శ్రీవారి కొండలపై ఆరని కార్చిచ్చు

 

 

 

తిరుమల శేషాచలం అడవి మంటల్లో చిక్కుకుని బుగ్గి అవుతోంది. ప్రధాన ఆలయానికి కిలోమీటరు దూరంలోని ఉత్తర, ఈశాన్య దిశలో కాకుల కొండ వద్ద 40 అడుగుల ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. వివిధ శాఖలకు చెందిన 500 మంది సిబ్బంది, 15 ఫైరింజన్లు రంగంలోకి దిగినా మంటలు అదుపులోకి రాలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం, రక్షణ దళాల సహకారాన్ని కోరింది. గవర్నర్ నరసింహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టీటీడీ ఉన్నతాధికారులతో మాట్లాడారు. అనంతరం రక్షణ దళాలను రంగంలోకి దించే ఏర్పాట్లు చేశారు.

 

నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లకు చెందిన రెండు ఎయిర్‌క్రాఫ్ట్‌లను, నాలుగు హెలికాప్టర్లను, వంద మంది సిబ్బందిని తిరుపతికి తరలిస్తున్నారు. మంటల్లో చిక్కుకుని 10 కిలోమీటర్ల విస్తీర్ణంలోని సుమారు 2 వేల హెక్టార్ల అడవి బూడిద యింది. టీటీడీ పవన విద్యుత్ ప్లాంట్ దెబ్బతింది. నష్టాన్ని ఇంకా అంచనా వేయలేదు. ఎన్ని ఫైరింజన్లు వచ్చినా మంటలు ఏమాత్రం అదుపులోకి రాకపోవడంతో ఇక హెలికాప్టర్లను రంగంలోకి దించక తప్పడంలేదు.


నీరు, నురగతో కూడిన రసాయనాలను గగనతలం నుంచి చల్లి మంటలను ఆర్పేందుకు నేవీ, ఎయిర్‌ఫోర్సుకు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఎంఐ-17 హెలికాప్టర్లు తిరుమలకు రానున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే బుధవారం ఓ హెలికాప్టర్ శేషాచలంపై చక్కర్లు కొట్టి అగ్నిప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో సర్వే చేసి వెళ్లింది. భక్తుల భద్రత కోసం, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పాపవినాశనం, ఆకాశగంగ, జాపాలీతీర్థం, వేణుగోపాల స్వామి ఆలయాలకు  వెళ్లే మార్గాలను, అక్కడి దుకాణాలను మూసివేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అలిపిరి నుంచి తిరుమలకు వచ్చే కాలిబాటను కూడా మూసివేశారు.