కాంగ్రెస్ పాలనలో కష్టాల్లో ప్రజలు!

Publish Date:May 30, 2013

 

 

 

 

ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వివిధ రకాల సమస్యలతో సతమతమవుతున్నారు... ఎటు చూసినా సమస్యలే... వీటి నుండి ఎలా బయటపడాలో అర్థం కాక మధ్య తరగతి ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. మే నెల ముగిసి జూన్ నెల ప్రారంభం కాబోతోంది, అయినా పాఠ్య పుస్తకాలు అందుబాటులో లేవు. దీనికి స్వయాన విద్యాశాఖ మంత్రే ఏమీ చేయలేమని చేతులెత్తేశారు. అందుబాటులో లేని స్కూలు ఫీజులు... పెత్తందారీ తనంతో కార్పోరేట్ పాఠశాలల దౌర్జన్యం నానాటికి పెరిగిపోతోంది. ఆటో ఛార్జీల ధరలు చెప్పనవసరం లేదు. ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరిగిపోయాయి. వైద్యం గురించి, కార్పోరేట్ హాస్పిటళ్ళ ధన దాహం గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రభుత్వ ఆసుపత్రుల విషయం మరీ దారుణం. మనిషి అనే వాడు మనలేని పరిస్థితి.


 విద్యుత్తు కోతలు ఎప్పటికి అదుపులోకి వస్తాయో తెలీదు. విద్యుత్తు ఛార్జీల మోత నుండి ఎప్పటికి ఉపశమనం ఉంటుందో అసలే తెలీదు. గ్యాస్ సిలిండర్ ధర పెరగటమే కాదు, సం.రానికి 9 సిలిండర్లు అంటూ మళ్లి అదో శరాగాతం.
       
 

ఇవన్ని ఇలా ఉంటె రెక్కలొచ్చిన బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు, పేద, మధ్యతరగతి ప్రజలను మరింతగా వణికిస్తున్నాయి.  ఇన్ని సమస్యలతో సామాన్య మానవుడు అత్యంత దయనీయమైన స్థితిని గడుపుతున్నాడు. ముఖ్యంగా కూరగాయల ధరలు చూస్తే ఎన్నడూ కనీ వినీ ఎరుగని విధంగా పెరిగిపోయాయి.
       
 టమాటోలు కిలో 60/- రూపాయలు, బీన్స్ 100/- రూపాయలు, పచ్చిమిర్చి, బెండ, చిక్కుడు.... అన్ని కిలో 50/- రూపాయలు. అన్నిటికి మించి అల్లం 180/- రూపాయలకు చేరిపోయాయి. రైతు బజార్లలోను, బహిరంగ మార్కెట్లలోను ఒకే విధంగా రేట్లు ఉన్నాయి. దళారులు, అక్రమార్కులు రైతు బజార్లను, కూరగాయల మార్కెట్లను శాసిస్తున్నారు. అనూహ్యంగా రేట్లు పెంచేసి దండుకుంటున్నారు.
      
 

అరికట్టాల్సిన ప్రభుత్వం కళ్ళుమూసుకొని చోద్యం చూస్తోంది. వేసవిలో ధరలు పెరగటం సహజం. ఈ ధరలు పెరిగే సమయంలో ప్రభుత్వం రంగంలోకి దిగి మార్కెట్లో జోక్యం పథకం కింద ఆయా కూరగాయలను దిగుమతి చేసుకొని తక్కువ ధరలకు విక్రయించాలనే కనీసపు అవగాహన కుడా లేని పాలకులు మనల్ని పరిపాలించేది.
        
 

విద్య, వైద్యం, విద్యుత్తు, రైతు బజార్లు, మద్యం... ఇలా చెప్పుకుంటూ పోతే రాజకీయ నేతలు, కార్పోరేట్ వ్యక్తులు కలిసి మెలిసి మంచి అవగాహనతో ఒకరిని ఒకరు శాసించుకుంటూ పోతున్న ఫలితం సామాన్య ప్రజానీకం సమస్యల సుడిగుండంలో చిక్కుకొని అల్లాడిపోవడం.
          

ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు వస్తున్నా మీకోసం అంటూ... వైకాపా ని, కాంగ్రెస్ ని పనికిమాలిన విషయాల మీద, లేదా అందరికి తెలిసిన అవినీతి మీద తూర్పారాపడతారు. ఇంకా తన స్థాయిని దిగజార్చుకొని ఎవరో జైళ్లలో నీలి చిత్రాలు చూస్తున్నారంటూ వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఈ రోజున సామాన్య ప్రజానీకానికి కావాల్సింది ఈ పనికి మాలిన వ్యాఖ్యానాలా? లేక ప్రజాసమస్యలపై ప్రజల తరుపున  పోరాడి, వారి సమస్యలను ఒక కొలిక్కి తెచ్చి, తేగలిగిన సత్తా ఉన్న నేతా? ఎందుకంటే ప్రతి పక్ష నేత కర్తవ్యం అదే కదా!
            

మరో పార్టీ వైకాపా కి కావాల్సింది తమ జగన్ కు ఎప్పుడు బెయిల్ వస్తుందని. తల్లి, చెల్లి, ఆవిడ అని ముగ్గురు వివిధ చానెళ్ళకెక్కి తమ గోడు వెళ్ళబోసుకుంటారు.... లేదా రోడెక్కి యాత్రలు చేస్తూ చంద్ర బాబుని, కిరణ్ కుమార్ రెడ్డిని, ప్రభుత్వాన్ని విమర్శిస్తారు.... లేదా రోడ్డు మీద పడి రాష్ట్రవ్యాప్తంగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తారు. అంతే కానీ సామాన్యుడు నేడు అనుభవిస్తున్న సమస్యలన్నిటికీ కారణం ఏమిటి?అనే విషయమై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సామాన్యుడికి సమస్యలనుండి ఊరటనివ్వాలనే ధ్యాస, బాధ్యత ఎంతమాత్రం లేదు.

              

ఇక మన ముఖ్య మంత్రి విషయానికొస్తే.... మన బియ్యం, అమ్మహస్తం, అభయహస్తం, అమృతహస్తం, సబ్ ప్లాన్ బిల్లు అంటూ పనికిమాలిన పథకాల మీద దృష్టి పెట్టారే కాని, సామాన్యుడికి అవసరమైన నిత్యావసర సరుకుల ధరలు, విద్యారంగం, వైద్యరంగం ఎలా దారి తప్పి పోతున్నాయో పట్టించుకొనే తీరిక లేదు. ఎంతసేపు ఆయన కుర్చీని గురించిన ఆలోచన.... లేదంటే ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టటం మినహా ఎవరి బాధలు ఆయనకు అవసరం లేదు.

             

ఇవీ నేడు రాష్ట్రంలో ఉన్న సమస్యలు. ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మంచినీటి సమస్య, రహదారుల సమస్య, అంటూ వ్యాధుల సమస్య, ట్రాఫిక్ సమస్య, అధిక జనాభా.... ఇవన్నీ ఎప్పుడూ ఉండే సమస్యలే అని సదరు నేతలు తమని తాము చాలా హుందాగా సమర్ధించుకోవచ్చు. కాని ఈ సమస్యలు ఎప్పటికీ తీరని సమస్యలు గానే ఎందుకు ఉంటున్నాయి? ఈ సమస్యల తీవ్రత నానాటికి ఎందుకు పెరిగిపోతోంది? ఇది ఎవరి వైఫల్యం? తప్పు మీదంటే మీదని ఒకరినొకరు దుయ్యబట్టుకుంటారు. కాని ఇక్కడ తప్పు ప్రతి ఒక్కరిది. పాలనా సామర్థ్యం లేని పాలకులది. అధికార పార్టీలని నిలదీయలేని ప్రతిపక్షాలది. ఎవరికీ వారు రాబోయే ఎన్నికలలో మమ్మల్ని గెలిపించండి, మీకు మంచి చేస్తాం అంటారే కాని, గతం లో వారు ఎక్కడ వైఫల్యం చెందారో ప్రజల ముందు ఒప్పుకునే ధైర్యం చెయ్యరు. ప్రతి ఒక్కరికి కావాల్సింది అధికార పీఠం. మరి సామాన్య ప్రజానీకం సంక్షేమం.... గాలిలో దీపమేనా?