అల్లూరి సీతారామరాజు జయంతి

 

Alluri Sita Rama Raju, Alluri Sita Rama Raju Jayanthi, Alluri sitarama raju jayanthi today

 

 

అది భరతమాత తెల్లోడి కబంద హస్తాల్లో నలిగిపోతున్న రోజులు.. ఉత్తర భారతంలో స్వతంత్రోధ్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతున్న రోజులు అలాంటి సమయంలోనే పశ్చిమ గోదావరి జిల్లా అడవుల్లో ఓ అగ్నికణం పుట్టింది.. ఆ అగ్ని కణమే దావాణలంలా వ్యాపించి బ్రిటీష్‌ సామ్రాజ్య గుండెల్లో వణుకు పుట్టింది.. అలా తెల్లోడి పెత్తనం మీద గర్జించిన తెలుగు తేజమే అల్లూరి సీతారామరాజు.. ఈ రోజు ఆ విప్లవ వీరుని జయంతి సందర్భంగా ఆ త్యాగాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం..


తెలుగు వీర లేవరా, దీక్షబూని సాగరా... దేశమాత స్వేచ్చ కోరి తిరుగుబాటు చేయరా... అంటూ భరతమాత విముక్తి కోసం బ్రిటీషువారిని గడగడలాడించిన మన్యం వీరుడు మన అల్లూరి సీతారామరాజు. అల్లూరి ఒక వ్యక్తి కాదు ఆయనో మహోజ్వల శక్తి. ఆయన జీవితం విప్లవానికి ఒక సంకేతం.

స్వతంత్రం సాదించటానికి ఆయుధాలు సుశిక్షుతులైన సైనికులు కాదు..అది సాధించాలన్న కాంక్ష చాలని నిరూపించిన అసలు సిసలు భారతీయుడు అల్లూరి. అందుకే లోకజ్ఞానం లేని అడవి బిడ్డలనే ఆయుధాలుగా మార్చి తెల్లదొరలు గుండెలు చీల్చాడు..

సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు అల్లూరి. కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు.

అడవిబిడ్డలైన గిరిజనులను ఏకంచేసి... ఆ ప్రకృతి సంపదలను అనుభవించే హక్కు గిరిజనులదేనని ఎలుగెత్తి చాటాడు. ఈయన పోరాట పటిమ, విప్లవ కార్యాచరణ అనితర సాధ్యం. పోడు వ్యవసాయానికి పన్ను కట్టక్కర లేదన్నాడు, గిరిజనులను నిలువు దోపిడీ చేస్తున్న దళారుల మీద, వారికి అండదండలుగా ఉన్న బ్రిటీషువారిమీద అల్లూరి తన విల్లును ఎక్కుపెట్టాడు. ప్రతీ గిరిజనున్ని ఒక గెరిల్లా యోధునిగా మార్చి తెలుగు నేలకు స్వతంత్ర పోరాట మార్గం చూపాడు..

భీమవరానికి ఆరుమైళ్ల దూరంలో ఉండే మోగల్లులోని పాండ్రంకిలో వెంకటరామరాజు, సూర్యనారాయణమ్మ దంపతులకు 1897 జూలై 4వ తేదీన జన్మించారు అల్లూరి సీతారామరాజు.

ఆంగ్లం, సంస్కృతం, తెలుగు బాగా చదువుకున్న వెంకటరామరాజుకు జాతీయ భావాలు ఎక్కువే. తండ్రి భావాలను పుణికిపుచ్చుకున్న అల్లూరికి, తండ్రి నడిపే ఫొటో స్టుడియోలోని జాతీయ నాయకుల ఫొటోలు, వారి జీవిత విశేషాలు ఎక్కువగా ప్రభావం చూపించాయి. వందేమాతరం ఉద్యమం జరుగుతున్న రోజుల్లోనే పసిప్రాయం వీడకపోయినా తండ్రితో సహా అనేక సభల్లో పాల్గొన్నారు.


అదే సమయంలో గిరిజనులపై జరుగుతున్న దురాగతాలను చూసి చెలించిపోయిన అల్లూరి వారికి యుద్ధ విద్యలు, గెరిల్లా యుద్ధ పద్ధతులను నేర్పించి పోరాటానికి సిద్దం చేశాడు. 1922 సంవత్సరం మన్యంలో కాలుపెట్టిన సీతారామరాజు విప్లవానికి రంగం సిద్ధం చేశాడు. తన విప్లవ దళాలతో పోలీసు స్టేషన్లపై మెరుపుదాడులు నిర్వహించి బ్రిటిషు అధికారులను గడగడలాడించాడు.

సమాచారం ఇచ్చి మరీ పోలీసుస్టేషనులపై దాడుల నిర్వహించి బ్రిటిషు అధికారుల్లో ముచ్చెమటలు పట్టించాడు. అయితే అదే ఏడాది అల్లూరి సీతారామరాజు విప్లవదళానికి మొదటి ఎదురుదెబ్బ తగిలింది. 1922 డిసెంబరు 6న జరిగిన పోరులో 12 మంది అనుచరులను రామరాజు కోల్పోయాడు.

ఆ తర్వాత రామరాజు కొన్నాళ్లు ఎలాంటి పోరాటాలు జరుపలేదు ఆ సమయంలో ఆయన మరణించాడనే పుకార్లు కూడా వ్యాపించాయి. అయితే అల్లూరి 1923 సంవత్సరం ఏప్రిల్ నెలలో మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. మరోసారి దాడులకు దిగాడు.

కాని అల్లూరికి సాయం చేస్తున్నారన్న నేపంలో బ్రిటీస్‌ అధికారులు మన్యం ప్రజలను వేథిచటం మొదలు పెట్టారు.. తనకున్న అవకాశాలతో పూర్తి స్థాయిలో మన్యం వీరులకు రక్షణ కల్పించలేని రామరాజు లొంగిపోవాలనుకున్నాడు.. అలా అయిన మన్యం ప్రజలకు వేదింపులు తగ్గుతాయని భావించాడు.. తాను స్నానానికి చేరువు దగ్గరకు రాబోతున్నట్టుగా తన అనుచరుల ద్వారా బ్రిటీష్‌ అధికారులకు సమాచారం అదించాడు రామరాజు..

 
1923 మే 7న ఏటి ఒడ్డున స్నానం చేస్తుండగా ఆయనను బంధించిన పోలీసులు ఎటువంటి విచారణ చేపట్టకుండానే అదే రోజున కాల్చిచంపారు. ఆయుదం చేతిలో లేని అల్లూరిని కూడా ఎదిరించలేని బ్రిటీష్‌ పోలీసులు ఆయన చెట్టు కట్టేసి కాల్చి కసి తీర్చుకున్నారు.. కాని బ్రిటీష్‌ అధికారులు ఓ నాయకున్ని చంపగలిగారు కాని ఆయన ప్రజల్లో రగిలించిన.. స్వతంత్ర కాంక్షను మాత్రం ఆర్పేయలేకపోయారు.. తెలుగు నేల మీద కూడా స్వతంత్ర సమరానికి బీజాలు వేసిన మహానాయకుడు అల్లూరి జయంతి సందర్భంగా ఒక్కసారి ఆ మహానాయకుని మరోసారి ఘన నివాళి అర్పిద్దాం..