టీడీపీ ఎంపీలకు పౌరుషం ఎక్కువ..పెర్ఫార్మన్స్ తక్కువ!

 

టీడీపీ ప్రభుత్వం,నేతలపై కయ్యానికి కాలు దువ్వుతుంటారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.గత రెండు రోజులుగా టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ నివాసాల్లో,కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి.కడప ఉక్కు కర్మాగారంపై నిలదీసినందుకే కక్ష సాధింపు చర్యగా కేంద్రం తనపై ఐటీ దాడులు చేయిస్తుందని సీఎం రమేష్ ఆరోపించారు.కేంద్ర ప్రభుత్వం డైరక్షన్‌లోనే జరుగుతున్నాయని టీడీపీ నేతలు, మంత్రులు తీవ్రస్థాయిలో కేంద్రంపై ధ్వజమెత్తారు. ఈ విమర్శలకు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. ట్విట్టర్‌ వేదికగా స్పందించిన ఆయన సీఎం రమేష్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

" టీడీపీ ఎంపీలకు ఆర్భాటం ఎక్కువ. అవగాహన తక్కువ. స్టీల్ మినిస్టర్ బిరేంధేర్ సింగ్ గారిని కలిసే ముందు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు జీఎస్ఐ ద్వారా సబ్మిట్ చేయవలసిన రిపోర్ట్ ఆలస్యం అయ్యిందో తెలుసుకుంటే బాగుండేది. డ్రామాలపైనా, అవినీతి పైన ఉన్న శ్రద్ధ అభివృద్ధిపైన ఉండుంటే రాష్ట్రం బాగుపడేది" అని ట్వీట్ చేశారు.

సీఎం రమేష్ జీవీఎల్‌ను ఒక ఆంబోతులా రాష్ట్రంపైకి వదిలేశారని మండిపడ్డారు. కడప స్టీల్‌ ఫ్యాక్టరీ కోసం దొంగ దీక్షలు చేశామంటూ పిచ్చిమాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవీఎల్‌ పచ్చి అబద్దాలకోరని విమర్శించారు.దీనికి సవాల్ గా " రమేష్.. రాష్ట్రాన్ని దోచేసిన అచ్చోసిన ఆంబోతులు ఎవరో ప్రజలకు తెలుసు. మీలాగే ఛాలెంజ్ చేసి టీడీపీ ఎంపీ సుజనా చౌదరి గతంలో తోక ముడిచారు. మీరూ అంతేనా? మీ ఎంపీలకు పౌరుషం ఎక్కువ. పెర్ఫార్మన్స్ తక్కువ! నేను చర్చకు రెడీ. ఎప్పుడైనా, ఎక్కడైనా! మీరు సిద్ధమా!" అని మరో ట్వీట్ చేశారు.అంతేకాదు సీఎం రమేశ్‌కు తనకు చేసిన ఛాలెంజ్‌ వీడియోను కూడా తన ట్విట్టర్‌లో ఆయన పోస్ట్ చేశారు.