నాడివేగంలో మార్పులు: నాడివేగం తగ్గటం (బ్రాడీకార్డియా)

 

1. మీరు అల్లోపతి మందులేవయినా వాడుతున్నారా?

మందుల దుష్ఫలితాలు

2. మీకు లోలోన చల్లగా అనిపిస్తుందా? బరువు పెరుగుతున్నారా?

థైరాయిడ్ గ్రంథి చురుకుదనం తగ్గటం (హైపోథైరాయిడిజం)

3. మీరు ఎంత శారీరక శ్ర్రమ చేసినప్పటికీ మీ నాడి వేగం 60కు మించకుండా ఉంటుందా?

గుండెకు చైతన్యపరిచే ప్రచోదన వాహకతలో దోషం ఏర్పడటం (హార్ట్ బ్లాక్)

4. మీకీ మధ్య జ్వరం వచ్చిందా? దాని వ్యావధి వారం రోజులు మించిందా?

టైఫాయిడ్ జ్వరం

1. మందుల దుష్ఫలితాలు:

కొంతమందికి వృద్ధాప్యంలో గుండె స్పందనల్లో ఒడిదుడుకులు ఏర్పడుతుంటాయి. వీటిని సరిచేయడం కోసం డాక్టర్లు డిజిటాలిస్ తాలూకు రసాయనాంశాలు కలిగిన మందులను సూచిస్తుంటాయి. ఈ మందులకు నాడి వేగాన్ని బలహీనపరిచే గుణం ఉంది. డిజిటాలిస్ లేదా డిజాక్సిన్ కలిసిన మందులను వాడే సమయంలో అప్పుడప్పుడూ ఎవరికీ వారే నాడి వేగాన్ని పరీక్షించుకోవడం మంచిది, అలాగే మోతాదు సవరణకోసం మధ్యమధ్యలో డాక్టర్ని కలవడం మరిచిపోకూడదు. అధికరక్తపోటు, ఆందోళన, గుండెనొప్పి, మైగ్రేన్ మొదలయిన వాటికి వాడే కొన్ని మందులకు నాడి వేగాన్ని తగ్గించే గుణం ఉంది. నాడి వేగం బాగా తక్కువగా ఉన్నప్పుడు దానికి కారణం మీరు వాడుతున్న మందులే అయితే ఆ విషయం మీ డాక్టర్ తో చర్చించండి. వాటి మోతాదు మార్చవలసి రావచ్చు.

2. థైరాయిడ్ గ్రంథి చురుకుదనం తగ్గటం (హైపోథైరాయిడిజం):

థైరాయిడ్ గ్రంథి శారీరక క్రియా ధర్మాల వేగాన్ని నియంత్రిస్తుందన్న సంగతి తెలిసిందే, నాడి వేగం తగ్గడానికి ఒక ప్రధాన కారణం థైరాక్సిన్ లోపమే. దీని వలన నాడి స్పందన 60 కు పడిపోవచ్చు. ఈ లక్షణంతోపాటు బరువు పెరగడం, మలబద్ధకం, జుట్టు పలుచనకావడం స్తబ్దత, నిస్తేజత వంటి ఇతర లక్షణాలు కూడా థైరాక్సిన్ లోపం వలన కలుగుతాయి. థైరాయిడ్ గ్రంథి పనితీరులో లోపాలను కారణానుసారం చికిత్సించాల్సి ఉంటుంది. దీనికి 'అపతర్పణ' ప్రధాన ఔషధాలు అవసరమవుతాయి. ఇవి శరీరాన్ని చురుకుగా చేస్తాయి. వీటివల్ల నాడి వేగం పెరుగుతుంది.

గృహచికిత్సలు: 1. ఐయోడిన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను (సముద్రపు చేపలు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, పిల్లిపీచర గడ్డలు) ఎక్కువగా తీసుకోవాలి. 2. థైరాయిడ్ గ్రంథి చురుకుదనాన్ని తగ్గించేలా చేసే ఆహార పదార్థాలను (క్యాబేజీ, మెంతికూర, క్యాలీఫ్లవర్, మొక్కజోన్నలు, చిలకడదుంపలు. తోటకూర) తీసుకోకూడదు. 3. విటమిన్ బి- కాంప్లెక్స్ కలిగిన ఆహారాలు (తృణ ధాన్యాలు, గింజలు) విటమిన్ -ఏ కలిగిన ఆహారాలు (ముదురు ఆకుపచ్చని రంగులో ఉండే ఆకులు, పసుపు పచ్చ రంగులో ఉండే పండ్లు) ఎక్కువగా తీసుకోవాలి.

