'చైతన్యం' లేని విద్య.... 'నారాయణు'డికే ఎరుక!

 

 

 Chaitanya colleges, narayana junior college, Chaitanya narayana

 

 

మెరుగైన విద్య, నాణ్యమైన ప్రమాణాలు, జాతీయస్థాయి గుర్తింపు అంటూ ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ స్థాయి కార్పోరేట్ కాలేజీల వైఖరి మూలంగా రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ స్థాయి విద్యార్థుల తల్లిదండ్రుల బాధలు వర్ణనాతీతం. 10వ తరగతి ప్రారంభం నుంచే సీట్లు అయిపోతున్నాయి, రిజర్వు చేసుకోండి అంటూ ఫోన్లు చేస్తూ విద్యార్థులకు, తల్లిదండ్రులకు మరో ఆలోచన చేసే అవకాశం ఇవ్వకుండా మానసిక ఒత్తిడిని కలుగజేస్తూ వారు అనుసరిస్తున్న విధానాలు అతిభయంకరం.


           10వ తరగతి ఫలితాలు విడుదలయ్యే వరకు ఆగకుండా గ్రామస్థాయి నుండి వారి కాలేజీల తరపున కమిషన్ ఏజెంట్లను పెట్టి మీ పిల్లలను మా కాలేజీలలో చేర్పించండి, మీ వాడికి స్టేట్ ర్యాంకు తెచ్చే పూచి మాది, మీకు ఫీజు డిస్కౌంట్ ఇప్పిస్తాం అంటూ కనీసం పిల్లవాడి తెలివితేటలకు, శక్తిసామర్థ్యాలకు ఎలాంటి ప్రాధాన్యతనివ్వకుండా వాళ్ళు లాక్కేళ్ళే ప్రయత్నం చేసి, కాలేజీలో అడ్మిషన్ ఫీజు కట్టే వరకు భయంకరంగా పీడిస్తారు. ఒక్కసారి ఈ అడ్మిషన్ ఫీజు కట్టాక సదరు ఏజెంటు మళ్లీ కనిపించడు. ఏదైనా విషయమై సంప్రదించాల్సి వస్తే నాకు సంబంధం లేదు, మీ పాట్లు మీరు పడండి అని ముఖం చాటేస్తారు.

            ఈ అడ్మిషన్ ఫీజు ఒక బ్రాంచిలో రూ. 5,000 ఉంటే, మరొక బ్రాంచిలో రూ. 10,000 ఉంటుంది. ఇంత మొత్తాన్ని చెల్లించి కేవలం కాలేజీలో సీటు రిజర్వు చేసుకోవాలి. ఒకవేళ నిర్ణయం మార్చుకుంటే ఈ మొత్తాన్ని వాపసు ఇవ్వరు. తరువాత కాలేజీలో జాయిన్ చెయ్యండి క్లాసులు ప్రారంభించేస్తున్నాం, అది కూడా మే నెల మొదటి వారం నుండే అంటూ ఊదరగొడుతూ తల్లిదండ్రులను మరింతగా ఉక్కిరిబిక్కిరి చేస్తారు. అప్పటికి 10వ తరగతి ఫలితాలు ఇంకా రావు. ఇవేవీ  పట్టించుకోకుండా తల్లిదండ్రులు పిల్లల్ని జాయిన్ చెయ్యడానికి సిద్ధమైతే టోటల్ ఫీజులో సగం ఫీజు మొదటి వాయిదాగా ఆ రోజే చెల్లించమంటున్నారు. దీనితో పిల్లలకు మరో మంచి కాలేజీలో మరో మంచి అవకాశం వచ్చినా అక్కడినుండి మార్చలేని పరిస్థితి ఈ ఆర్థిక పరమైన కట్టడితో తల్లిదండ్రులకు కలిపిస్తారు.

