ఉద్యమాన్ని నడపాలంటే మిగిలిన మార్గాలేమిటి?

'ఉద్యమా'న్ని ముందుకు నడపాలంటే "మిగిలిన మార్గాలేమిటి?'': పాలుపోని కెసిఆర్ ప్రశ్న!

- డాక్టర్ ఎబికె ప్రసాద్
[సీనియర్ సంపాదకులు]

 

telangana, kcr trs, telangana issue kcr, trs telangana issue

 

 

ఆడలేక 'మద్దెలే వోటిద'ని వెనకటికో వాగాడంబరి కోశాడని తెలుగువాడి సామెత. ఆ సంప్రదాయంలో ఎదిగిన వేర్పాటువాది, పెద్దవలసదారైన కల్వకుంట్ల చందశేఖర రావు అనే వ్యక్తి "తెలంగాణా'' మకుటంతో ప్రాంతపు ఔత్సాహిక కళాకారులు, నిర్మాత తీయనున్న చలనచిత్రానికి "క్లాప్''కొట్టిన సందర్భంగా ఓ చిత్రమైన ప్రకటన చేశాడు : "ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవటానికి ఇంకా ఏమేమి ఆప్షన్స్ (అవకాశాలు/మార్గాలు) ఉన్నాయో వెతకాల''ని చెప్పాడు! అంటే, అతని ఉద్దేశ్యంలో రాజకీయ నిరుద్యోగిగా తాను తలపెట్టిన వేర్పాటు ఉద్యమానికి ఇప్పటివరకూ ఉన్న "ఆప్షన్స్'' అన్నీ వాడేసుకున్నానానీ, అయినా ప్రత్యేకరాష్ట్రం రాలీదనీ భావిస్తున్నట్టా? లేక తనకు తెలియని "ఆప్షన్స్''ను ప్రతిపాదించాలని ఇతరులను ఆయన కోరుకున్నట్టా, తెలియదు. లేదా, ఇన్నేళ్ళుగా 'ఉద్యమా'న్ని నిర్వహిస్తూ కూడా తనముందున్న "ఆప్షన్స్'' అన్నీ ఉడిగిపోయాయని ఆయన అంగీకరిస్తున్నట్టా? ఒక రాజకీయ నిరుద్యోగిగా తనకు తోచిన "ఆప్షన్స్'' అన్నీ వాడుకుంటూ వచ్చినవాడు ఎందుకింత పేలవంగా ఇతరులముందు సాగిలపడుతున్నట్టు?

 

కాంగ్రెస్ అధిష్ఠానవర్గంతో ఢిల్లీలో జరిపిన రహాస్యమంతనాలలో తన పార్టీ "తెలంగాణా రాష్ట్ర సమితి''ని కాంగ్రెస్ లొ "విలీనం'' చేయడానికి అతడు ఆమోదించి వచ్చిన తరువాత - "ఎబ్బెబ్బే, అదేంలేదు, కాకపొతే ప్రత్యేకరాష్ట్రం ఏర్పాటు చేస్తానని హామీ యిస్తే గంగలో కలిసిపోయినట్టుగా కాంగ్రెస్ లొ కలిసిపోతాన''ని చెప్పివచ్చాడు కాబట్టి పార్టీని అలా తాకట్టుపెట్టి రావడం వల్ల తెలంగాణాప్రజల్లో తాను చులకమై పోతూండడం గమనించిన కెసిఆర్ పళ్ళాబిగువకోసం ఇప్పుడు ''వేరే ఆప్షన్స్'' గురించి కొత్త 'టూమ్రీ'లువదులుతున్నాడు! ఆ అన్యమార్గాలేవో తనకు తెలియనివా? తెలియనివి కాదు; ఎందుకంటే "ఆప్షన్స్'' తెలియనివాడు ఇంతకాలం అబద్ధప్రచారాలతో తెలుగుజాతి ఐక్యతను బద్ధలుకొట్టడానికి ప్రయత్నించి ఉండేవాడు కాడు. బెదిరింపులు, అదిరింపులు అయిపోయాయి, దొంగ సత్యాగ్రహాలూ ముగిసాయి, ఉసిగొల్పిన యువత ఆత్మహత్యల పర్వమూ పనిచేయలేదు, యజ్ఞవాటికలొ బూడిద పేరుకుపోయినా ఫలితం దక్కలేదు, రోజుకొక తీరున క్రాపు, మేకప్పు దిద్దుకున్నా ముఖ్యమంత్రి పదవి దక్కదని తేలిపోయింది.


