ఒక్క దెబ్బకు నాలుగు పిట్టలు-కేటీఆర్

 

టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఏర్పడిన మహాకూటమి పార్టీలపై ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్వీ రాష్ట్ర కమిటీ భేటీలో ఆయన మాట్లాడారు.కాంగ్రెస్‌, తెదేపా పొత్తు బలంగా ఉండాలని కోరుకుంటున్నా. తెలంగాణ జనసమితి, సీపీఐ కూడా మహాకూటమిలో భాగస్వాములుగా చేరాయి. ఒక్క దెబ్బకు నాలుగు పిట్టలను కొట్టే అవకాశం వచ్చింది. మహాకూటమిలోని పార్టీలు విడిపోకుండా చూడాలి. ఆ కూటమి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా ఎవరుంటారు? మహాకూటమిలో ఉన్నవాళ్లంతా ముఖ్యమంత్రి పదవి కావాలంటారు. ఆ కూటమి అధికారంలోకి వస్తే 3 నెలలకోసారి ముఖ్యమంత్రి మారుతారు. ఢిల్లీ నుంచి వచ్చే సీల్డ్‌ కవర్‌లో ఉన్న వ్యక్తే సీఎం అవుతారు.ప్రాజెక్టులను అడ్డుకునేందుకు చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాసింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. మహాకూటమి గెలిస్తే ప్రాజెక్టులు ముందుకు సాగుతాయా? అని అన్నారు.

కేసీఆర్‌ను ఎందుకు దించాలి? సాగునీటి ప్రాజెక్టులను పరుగులు తీయిస్తున్నందుకా? 24 గంటల విద్యుత్‌ అందిస్తున్నందుకా? నాలుగేళ్లలో 40వేల ఉద్యోగాలు భర్తీ చేసినందుకా? అని ప్రశ్నించారు.నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికన ఉద్యమం జరిగిందని కేటీఆర్‌ ఈ సందర్భంగా గుర్తుచేశారు. కోటి ఎకరాల మాగాణి కోసం సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని, మిషన్‌ భగీరథ ద్వారా తాగునీరు అందించేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ఓట్లు వేసే నాటికి ఇంటింటికీ నీళ్లు అందుతాయన్నారు.