ఈపాపం ఎవరిది ?

....సాయి లక్ష్మీ మద్దాల

 

 AP Assembly session, Andhra Pradesh Assembly Session, Assembly session begins in Andhra Pradesh

 

 

శాసనసభ సమావేశాలు జరుగుతున్న తీరు ప్రజలకు అసహ్యాన్ని కలుగచేస్తోంది. గత 4సం॥ లుగా ఒక్క సమావేశం కూడా సజావుగా సాగలేదు అంటే దీనికి కారణం ఏమిటి?ప్రజాసమస్యలపై చర్చించే ధైర్యం అటు అధికార పక్షానికి గాని ఇటు ప్రతిపక్షాలకు గాని లేవనే అనుకోవాలా?ఈపాపమెవరిది

 

 అసెంబ్లీలో కొనసాగుతున్న వాయిదాల పర్వం ..... నిరసనలు,వాగ్వివాదాలతో దద్దరిల్లుతున్న సభ. వాద... ప్రతివాదాలకే ఆవిరవుతున్న సభాసమయం. ఎవరి స్కెచ్ వారిదే, ఎవరి మైండ్ గేమ్ వారిదే. సభను అడ్డుకోవటంలో ఎవరికీ తీసిపోనట్లుగా ఒకరితో ఒకరు చాలా ధీటుగా తె. దే.పా ..... టి. ఆర్. ఎస్ పోటీ పడుతున్నాయి.

            

రాష్ట్రంలో ప్రజాసమస్యలు చాలాఉన్నాయి. ఆసమస్యలతో ప్రజలు నిత్యంనరకం అనుభవిస్తున్నారు. విపరీతంగా పెరిగిపోయిన నిత్యావసరాల ధరలు,అదుపులేని విద్యుత్ చార్జీలు,మోత మోగిస్తున్న బడి ఫీజులు,స్కూళ్ళు తెరిచినా అందుబాటులోకి రాని పాఠ్యపుస్తకాలు,రైతుల విత్తనాల సమస్య,వర్షాలకారణంగా ప్రబలె అంటువ్యాధుల సమస్య,రహదారుల సమస్య ,శాంతిభద్రతల సమస్య....... ఇలా చెప్పుకుంటూ పోతే పేద ,మధ్యతరగతి ప్రజల సమస్యలు అన్ని ఇన్ని కావు.

              

ఎవరికీ ప్రజాసస్యలపై చర్చించే ఆలోచన లేదు. ఎవరికీ వారే తప్పు మీదంటే మీదని దుమ్మెత్తి పోసుకుంటూ సభాసమయాన్ని,ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తూ తనకేమీ పట్టనట్లుగా ముఖ్యమంత్రి కాలం గడిపేస్తున్నారు. ఈ రకమైన సహనాన్ని స్వపక్షంలోని సీనియర్ నేతలే వ్యతిరేకిస్తున్నారు. స్పీకర్ వైనం మరీ ఘోరం. ఎవరిని ఆదేశించలేరు,ఆగ్ఘ్నాపించ లేరు. మాటకు ముందు సభను వాయిదా వేయటం తప్ప.

                

నేతల తీరు చూస్తే చాలా అసహ్యంగా ఉంటుంది. సభలో వీరంగమాడతారు,మీడియా ముందుకు వచ్చి హీరోలా ఛాలెంజింగ్ డైలాగులు కొడతారు. ప్రతి ఒక్క పార్టీ నేతలు మాటకుముందు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్ళటం,అక్కడే బైఠాయించటం తదనుగుణంగా స్పీకర్ సభను వాయిదా వేయటం . మిగతా పార్టీల దారిలోనే  వై.యస్. ఆర్. సి. పి వెళ్తోంది. పాదయాత్రాలలో ప్రగల్భాలు పలకటం వరకే వారు చేసేది ,శాసనసభలో ప్రజాసమస్యలపై పోరాడాలనే ధ్యాస వారికి ఉండదు. ఒకపార్టీ వారు ఒకసమస్యను లేవనెత్తితే,మరోపార్టీవారు ఆ సమస్య మీహయంలో ఇంత ఘోరం అంటే మీహయాములో ఇంత ఘోరం అంటూ తాతల వరకు వెళ్లి పోట్లాడుకుంటున్నారు.

                  

జరుగుతున్న విధానంలో ప్రతిపక్షాల తీరు మరీ విడ్డురంగా ఉంది. ఈ రకమైన గొడవల కారణంగా అధికార పార్టీని ప్రజల యొక్క వివిధ సమస్యల పై ఎందుకు నిలదీయరు? ఈ నిలదీసే ప్రయత్నంలో అన్ని ప్రతిపక్షాలు ఒక్క తాటిమీదకు ఎందుకు రారు?ఈరకంగా సభ పదేపదే వాయిదా పడటం కారణంగా అధికార పక్షం సమస్యలనుండి తప్పించుకోవటానికి మార్గం సుగమం అవుతుందనే విషయాన్ని ప్రతిపక్షాలు గమనించటంలేదా?సభకు పదేపదే అడ్డుపడుతున్న వారిపై తగు రీతిలో చర్యలు తీసుకోవాలని,వీలైతే వారిని సభనుండి బయటకు పంపించి ప్రజాసమస్యలను పరిష్కరించాలనే కనీసపు భాద్యత మన ముఖ్యమంత్రికి లేక పోవటం ఏమిటి?దీనిని బట్టి అటు అధికార పక్షానికి గాని ఇటు ప్రతిపక్షానికిగాని సభ సవ్యంగా జరగి,ప్రజాసమస్యలు చర్చకు రావాలని కోరుకోవటం లేదని ప్రజలకు అర్ధం అవుతోంది.