ఆంధ్రజాతిలో అంతర్భాగామైన సోదర తెలంగాణా తెలుగుప్రజల్ని మభ్యపెడుతూ, రాష్ట్రం వస్తే తెలంగాణాలోని ఇతరప్రాంతాల తెలుగువారి భూముల్ని, ఇళ్లను, పరిశ్రమలను స్వాధీనం చేసుకుని పంచిపెడుతానని తెలుగుప్రాంతం నుంచి తెలుగువారిని వెళ్లగొడతామని, వెళ్ళకపోతే తనని పంపిస్తామని, ఇలా అడ్డగోలు ప్రచారం ద్వారా భారీఎత్తున ఈ వేర్పాటువాది తెలుగుప్రజల మధ్య విద్వేషాన్ని పెంచుతూ సొంత స్వార్థపూరిత ఉద్యమాన్ని పెంచుకుంటూ వచ్చాడు. ఇది పచ్చి బూతులతో అతడు నిర్మించిన "మల్టీనేషనల్ కుటుంబ'' ఉద్యమం! ఎందుకని ఇది అతని కుటుంబ ఉద్యమమని అనవలసి వస్తోందంటే, ఏ వేర్పాటు ఉద్యమానికి ఒక రాజకీయ నిరుద్యోగి సూత్రధారి అయ్యాడో, ఆ కెసిఆరే 1996 జూలై 18వ తేదీన పెద్దమనుషుల ఒప్పందం ఫలితంగా కుదిరిన ఆరుసూత్రాల పథకాన్ని వ్యతిరేకించి, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులను రాష్ట్రంలో ఎక్కడ వేసిన లేదా ఎక్కడికి బదిలీ చేసినా సరే వెళ్ళి పనిచేయాలనీ, జోనల్ పద్ధతిని వ్యతిరేకించుతూ రాష్ట్ర శాసనసభలో బాహాటంగా ప్రకటించాడని మరచిపోరాదు!  ఈ వాస్తవాన్ని మరిచిపోయిన ఇతర స్వార్థపూరిత రాజకీయపక్షాలు, ముఖ్యంగా ఏ విశాలాంధ్ర ఏర్పాటుకు అశేష త్యాగాలతో తోడ్పాటునందిన్చారో ఆ కమ్యూనిస్టులూ "బంగారు లేడి వెంటపడిపోయిన'' (బంగారులేడి అంటూ ఉంటుందా అని కూడా ఆలోచించని) రాముడులాగా కె.సి.ఆర్. వెంట పడిపోయి తెలుగుజాతినివిచ్చిన్నం చేయడానికి నడుంకట్టారు. ఆనాడు శాసనసభ నిండు పేరోలగంలొ [18-07-1996] అంటే 16 ఏళ్ళనాడు ఈ కెసిఆర్ ఏమని చెప్పాడు? అతని మాటల్లోనే వినండి"


"రాష్ట్రంలో నేడు నెలకొని ఉన్న ఆర్ధిక పరిస్థితులను సమగ్రంగా సమీక్షించి, సరైన చర్యలు చేపట్టి, రాష్ట్రం యొక్క సత్వర అభివృద్ధికి సమగ్రాభివృద్ధికి దోహదపడాల్సిన సత్సంకల్పంతో, సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడుగారిని అభినందిస్తున్నాను. సమాజంలో ప్రగతిశీల భావాలు వస్తూ ఉంటే కొన్ని నష్టాలు వస్తూ ఉంటాయి. ఏ కార్యక్రమాన్ని నూటికి నూరుపాళ్ళు అమలు చేయడం కష్టం. సమాజంలో నైతిక పరివర్తన జరుగుతోంది. దీనిని సహృదయంతో అర్థం చేసుకుని, మద్యనిషేధం విషయంలో కూడా అర్థం చేసుకుని స్పందించాలని కోరుతున్నాను. ఉద్యోగులకు సంబంధించి ఆరుసూత్రాల పథకం, జోనల్ సిస్టమ్ వంటివి దెబ్బతీస్తున్నాయి. సర్ ప్లస్ స్టాఫ్ ను రాష్ట్రంలో ఎమూలకైనా వాడుకునేలా వీలుండాలి. కాని ఆ విధానం లేదు. మనకు మనం విధించుకున్న ఆటంకమే ఆరుసూత్రాలల జోనల్ విధానం. సిబ్బందిని వినియోగించుకోలేక పనిలేకపోయినా లక్షల, కోట్ల రూపాయలను నిరర్థకంగా ఖర్చుచేస్తూ వృధా చేస్తున్నాం!



ఈ విధానంలో మార్పులు చేయాలి. డైనమిక్ గా మూవ్ కావాలి. ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిథులతోను, ఉద్యోగసంఘాలతోనూ సంప్రదింపులు జరిపి జోనల్ విధానాన్ని తొలగించడానికి ప్రయత్నం చేయాలి. ఇక అప్పులు, వడ్డీలు ఎలా చెల్లిస్తాము? పట్టణప్రాంతాల్లో కొన్ని వందల కోట్ల రూపాయల విలువైన భూములు, ప్రభుత్వ ఆస్తులు అన్యాల్రాంతం అయిపోతున్నాయి. వీటిని ఆక్రమించుకుని ధనవంతులు అవుతూంటే నిస్సహాయతగా ప్రభుత్వం చూస్తోంది. అప్పులు తీర్చడానికి పరిస్థితులు ఉంటే మున్డుకురావటానికి, కొత్తగా అప్పులు తెచ్చుకోవడానికి క్యాపిటల్ పెట్టి రెమ్యూనరేషన్ గా ప్రగతి సాధించడానికి వీలు ఉంటుంది. ప్రభుత్వం ఇటువంటి విలువైన ఆస్తులను వేలం వేసి అప్పులు తీర్చడానికి ఆస్కారం ఉంటుందేమో చూడాలి''! ఇదీ కెసిఆర్ తంతు!



