లగడపాటిపై కేంద్ర మంత్రుల బ్లేమ్ గేమ్

 

 

 

తనను సభ నుంచి సస్పెండ్ చేయడంపై విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడియంలోకి వచ్చినందుకే తనను సస్పెండ్ చేస్తే.. తనతోపాటు మరో వందమంది కాంగ్రెస్ ఎంపీలు కూడా వెల్‌లోకి వచ్చారని, మరి.. వారిని ఎందుకు సస్పెండ్ చేయలేదని ఆయన ప్రశ్నించారు. సీమాంధ్ర ఎంపీల అంతు చూడండి అంటూ కేంద్ర మంత్రులే వీరిని వెల్‌లోకి పంపించారని ఆరోపించారు. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, లేకపోతే వందమందినీ సస్పెండ్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టలేదని చెప్పారు. స్పీకర్ ఏకపక్షంగా అధికార పక్షంతో కలిసిపోయి దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో సీటు కోసం, టికెట్ కోసం, బీఫారం కోసం స్పీకర్ పని చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ విభజన వాదమే ఆమె వాదమని దుయ్యబట్టారు. ప్రాణ రక్షణ కోసం పెప్పర్ స్ప్రే వాడొచ్చని పార్లమెంటు సాక్షిగా రుజువు చేశానన్నారు. తనపై నింద మోపేలా కాంగ్రెస్‌కు చెందిన కేంద్ర మంత్రులే బ్లేమ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు.