ఇళయరాజా ఆగ్రహం...

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఎఫ్ ఎం రేడియోస్టేషన్లు, టీవీల మీద కోపం వచ్చినట్టుంది. నేను స్వరపరిచిన పాటలన్నింటిపైనా హక్కులు నావే కావాలంటే రైట్స్ కొనుక్కోండంటూ కొరడా ఝళిపించారు. ఇక ముందు తన పాటలు ప్రసారం చేయాలంటే తన నుంచి గానీ, తన ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి గానీ అనుమతి తీసుకోవాలని చెప్పారు. ఇలా వచ్చిన మొత్తంలో నిర్మాతలకు కూడా కొంత భాగాన్ని ఇస్తానని చెప్పారు. తన అనుమతి లేకుండా పాటలు ప్రసారం చేయడం చట్ట విరుద్ధమన్నారు. అదేవిధంగా మేధో సంపత్తి హక్కు మీద విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. నేను సాగుచేశాను... నా పంటను అమ్ముకున్నాను. అంతమాత్రాన నేను నాటిన చెట్టును కూడా తీసుకుంటానంటే ఎలా అంటూ ఇళయరాజా ప్రశ్నిస్తున్నారు. పాపం ఇక నుండి టీవీలు, రేడియో స్టేషన్లలో ఇళయరాజా పాటలు ప్రసారం చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే.