కిషన్‌రెడ్డి కిరికిరి!

 

 

 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిలో రూపాయంత ఆలోచన వుందిగానీ, దాంతోపాటే రూపాయి పావలా అంత ఆవేశం వుంది. పావలా ఎక్కువున్న పాపానికి ఆయన ఆలోచనని ఆవేశం డామినేట్ చేస్తోంది అదీ కిషన్‌రెడ్డితో వచ్చిన సమస్య! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించాలని, తెలంగాణ ఇచ్చేయాలని బీజేపీ కేంద్ర నాయకత్వానికి పెద్దగా ఆలోచన లేకపోయినప్పటికీ, విభజనవాదాన్ని బీజేపీ మెడమీద గుదిబండలా వేసింది మాత్రం కిషన్‌రెడ్డి లాంటి బీజేపీ తెలంగాణ నాయకులే!

 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే లాభాల కంటే నష్టాలే ఎక్కువగా వున్నాయని తెలిసినా తెలంగాణ వాదానికి మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితిలోకి బీజేపీ చేరుకుంది. కాంగ్రెస్ అడ్డగోలుగా తెలంగాణను విభజిస్తోందని అర్థమైపోతున్నా ఏమీ చేయాలేని స్థితిలో బీజేపీ వుంది. దీనికి కిషన్‌రెడ్డి కూడా కారణం. తెలంగాణకు మద్దతిస్తే ఈ ప్రాంతంలో బీజేపీ హవా నడుస్తుందని, బోలెడన్ని సీట్లు వస్తాయని బీజేపీ కేంద్ర నాయకత్వంలో అతి నమ్మకం కలిగించారు. ఇప్పుడు కేంద్రం తెలంగాణ రాష్ట్రం ప్రకటించాక బీజేపీకి అసలు పరిస్థితి అర్థమైంది. అటు సీమాంధ్రలో తుడిచిపెట్టుకుపోవడం, ఇటు తెలంగాణలో మూలనపడటం ఖాయమని తెలుసుకుంది. జరిగిన నష్టాన్ని పూడ్చుకునే భాగంగా బీజేపీ కేంద్ర నాయకత్వం తెలుగుదేశం పార్టీకి చేరువయ్యే ప్రయత్నాలు చేస్తోంది.




నరేంద్రమోడీ ప్రధాని అభ్యర్థిగా ముందుకు వచ్చిన తర్వాత ఆ ప్రయత్నాలు మరింత ముమ్మరమయ్యాయి. అయితే ఈ పరిణామాలను కరడుగట్టిన విభజనవాది కిషన్‌రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే తెలుగుదేశంతో దోస్తీకి బీజేపీ ప్రయత్నించడం లేదని వారానికి నాలుగుసార్లు ప్రకటిస్తున్నారు. అటు సీమాంధ్రలో, ఇటు తెలంగాణలో బీజేపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేసి ఘన విజయాలను సాధిస్తుందని చెబుతున్నారు. కిందపడ్డా నాదే పైచేయి అనే తత్వం కిషన్‌రెడ్డిలో కనిపిస్తోంది. వచ్చే ఎన్నికలలో బీజేపీ ఇప్పుడున్న రెండు అసెంబ్లీ స్థానాలను గెలుచుకునేది కూడా కష్టమేనని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశంతో స్నేహం కుదరబోతుంటే ఎగిరి గంతేయాలే తప్ప మోకాలు అడ్డు వేసే వ్యాఖ్యలు చేయడం మంచిదికాదని అంటున్నారు. అయినా ఎవరికి ఏది ప్రాప్తమో అది జరగకుండా ఆగుతుందా?