సప్తధాతువులు

శుక్రము - సంభోగము - ఓజస్సు - బ్రహ్మచర్యము:

మనుష్యుల దేహమందు సప్తధాతువులు (7 ధాతువులు) ఉన్నాయి.అవి వరుసగా- రసము, రక్తము, మాంసము, మేధస్సు (కొవ్వు), ఆస్థి (ఎముక), మజ్జ (మూలుగ), శుక్రము. ఈ ధాతువులు మనుష్య దేహాన్ని ధరిస్తున్నాయి కాబట్టి వీటికి ధతువులని పేరు. ఆహారం చెందినా పరిణామమే శుక్రము. మనము భుజించిన ఆహారము జీర్ణము అయిన తర్వాత దాని సారము రసధాతువుఅగును. రసములోని కొంత రక్తముగా మారుతుంది, అట్లే వరుసగా - మాంసము, మేధస్సు, ఆస్థులు, మజ్జగా మారి చివరికి శుక్రముగా మారుతుంది, ఒక ధాతువు మరో ధాతువుగా మారేందుకు సుమారు 5 రోజులు పట్టును, ఈ విధంగా రసములోని కొలది భాగము శుక్రముగా మారేందుకు 30 దినములు పడుతుంది. ఆహారము శుక్రముగా మారగానే పాచన క్రియ ఆగిపోవును, పాచన క్రియలోని మిగిలినది పిప్పి - గుబిలి, చీమిడి, పాచి, వెంట్రుకలు, గోళ్ళు మూలముగా బయటకు వస్తుంది గర్భోపనిషత్తుః షడ్రసములు, సప్తధాతువుల గురించి చెప్పిన శ్లోకము.

షడ్విధోరసో, రసాచ్చోణితం, శోనితాన్మాంసం

మంసాన్మేదో, మేదసోస్థీన్యస్థిభ్యోతమజ్జా., మజ్జాయష్శుక్లః

రసములు ఆరు విధములు: కటు (కారము), ఆమ్ల (పులుసు) లవణ (ఉప్పు), కషాయ (వగరు), తిక్త (చేదు), మధుర (తీపి) రసములు, ఈ 6 రసముల నుండి రక్తము, రక్తము నుండి మాంసము, మాంసము నుండి మేధస్సు (కొవ్వు) మేధస్సు నుండి ఎముకలు, ఎముకల నుండి (మూలగ), మజ్జ నుండి శుక్రము కలిగుచున్నది.

శుక్రము: సప్తదాతువుల పరిణామ సారమే శుక్రము, ఆరవధాతువు అయిన మూలగ నుండి శుక్రము ఏర్పడును. ఈ శుక్రము శరీరమునందంతటను వ్యాపించి యుండును. పాలలోని వెన్నెలాగా, చెరకులోని బెల్లములాగా, పాలు మధింపబడి, వెన్న వచ్చినట్లుగా శరీరము మధింపబడి వీర్యము వస్తుంది. వీర్యము ప్రతి కణములో జీవశక్తి ఉంటుంది. వెన్న పోగానే పాలు ఎట్లు సారహీనమగునో, అట్లే వీర్యము పోగానే శరీరము సారహీనమగును. శరీరములోని నాడులన్నీ శక్తి కోల్పోతాయి. ప్రతి అవయవము బలహీనపడుతుంది. వీర్యపతనమే మానవ పతనము.

శివసంహిత – వీర్య (బిందు) పతనము వలననే మరణము. వీర్యధారణవలననే జీవనము అని చెప్పారు. మైధునము వలన వీర్య నాశనమగును, శాస్త్రములో అష్ట (8) విధ మైధునములు చెప్పారు, వానిని తప్పించుకొని ఆరోగ్యము పొందుటకు ప్రయత్నించాలి.

 

శ్లో|| స్మరణం కీర్తనం కేళిః ప్రేక్షణం గుహ్యభాషణమ్

సంకల్పో ధ్యవసాయశ్చక్రియనిష్పత్తిరేచన!