ఔషధాలు: చతుర్ముఖ రసం, క్రమవృద్ధి లక్ష్మీ విలాస రసం, మకరద్వజ సింధూరం, పూర్ణచంద్రోదయం, పంచబాణ రసం, స్వర్ణక్రవ్యాది రసం, వసంతకుసుమాకర రసం, ఆరోగ్యవర్ధినీ వటి. చంద్రప్రభావటి, గోక్షురాది గుగ్గులు, కాంచనార గుగ్గులు, మధుస్నుహి రసాయనం, మహాయోగరాజ గుగ్గులు, నవక గుగ్గులు, పంచతిక్త గుగ్గులు ఘృతం, త్రయోదశాంగ గుగ్గులు, యోగరాజు గుగ్గులు, భృంగరాజాసవం, దాత్రీలోహం, కుమార్యాసవం, కాంతవల్లభ రసం, లోహాసవం, లోహరసాయనం, లోకనాధ రసం, నవాయస చూర్ణం, ప్రాణదా గుటిక, రజతలోహ రసాయనం, స్వర్ణమాక్షీక భస్మం, స్వర్ణకాంత వల్లభ రసం, సప్తామృత లోహం.

3. గుండెను చైతన్యపరిచే ప్రచోదన వాహకతలో దోషం ఏర్పడటం (హార్ట్ బ్లాక్):

శారీరక శ్రమ తరువాత కళ్ళు తిరుగుతున్నట్లుగా, స్పృహ తప్పుతున్నట్లుగా అనిపిస్తే అది ఒక్కొక్కసారి హార్ట్ బ్లాక్ ను సూచిస్తుంది. హార్ట్ బ్లాక్ అనగానే గుండె అంతా నిండిపోవడమో, లేదా అడ్డుకుపోవడమో అనుకోకండి, గుండెలోని పై గదులలో జనించే విద్యుత్ ప్రకంపనలు కింది గదుల వరకు యథాతథంగా చేరలేకపోవడమే హార్ట్ బ్లాక్ అంటే. ఇలా జరగడం వలన గుండె కండరాలు పూర్తిస్థాయిలో సంకోచించలేవు. ఇది చాలా వరకు జన్మతః ప్రాప్తిస్తుంది. ఒకోసారి రక్తనాళాలు గట్టిపడటం, స్వీయ రక్షక వ్యవస్థ దెబ్బతినడం, గుండె కండరాలలో అసాధారణతలు చోటుచేసుకోవడం వంటి కారణాలు కూడా హార్ట్ బ్లాక్ కు దోహదపడగలవని గుర్తుంచుకోవాలి.

ఔషధాలు: శృంగి భస్మం, విశ్వేశ్వర రసం, బృహత్ వాత చింతామణి రసం, నాగార్జునాభ్రరసం, సిద్ధమకర ద్వజం, అర్జునారిష్టం, హృదయార్ణవరసం.

4. టైఫాయిడ్ జ్వరం:

ఒక్కటైఫాయిడ్ సంబంధ జ్వరంలో తప్ప దాదాపు మిగతా జ్వరాలలోనూ ఉష్ణోగ్రతతోపాటు నాడి వేగం కూడా పెరుగుతుంది. కాబట్టి ఉష్ణోగ్రతపాటు నాడి వేగం పెరగకపోవడమనేది టైఫాయిడ్ ను గుర్తించడానికి ఉపయోగపడే ఒక ముఖ్యమైన లక్షణం. టైఫాయిడ్ ను ఆయుర్వేదంలో మంధరజ్వరమనీ, అంత్రిక జ్వరమనీ అంటారు. ఈ వ్యాధి వచ్చినవారి పేగు లోపలి లైనింగ్ మీద వెడల్పాటి మచ్చలు తయారవుతాయి. టైఫాయిడ్ జ్వారానికి దోషాల ఆధారంగా, లక్షణాల ఆధారంగా చికిత్స చేయాల్సి ఉంటుంది.

గృహచికిత్సలు: 1. తుంగముస్తలు, పర్పాటకం, అతిమధురం, ద్రాక్ష వీటిని సమభాగాలు గ్రహించి కషాయం కాచి, పూటకు అర కప్పు చొప్పున మూడుపూటలా తేనె చేర్చి తీసుకోవాలి. 2. చందనం, వట్టివేళ్లు, ధనియాలు, కురువేరు, పర్పాటకం, తుంగముస్తలు, శొంఠి, వీటిని సమతూకంగా తీసుకొని కషాయం కాచి రోజుకు మూడుసార్లు తాగాలి.

ఔషధాలు: బృహత్ కస్తూరి భైరవ రసం, గోదంతి మిశ్రణం, సంజీవనీవటి (విరేచనాలు కూడా ఉంటే)