కేసీఆర్ నోట రాజీనామా మాట

 

 

 

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి వారం కూడా తిరక్కుండానే టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నోట ‘రాజీనామా’ మాట వచ్చింది. ఆయన మాట మీద నిలబడే నాయకుడు కాదని అందరికీ తెలిసినప్పటికీ ఈ టైమ్‌లో ఆయన నోటి వెంట రాజీనామా చేస్తానంటూ మాట బయటపడటం విచిత్రంగా వుంది. ఇంతకీ కేసీఆర్ నోట రాజీనామా మాట వచ్చి సందర్భం ఏమిటో చూద్దాం.

 

కేసీఆర్ తాను ఎమ్మెల్యేగా గెలిచిన గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కలవటానికి జిల్లా స్థాయి ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు చాలామంది వచ్చారు. జనాన్ని చూస్తే కేసీఆర్‌కి ఏదో ఒకటి మాట్లాడాలని అనిపిస్తుంది కదా.. అందుకే మాట్లాడారు. ఆ మాటల్లో భాగంగానే తన రాజీనామా ప్రస్తావన కూడా వచ్చింది. గజ్వేల్ నియోజకవర్గం ప్రజలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యను నివారిస్తానని కేసీఆర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. రెండేళ్ళ తర్వాత నీటి సమస్యలు తీరక గజ్వేల్ నియోజకవర్గంలో మహిళలు మంచినీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్లపైకి వస్తే తాను తన పదవికి రాజీనామా చేస్తానని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు.


కేసీఆర్ స్టేట్‌మెంట్ విన్న అక్కడ వున్న చాలామంది చప్పట్లు కొట్టారు. కేసీఆర్ రాజీనామా చేస్తానంటే చప్పట్లెందుకు కొట్టారో కొంతమందికి అర్థంకాక అయోమయానికి గురయ్యారు. మరికొందరు మాత్రం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానన్న మాట ఆయన నోటి వెంట వచ్చిందంటే, నిప్పు లేకుండా పొగ రాదన్నట్టు దీని వెనుక ఏదైనా కారణం వుందా అని ఆలోచించారు. మరికొందరు మాత్రం కేసీఆర్‌కి ఆడిన మాట తప్పే అలవాటు వుంది కాబట్టి ఆయన అంత ఈజీగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడులే అనుకుని సరిపెట్టుకున్నారు.