అమ్మాయిలతో మాట్లాడితే అంతే...

 

కాలేజ్ అన్న తరువాత అమ్మాయిలు, అబ్బాయిలు మాట్లాడుకోవడం సహజం. అయితే కొంత మంది మాత్రం ప్రేమకు ఆకర్షితులై తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటారు. ఇలాంటి పరిస్థితులను అధిగమించడానికి చైనాలోని  ‘క్వింగ్‌డావో బిన్‌హాయ్‌’ ఓ విశ్వవిద్యాలయం కొన్ని నిబంధనలు విధించింది. పాటించడానికి అవి కాస్త కష్టంగానే ఉన్నా విద్యార్ధులు మాత్రం తప్పక పాటించాల్సిందే. ఇంతకీ ఆ నిబంధనలు ఏంటంటే..

 

* విద్యార్థిని విద్యార్థులు కళాశాల ఆవరణలో కలిసి తిరగకూడదు. మాట్లాడుకోకూడదు. కనీసం కన్నెత్తి కూడా చూసుకోకూడదు.

* చేతిలో చేయి వేసుకొని కనిపించకూడదు.

* ఒకే హెడ్‌సెట్‌తో పాటలు వినడానికి వీల్లేదు.

* క్యాంటీన్‌లో భోజనం చేసేప్పుడు అమ్మాయిలు.. అబ్బాయిలు ఎలాంటి సంభాషణలు, సంజ్ఞలు చేసుకోకూడదు.

 

ఒకవేళ ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే వారికి శిక్ష అమలు చేస్తారు. ఆ శిక్ష ఏంటంటే.. కళాశాల మరుగుదొడ్లను, పరిసరాలను శుభ్రం చేయాలి. ఈ శిక్షలు విద్యార్థులకే కాదండోయ్‌.. విశ్వవిద్యాలయ సిబ్బందికీ వర్తిస్తాయి.ఈ కఠినమైన నిబంధనల గురించి యూనివర్సిటీ మేనేజర్‌ మాట్లాడుతూ ‘సమాజంలో ప్రజలతో ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలో విద్యాలయం నుంచే అలవరుచుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. విద్యార్థుల భవిష్యత్తుకి ఇది బాగా ఉపయోగపడుతుంది’’ అని అన్నారు. మరి విద్యార్ధులు ఈ కఠినమైన నిబంధనలు పాటిస్తారా.. లేక ఏకంగా వేరే కాలేజ్ నే చూసుకుంటారా చూద్దాం..