జైల్లో జగన్ పరిపాలన సాగుతోందా?

 

ఒక వైపు క్రింద నుండి పైవరకు అన్ని కోర్టులు కూడా జగన్ కి బెయిలు ఇవ్వడానికి కూడా నిరాకరిస్తూ అయన పట్ల కటువుగా వ్యవహరిస్తున్నపటికీ, ఆ విషయాన్ని మరుగుపరిచి, తెదేపా కాంగ్రెస్ పార్టీలు రెండూ కుమ్మకై జగన్ మోహన్ రెడ్డిని అన్యాయంగా జైల్లో నిర్బందించాయని వైకాపా నేతలు షర్మిల, విజయమ్మ తదితరులు ప్రజలకి నమ్మబలుకుతున్నారు. అయితే, అదే సమయంలో ‘పులి బయట ఉన్నాలోపల ఉన్నా పులి పులే!’ అని షర్మిల చెపుతున్నట్లుగానే జైల్లో జగన్ మోహన్ రెడ్డి ప్రవర్తించడం మరో విశేషం. తను జైల్లో ఉన్నా బయట ఉన్నాతన వ్యవహారాలు మాత్రం సజావుగా సాగిపోతాయని ఆయన చెప్పడమే కాకుండా దానిని ఆచరణలో అమలుపరచి కూడా చూపుతున్నారు.

 

ఆయన జైలునే పార్టీ కార్యాలయంలా మార్చేసుకొని కులాసాగా వ్యహారాలు చక్కబెట్టుకొంటున్నారని సాక్షాత్ అధికార పార్టీ నేతలయిన, ఆనం రామినారాయణ రెడ్డి, వీ.హనుమంత రావు వంటి వారే స్పష్టంగా చెప్పడం అందుకు ఋజువు అయితే, జైలులో నిబందనలు ఉల్లంఘనలు జరుగుతున్నట్లు జైళ్ళ శాఖ తెలుగుదేశం పార్టీకి స్వయంగా ఇచ్చిన నివేదిక చాటిచెపుతోంది. అయినప్పటికీ, వైకాపా తన ఆరోపణలను మానుకోలేదు. ప్రభుత్వం కూడా జగన్ విషయంలో చూసి చూడనట్లు ప్రవర్తిస్తోంది.

 

చంద్రబాబో, కిరణ్ కుమార్ రెడ్డో ఒకవేళ అరెస్ట్ అయితే నిబందనల ప్రకారమే విజిటర్స్ ని కలుస్తారా? అంటూ నిబంధనల ఉల్లంఘనలు సహజమనట్లు జగన్ భార్య భారతి ఎదురు ప్రశ్నించడం చూస్తే చంచల్ గూడా జైల్లో ఏమి జరుగుతోందో స్పష్టం చేస్తోంది. ఇటువంటి నేపద్యంలో కూడా జైళ్ళశాఖ అధికారులు చంచల్ గూడా జైలులో నిబంధనలకి విరుద్ధంగా ఏమీ జరగట్లేదని బుకాయించడం విశేషం.

 

ఏమయినప్పటికీ, ఇదంతా చూస్తే జగన్ మోహన్ రెడ్డి జైలులో సిబ్బందిని నయాన్నో భయన్నో లొంగ దీసుకొన్నాడనేది మాత్రం స్పష్టం అవుతోంది. 2జి.స్కాములో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఏడాది పైగా గడిపిన ఏయస్.రాజా కానీ, కనిమోలి గానీ ఇతర రాజకీయకులు గానీ ఎన్నడూ ఈ విధమయిన దుర్వినియోగానికి పాల్పడినట్లు వార్తలు రాలేదు. కానీ, జగన్ మోహన్ రెడ్డి మాత్రం జైలు నుండే తన వ్యాపార మరియు పార్టీ కార్యక్రమాలన్నిటినీ కూడా నిర్వహించుకోగలగడం విశేషం.

 

ఆయనను కలవడానికి వచ్చే రాజకీయ నాయకులు కూడా జైలు బయటే ప్రెస్ మీట్ పెట్టేయడం చూసినట్లయితే, జగన్ విషయంలో ఎటువంటి నిబంధనలు వర్తించవని అర్ధం అవుతుంది. అయినప్పటికీ, తాము తప్ప మిగిలిన వారందరు కూడా అవినీతిపరులేనన్నట్లు జగన్ సోదరి షర్మిల, విజయమ్మలు ఎదురు దాడి చేయడం చూస్తే, ఒక అబద్దాన్ని కూడా పదేపదే దృడంగా ప్రచారం చేసుకోగలిగితే అబద్దం కూడా నిజమయిపోతుందని వారు నిరూపిస్తున్నారు.

 

మరి ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మారనున్నరాజకీయ సమీకరణలతో రేపు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా వైకాపా తరపున వకాల్తా తీసుకొని జగన్ కూడా నిర్దోషని ప్రజలకి నచ్చజెప్పుతారేమో చూడాలి మరి.