెప్పింది. దాంతో సుబ్రతోరాయ్‌కి తీహార్ జైల్లో చిప్పకూడే గతి అని డిసైడ్ అయిపోయింది.