ఏతన్మైధున మష్టాంగం, ప్రవదంతి మనీషిణః

విపరీతం బ్రహ్మచర్య మనుష్టేయం ముముక్షుభిః

 

అర్థము: 1. స్త్రీని స్మరించుట, 2. ఆమె రూప గుణములను వర్జించుట, స్త్రీ సంబంధమైన చర్చ చేయడం, కీర్తించుట, శృంగార గ్రంథములు పటించుట, 3. స్త్రీలతో చీట్లపేక, జూదము, చదరంగము మొదలగునవి ఆడుట. 4. స్త్రీని చెడు దృష్టితో చూచుట, 5. స్త్రీతో ఏకాంత సంభాషణము చేయడం, 6. స్త్రీని ఎట్లయిన వశము చేసుకొనేందుకు మనస్సులో సంకల్పము చేయడం, 7. డానికి ప్రయత్నించుట, 8. ప్రత్యక్ష సాంగత్యము చేయడం - అనే ఈ 8మైధునములని చెప్పిరి, స్త్రీతో ప్రత్యక్ష సంగమము వలననే గాక, మిగిలిన 7 రకముల మైధున క్రియ వలన కూడా వీర్యము స్థలించును.

 

సామాన్యులకు సంభోగవాంఛ మీద కోర్కె ఉండి ఇంద్రియ వాంఛకు లోబడి కామోద్రేకమును పొంది సంభోగమును చేస్తూ వీర్యమును బైటకు పంపుచున్నారు. వీరిని అథోరేతస్కులు అంటారు. సంభోగము జరిపి సంఖ్యను బట్టి వారి ఆరోగ్యము ఆధారపడి ఉంటుంది. కొంతమంది Sexologists (నేను కూడా వృత్తిరీత్యా Post Graduate Diploma ఉన్న Sexologist). ఉత్పత్తి అయిన వీర్యము సంభోగము ద్వారా, కానీ హస్త ప్రయోగము ద్వారా కానీ బయటకు వెళ్ళాలి అని చెప్తున్నారు, ఇది సరికాదు. వీర్యమును, వీర్యములో ఉన్న శక్తిని నిగ్రహించుకొని శరీరములో ఎంత నిలుపుకోగలిగితే అంత ఆరోగ్యము, మేధాశక్తి పొందుతారు.

బ్రహ్మచర్యము - వీర్యమును నిలుపుకొనే శక్తి: ప్రాణశక్తిని, ఓజోశక్తిని పెంచుకొని మంచి ఆరోగ్యమును, ఆయుష్షును మేధాశక్తి, దివ్య ప్రాశక్తిని పొందవలెను. తపన (Intense Desire)ఉన్నవారు ఈ వ్యాసంలో సూచించిన భక్తి, ధ్యానము, కొన్ని రకముల ప్రాణాయామము ద్వారా శరీరములో ఉత్పత్తి అయిన స్థూలమయిన వీర్యమును, వీర్యశక్తిని (Sex Energy) సూక్ష్మమైన ఒజస్సుగా మార్చుకోగలుగుతారు. ఉత్పత్తి అయిన వీర్యము వీర్యరూపములో ఉండక ఓజస్సుగా మారుతుంది. అంతేకాని కొంతమంది వైద్యులు చెప్పేటట్లుగా ఉత్పత్తి అయిన వీర్యము అధికముగా నిలువ ఉండి శరీరమునకు చెడు జరుగుననుట నిజము కాదు. నలువది లీటర్ల భోజనము నుంచి ఒక లీటరు రక్తమగును. ఆ లీటరు రక్తము నుండి రెండు తులములు మాత్రమే వీర్యము అగును. ప్రతిరోజూ ఒక లీటరు (లేక ఒక కిలో) భోజనము చేసే వ్యక్తి నేలకు 30 లీటర్లు భుజిస్తాడు. నెలలో 1 ½ తులములు మాత్రమే వీర్యమగును. ఒక్కసారి స్త్రీ సంపర్కము వలన 1 ½ తులములు వీర్యము పోతుంది. అనగా నేలకు సంపాదన ఒకసారి సంపర్కముతో బైటకు పోవును పావుసేరు రక్తము నుండి ఒక్క చుక్క నీరు వీర్యము తయారవుతుంది. ఈ శుక్లము ఒక సంభోగమున 30 చుక్కల పైగానే ఖర్చు అగును. మానవునిలోని శుక్రములో ఉన్న శక్తి వృధా చేయరాదు, వృధా చేయకుండా ఉంటే శుక్రము ఒజస్సుగా మారుతుంది. సప్తధాతువులలో తేజస్సుగా ఓజస్సు ఉంటుందని సుశ్రుతుడు చెప్పారు.

