ఆయనకి ఓకే.. కానీ..!

 

 

 

24 సంవత్సరాల పాటు భారతీయ క్రికెట్ రంగానికి క్రీడాకారుడిగా విశేష సేవలు అందించిన సచిన్ టెండూల్కర్ క్రికెట్ కెరీర్‌కి గుడ్‌బై చెప్పాడు. యావత్ భారతీయులు ఆయనకి ఈ సందర్భంగా ఘనంగా వీడ్కోలు పలికారు. భారత ప్రభుత్వం కూడా ఆయనకి ఈ సందర్భంగా ‘భారతరత్న’ అవార్డు ప్రకటించి ఆయనను అత్యున్నత స్థాయిలో గౌరవించింది. భారతరత్న అందుకున్న తొలి భారతీయ క్రీడాకారుడిగా సచిన్ చరిత్ర సృష్టించాడు. సచిన్‌ని భారతరత్నతో గౌరవించాలని ఎప్పటి నుంచో కోరుతున్న ఆయన అభిమానులకు ఈ వార్త ఎంతో సంతోషాన్ని కలిగించింది. భారతరత్నకు సచిన్ నూటికి నూరుశాతం అర్హుడే అన్న అభిప్రాయాలు అంతటా వినిపించాయి.

 

సచిన్‌కి భారతరత్న ఇవ్వడంలో ఎవరికీ అభ్యంతరాలు లేవుకానీ, సచిన్ కంటే ముందు భారతీయ క్రీడారంగానికి విశేష సేవలు అందించిన క్రీడాకారులెవరికీ భారతరత్న ఇవ్వాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఎందుకు రాలేదన్న ప్రశ్నలు తలెత్తాయి. హాకీ మాంత్రికుడిగా పేరు పొందిన ధ్యాన్‌చంద్, పరుగే జీవితంగా బతికిన మిల్కాసింగ్‌లను ప్రభుత్వం ఎందుకు విస్మరించినట్టన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా అంతటా ఇలాంటి అభిప్రాయాలు భారీగా వ్యక్తమవుతున్నాయి. అయితే సచిన్‌కి భారతరత్న ఇవ్వడం వెనుక కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాలు కూడా దాగి వున్నాయన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.




సచిన్‌ను ఎప్పటి నుంచో ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకోవాలన్న ఆలోచనలో వున్న కాంగ్రెస్ పార్టీ గతంలో దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసి భంగపడింది. ఇప్పుడు ఇంత హడావిడిగా, నాటకీయంగా సచిన్‌కి భారతరత్న ప్రకటించి ఆయన్ని తన వైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సచిన్ చివరి మ్యాచ్‌కి ఎక్కడో వున్న రాహుల్‌గాంధీ పనికట్టుకుని రావడం వెనుక వున్న అంతరార్థం కూడా ఇదేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సచిన్‌కి భారతరత్న వచ్చిందన్న ఆనందాన్ని ఆయన అభిమానులు పూర్తిగా ఆస్వాదించిన తర్వాత రాజకీయ విమర్శకులు రంగంలోకి దిగే అవకాశం వుందని తెలుస్తోంది. అయితే, భారతరత్నగా గౌరవాన్ని పొందిన సచిన్ టెండూల్కర్ ఏ రాజకీయ పార్టీకి కొమ్ము కాయకుండా, ఏ పార్టీకీ మద్దతు ప్రకటించకుండా, ప్రచారం చేయకుండా తటస్థంగా వుండాలని, ఆయనకున్న గౌరవాన్ని కాపాడుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.