రాహుల్ గుండెలో లేడీబాంబు!

 

 

 

నిన్నటి వరకూ అమేథీ నియోజకవర్గంలో తనకి తిరుగు లేదని అనుకుంటున్న ‘యువరాజు’ రాహుల్ గాంధీ గుండెలో బాంబు పడింది. ఆ బాంబు కూడా మామూలు బాంబు కాదు... మాంఛి పవర్ ఫుల్ లేడీ బాంబు. ఆ లేడీ బాంబు పేరు స్మృతి ఇరానీ. ‘క్యోంకీ సాంస్ భీ కభీ బహూ..’ సీరియల్ ద్వారా దేశవ్యాప్తంగా బోలెడంతమంది అభిమానులను సంపాదించుకున్న స్మృతి ఇరానీకి ఉత్తరాదిలో అభిమానులు వెల్లువలా వున్నారు. అ అభిమాన వెల్లువే ఆమెను పార్లమెంట్‌కి పంపించింది. ఈ లేడీ బాంబును బీజేపీ ఈసారి రాహుల్ గాంధీ మీద ప్రయోగించాలని డిసైడ్ అయింది.

 

ఇప్పటి వరకూ రాజీవ్ గాంధీ మీద వున్న సానుభూతే అమేథీలో గాంధీ కుటుంబాన్ని గెలిపిస్తూ వస్తోంది. ఈసారి ఆ పప్పులు అక్కడ ఉడకవన్న అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. అవినీతిలో కూరుకుపోయిన యుపిఎ ప్రభుత్వం రాహుల్ విజయావకాశాలను సన్నగిల్లేలా చేసిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. పులిమీద పుట్రలా ఇప్పుడు ఆ స్థానం నుంచి బీజేపీ స్మృతి ఇరానీని రంగంలోకి దించడం కాంగ్రెస్ వర్గాల్లో కలవరానికి, రాహుల్ గాంధీ గుండెల్లో బాంబు పేలడానికి కారణమైంది.



స్మృతి ఇరాని కేవలం నటి మాత్రమే కాదు. మంచి వక్త. తన ప్రసంగాలతో ప్రజలను తనవైపు తిప్పుకోవడంలో సిద్ధహస్తురాలు. పరిపాలనాదక్షురాలిగా కూడా పేరు సంపాదించుకున్నారు. ఈ ఎన్నికలలో రాహుల్‌ని ఓడించడానికి ఆమె సమర్థురాలని బీజేపీ విశ్వసించింది. స్మృతి ఇరానీ రంగంలోకి దిగడంతో కాంగ్రెస్ వర్గాలు ఎలర్ట్ అయ్యాయి. గతంలో మాదిరిగా లైట్‌గా తీసుకోకుండా అమేథీ మీద అధిక శ్రద్ధ తీసుకోవాలని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాకపోతే కాకపోయాడు కనీసం ఎంపీగా అయినా మిగలాలని ప్రయత్నాలు ప్రారంభించాయి.