ఎప్పటికప్పుడు అబద్ధపు ప్రకటనలతో కాలక్షేపం చేస్తూ తెలంగాణా తెలుగుప్రజలను, దొరల, జాగిర్దార్ల, పటేల్ పత్వారీల దాష్టికాలనూ, నిరంకుశ నిజాం పాలనపైన విలువైన సాయుధపోరాటం సాగించిన ప్రజలను తిరిగి 'దోర'ల పాలనకోసం కెసిఆర్ తన మాటల్ని తానే మింగేసి తెచ్చినదే వేర్పాటు ఉద్యమం. స్థానిక రాజకీయ సమీకరణలను తారుమారు చేయగల మౌలిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో కెసిఆర్ వేర్పాటు ఉద్యమ పార్టీ దాదాపు నామరూపాలు లేకుండా పోయింది! ఆ మధ్య జరిగిన ఉపఎన్నికల్లోనూ గుడ్లు తేలవేసింది! ఈ భాగోతం చాలక, "ఇదిగో ప్రత్యేకరాష్ట్రం నేడే వస్తుంది, కాడు రేపు వస్తుంది, కాడు ఎల్లుండి వచ్చేస్తోంది'' అంటూ ఎప్పటికప్పుడు సొంత వాయిదాలు ప్రకటిస్తూ తెలంగాణా ప్రజాను మోసగిస్తున్న వ్యక్తులు ఇటీవలి ఫలితాలనుంచి పాఠం నేర్చుకొనకుండా ఈసారి "ఎం.ఎల్.సి. ఫలితాలతో ఢిల్లీ దిమ్మతిరిగిపోవాలి  '' అంటూ ఉత్తరకుమారుల్లా  ప్రకటనలతో సరిపెట్టుకోవాల్సిన దుస్థితి వచ్చింది. అంటే, అట్టడుగున మాత్రం ఈ ప్రాంతంలోని తెలుగు ప్రజాబాహ్య్ల్యం ఈ రాజకీయ నిరుద్యోగి మాటల్ని నమ్మడం లేదని అర్థమవుతుంది కనుకనే తనను అవమానభారం నుంచి రక్షించుకోవటానికి "కొత్త ఆప్షన్స్'' కోసం వెతుకులాడుతున్నాడు!



ఇది యిలా ఉండగా వేర్పాటు పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడి పనిచేస్తూ వచ్చిన "సంయుక్త కార్యాచరణ సంఘం''లొ కూడా చీలికలొచ్చాయి. ఈ సంఘం నాయకుడికి - వేర్పాటు పార్టీ నాయకుడికీ మధ్య పొత్తూ పొంతనా లేదు సరికదా, పరస్పరం పరోక్షంగా తిట్టుకోడం, కుమ్ముకోవాడమూ జరుగుతున్నాయి. పైగా అందరూ 'నగారా' వాయించేవాళ్ళే, ప్రత్యేకరాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న తనకు జె.ఎ.సి. వర్గం తనలోకి రానివ్వకుండా కెసిఆర్ అడ్డుకొంటున్నాడని ప్రాంత "నగారా సమితి'' అధ్యక్షుడు నాగం జనార్థన రెడ్డి ఆరోపిస్తున్నాడు. ఏతా వాతా ఇప్పుడు జరుగుతున్నది తెలుగుజాతిని చీల్చబోయి వేర్పాటు ఉద్యమమే ఇప్పుడు చీలుబాటలలోకి జారుకుంటోంది. ఈ దిగ'జారుడు' పరిణామాన్ని తెలంగాణా ప్రజాబాహుళ్యం కనిపెట్టకుండా ఉండడంకోసం 'బొబ్బిలిదొర' వర్గం ఆడుతున్న పెద్దనాటకం - తాను అబద్ధపుప్రచారాలతో, శుష్క వాగ్దానాలతో, వంచనాశిల్పంతో, విద్వేష ప్రచారంతో ప్రోత్సహించిన మన తెలుగుబిడ్డల ఆత్మహత్యలకు ప్రభుత్వాలే కారణమని పదేపదే బొంకనేర్వటం! కాని తన స్వార్థపూరిత ఉద్యమాన్ని ప్రారంభించిన 'దోర'కు తెలుగుబిడ్డల ప్రేతాత్మలె రేపటి పీడకలలై పీడించినా ఎవరూ ఆశ్చర్యపోవలసిన పనిలేదు, కాంగ్రెస్ కు తన తనువునూ, ఉద్యమాన్ని తాకట్టుపెట్టి వచ్చినా సరే! అందుకే రాజకీయ నిరుద్యోగులు నిర్మించే 'ఉద్యమా'లకు గాలివాటం తప్ప దిశా, దశా ఉండవు!