ఐసిఐసిఐ బ్యాంక్ సీఈవో రాజీనామా

 

ఐసిఐసిఐ బ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవో చందా కొచర్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈమె రాజీనామాకు బ్యాంకు బోర్డు గురువారం ఆమోదం తెలిపింది. ఇది వెంటనే అమలులోకి వస్తుంది. ఐసిఐసిఐ సెక్యూరిటీస్‌ సహా ఐసిఐసిఐ బ్యాంక్‌కు అనుబంధంగా ఉన్న అన్ని సంస్థల పదవులకు కొచర్‌ రాజీనామా చేశారు. క్విడ్‌ప్రోకో ఆరోపణలు ఎదుర్కొంటున్న చందా కొచర్‌ స్థానంలో ప్రస్తుతం బ్యాంక్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ గా ఉన్న సందీప్‌ భక్షిని కొత్త ఎండి, సీఈవోగా బోర్డు నియమించింది. అక్టోబరు 3 నుంచి ఈ నియామకం అమలులోకి వస్తుంది. భక్షి అయిదేళ్లు ఈ పదవిలో కొనసాగుతారని బోర్డు తెలియజేసింది. కొచర్‌పై సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బిఎన్‌ శ్రీకృష్ణ సారథ్యంలో దర్యాప్తు కొనసాగుతుందని, దర్యాప్తులో తేలిన అంశాలను బట్టి ఆమెకు రిటైర్‌మెంట్‌ తర్వాత ఇచ్చే ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయని బ్యాంకు పేర్కొంది.


మేనేజ్‌మెంట్‌ ట్రైనీగా ఐసిఐసిఐ గ్రూపులో 1984లో ఉద్యోగ జీవితం ప్రారంభించిన కొచర్‌.. ఆ తర్వాత పాతికేళ్లకు ఎండీ, సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. ప్రైవేటు బ్యాంకింగ్‌ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి చేర్చిన ప్రతిభాశాలిగా పేరు తెచ్చుకున్నారు. పద్మభూషణ్‌ పురస్కార పొంది ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఇవన్నీ ఒకప్పటి మాటలు. ఒక తప్పు చాలు వంద ఒప్పుల్ని చెడగొట్టడానికి అన్నట్టుగా.. ఒక్క సంఘటన ఆమె జీవితాన్నిపాతికేళ్ళు వెనక్కి నెట్టింది. భర్త దీపక్‌ సంస్థకు లబ్ధి చేకూర్చేందుకు కొచర్‌ నిబంధనలు అతిక్రమించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో బ్యాంకు నియమించిన స్వతంత్ర కమిటీతో అంతర్గత విచారణ ఎదుర్కోవడం జరిగింది. తుది నివేదిక వచ్చే వరకు సెలవుపై వెళ్లాల్సి రావడం.. తాజాగా ముందస్తు పదవీ విరమణకు పూనుకోవడం.. బ్యాంకు బోర్డు వెంటనే ఆమోదం తెలపడం అన్ని అలా జరిగిపోయాయి.