కేంద్రానికి కంప్లైంట్.. శ్రీ కాళహస్తి ఎమ్మెల్యేపై అమిత్ షా కు ఫిర్యాదు చేసిన బీజేపీ నాయకులు

 

ఏపీలో బీజేపీ వర్సెస్ వైసీపీ రాజకీయం హస్తినకు చేరింది. శ్రీ కాళహస్తి ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి పై కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేశారు రాష్ట్ర బిజెపి నాయకులు. నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతల పై విచారణ జరపాలంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా ఏపీ డీజీపీకి లేఖ రాయడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. శ్రీకాళహస్తిలో జరుగుతున్న పరిణామాలతో వైసీపీ వర్సెస్ బీజేపీ రాజకీయం సరి కొత్త టర్న్ తీసుకుంటోంది. ఇటీవల శ్రీకాళహస్తిలో గంగమ్మ జాతర వద్దకు ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు హాజరయ్యారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన వైసిపి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, బిజెపి నాయకులు రాకపై అభ్యంతరం తెలిపారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గంగమ్మ జాతర తర్వాత పోలీసుల అండతో తమపై ఎస్సీ, ఎస్టీ అక్రమ కేసులు బనాయించారని బిజెపి నేతలు ఎమ్మెల్యే పై ఆరోపిస్తున్నారు, ఎస్పీకు కూడా ఫిర్యాదు చేశారు.

తమ పార్టీ బలపడుతుందన్న కారణం గానే నియోజకవర్గంలో అక్రమ కేసులు పెడుతూ ఎమ్మెల్యే బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు బీజేపీ నాయకులు. శ్రీ కాళహస్తి నియోజక వర్గాల్లో ఎమ్మెల్యే ఆరాచకాలు ఎక్కువయ్యాయని చివరకు పవిత్ర ఆలయంలో కూడా రాజకీయాలు చేస్తున్నారంటున్నారు బిజెపి నాయకులు. అధికార పార్టీ ఆగడాలను నిలదీస్తే తమపై దాడులు చేయడంతో పాటు కేసులు పెట్టారని నియోజక వర్గ బీజేపీ నాయకుడు కోలా ఆనంద్ ఆరోపించారు. అందుకే అమిత్ షా కు ఫిర్యాదు చేశామని విచారణ జరిపిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారన్నారు. రాష్ట్రంలో తమ పార్టీ బలపడుతుందన్న కారణంగా దాడులతో అధికార పార్టీ భయబ్రాంతులకు గురి చేస్తోందని ఏపీ బీజేపీ ఆరోపించింది. ఇటీవల శ్రీకాళహస్తిలో బిజెపి నేతల పై జరిగిన దాడితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ నాయకులపై పెట్టిన అక్రమ కేసుల వివరాలను జాతీయ పార్టీ దృష్టికి తీసుకువెళ్లారు బిజెపి రాష్ట్ర నాయకులు.