          ఇక ఫీజుల విషయానికి వస్తే ఇంజినీరింగ్ కాలేజీలను, మెడికల్ కాలేజీలను, తలదన్నే విధంగా ఈ ఫీజులుంటున్నాయి. రూ. 1,75,000 ఫీజును ఇంటర్మీడియట్ స్థాయి నుండే వసూలు చేస్తున్నారు. ఈ మొత్తం ప్రహసనం లో "నారాయణ, శ్రీచైతన్య" జూనియర్ కాలేజీల దందా చాలా  దారుణంగా ఉంటుంది. ఇది వరకు వీరిద్దరి మధ్య భయంకరమైన పోటీ ఉండేది. దానితో ఫీజులు కాస్త తక్కువగా ఉండేవి. కాని ఈనాడు వారిద్దరు ఒక్కటైపోయి "చైనా(చైతన్య నారాయణ)" అనే మరో సంస్థను స్థాపించి, పిల్లవాడి సామర్థ్యానికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకుండా డబ్బే పరమావధిగా రూ. 3,00,000 వరకు ఫీజును ఈ "చైనా" బ్యాచ్ ద్వారా వసూలు చేస్తున్నారు. అసలు ఇంటర్మీడియట్ కు అంతంత ఫీజులు వసూలు చేసే అంతగా వారి వద్దనున్న  నైపుణ్యాలు ఏమిటి? కేవలం ఒక్క ఏ.సీ. సౌకర్యం తప్ప. అది కూడా మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీలను మించి ఎన్నో రెట్లు ఎక్కువగా వసూలు చేసే స్థాయికి వారు అందిస్తున్న అంతటి మెరుగైన విద్యాసేవలు ఏమిటి?

          మందలు మందలుగా క్లాసుకి 100 నుండి 110 మంది విద్యార్థుల వరకు జాయిన్ చేసుకుంటూ వారిలో ప్రతిభావంతులను వేరు చేసి వారిని మాత్రం విపరీతంగా ఒత్తిడికి గురిచేస్తూ, చదివిస్తూ, వారి ద్వారా ర్యాంకులు సాధిస్తూ, మాకు ఇన్ని ర్యాంకులు వచ్చాయి అని చూపించుకుంటున్నారు. ఎన్ని లక్షల మంది తమ సంస్థలలో చదివితే ఇన్ని ర్యాంకులు వచ్చాయో ఎక్కడా చెప్పరు. మరి మిగిలిన విద్యార్థుల సంగతి ఏంటి?వారు కూడా అంతే లక్షల్లో ఫీజు చెల్లిస్తూ వేరే వారికి ర్యాంకులు వస్తే చూస్తూ కుర్చోవాలా?

           ఈ దారుణాలన్నీ ఈ ప్రభుత్వానికి పట్టవు. విద్యాశాఖను ప్రాధమిక విద్యాశాఖ, ఉన్నత విద్యాశాఖ అంటూ విభజించి ఒక్కో శాఖకు ఒక్కో మంత్రిని నియమించినా ఫలితం శూన్యం. ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చిన రోజున ఆ ఫలితాలు విడుదల  చేసిఫోటోలకు పోజులివ్వడం తప్పా మన మంత్రివర్యులు ఏమీ చెయ్యలేరు. కార్పోరేట్ కాలేజీల దౌర్జన్యానికి ప్రభుత్వ వైఫల్యమే కదా కారణం. విద్యాశాఖా మంత్రిగా మంత్రి పార్థసారథి గత కొన్ని సంవత్సరాలుగా ఆ పదవిలోనే ఉన్నారు. అయినా విద్యారంగంలో తెచ్చిన మార్పులు ఏమీ లేవు. పైగా ఇంటర్మీడియట్ బోర్డు కార్పోరేట్ కాలేజీల చేతిలోకి వెళ్ళిపోయింది అన్న నగ్న సత్యాన్ని ఆయనే అంగీకరించారు. మరి మంత్రిగా ఆయన చేస్తున్నది ఏమిటి? విద్య పేరుతో ఈ కాలేజీలు చేస్తున్నది వ్యాపారం.

        అసలు వేసవి సెలవుల యొక్క ప్రాధాన్యత ఏమిటి? ఈ వేసవి సెలవుల్లోనే కాలేజీలు ప్రారంభించేసి తరగతులను నిర్వహించడం వెనుక కాలేజీ యాజమాన్యాల దురుద్దేశ్యమ్ - డబ్బు... డబ్బు... డబ్బు! అంతకు మించి మరొకటి లేదు. తల్లిదండ్రులు నిస్సహాయంగా పిల్లల్ని ఆ ఎండల్లోనే కాలేజీలకు పంపడం చాలా బాధాకరం. ఈ కార్పోరేట్ కాలేజీల మాఫియా నుండి తల్లిదండ్రులను, విద్యార్థులను రక్షించేదెవరు? మరి తల్లిదండ్రుల, పిల్లల బాధలేవి మన మంత్రివర్యులు పార్థసారథి గారికి ఏమీ  కనిపించడం లేదా? మాటకి ముందు ఆ పథకం ఈ పథకం అంటూ గొప్పలు చెప్పుకునే సి.యమ్. కిరణ్ కుమార్ రెడ్డి గారికి కార్పోరేట్ కాలేజీల దౌర్జన్యం ఫై కొరడా జులిపించే సత్తా ఉందా? ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తూ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించడం చాల బాధాకరం.