 

ఓజస్సు: ఇది రసాది సప్తధాతువుల సారభూతమగు శుక్రములోని సారము. అష్టబిందు ప్రమాణమైనది. ఇది స్వచ్ఛముగా, తెల్లగా కొంత పసిమి (పసుపు) రంగులో ఉండి హృదయములో, మెదడులో ఎక్కువగా కేంద్రీకరించి శరీరమంతా వ్యాపించి ఉంటుంది.హృదయమున కొంచెము పసుపు వర్ణముతో రక్తము నందు ఉంటుంది. సప్తధాతువులలో తేజస్సుగా ఓజస్సు ఉంటుంది, దీని ప్రకాశము దేహమునందంతటను వ్యాపించి ఉంటుంది. ఇది స్నిగ్ధము, శీతలము, స్థిరము, శుభ్రము, తేజోరూపమై శరీరానికి కాంతిని, శాంతిని, బలాన్ని ప్రసాదిస్తుంది.

 

ఇది శారీరక, మానసిక ఆరోగ్యమునకు, సుస్థిరతకు ఆధారము. వీర్యమును స్కలనము చేయక. ఒజశ్శక్తిని పెంచుకొను వారి శరీరము నుండి మంచి పరిమళము వస్తుంది భక్తి, సాధన ఉన్నప్పుడే వీర్యము ఓజస్సుగా మారుతుంది, స్త్రీలకు కూడా ఓజస్సు ఉంటుంది. మెదడులో ఓజస్సు ఎంత ఎక్కువగా ఉంటే మానవుడు అంత ఎక్కువ తెలివిగలవాడగును. ఓజస్సు వలన ఉత్సాహము, ప్రతిభ, ధైర్యము, లావణ్యము, సుకుమారత్వము సిద్ధిస్తుంది. ఒజశ్శక్తి ,మనుష్య శరీరములోని శక్తులన్నిటినీ తలలో మహత్తరమైన శక్తి, ఒజశ్శక్తి అధికముగా ఉన్న కొలదియు మనుష్యులను విశేషమగు శక్తి సామర్ద్యములు, బుద్ధిబలము, ఆధ్యాత్మిక శక్తి కలుగుతుంది. సంభోగ వాంఛ రూపమున వ్యక్తమగు కామశక్తి నిరోధిస్తే, సులభముగా ఒజస్సుగా మారుతుంది సామాన్య మానవులు ఆధోరేతస్కులు, వీరికి రేతస్సు బైటకు పోవును, మహర్షులు - ఊర్ధ్వ రేతస్కులు, వీరికి రేతస్సు ఊర్ధ్వముఖమై బ్రహ్మ రంధ్రము వద్ద కేంద్రీకృతమై ఓజస్సుగా ఉంటుంది, ఓజశ్శక్తి వలెనే వ్యాధి నిరోధక శక్తి, మనోబలము, మంచి సంకల్పశక్తి వృద్దవుతుంది. ఒజశ్శక్తి తగ్గినా వ్యాధిగ్రస్తులవుతారు. వారి మనోబలము క్షీణిస్తుంది. వీర్య నాశనమే మృత్యువు వీర్యమును అమితముగా నాశనము చేసుకొన్నవాడు అకాల మృత్యువునుతప్పించుకొనలేడు. శారీరక, మానసిక, బుద్ధిబలమును వృద్ధి చేయు కార్యములన్నింటిలోను, వీర్య రక్షణము గొప్పది. నిముషమునకు 15 సార్లు రక్త ప్రసరములో, తేజోమయములగు శుక్లాణువులు (ఓజస్శక్తి) నిరంతరము సంచరిస్తూ శరీరాన్ని కాపాడుతుంది. ఏ రోగక్రిములను శరీరములో చేరనీయదు.

 

ఆహారము పచనముగావింపబడి, ఆ పచనము గావింపబడిన ధాతువులు రక్తములో కలిసి మనము వివిధ పనులు చేయడానికి శక్తి ఎలా ఉత్పత్తి అవుతుందో, అలాగే వీర్యము స్థలించకుండా సాధన ద్వారా, సూక్ష్మ తేజోమయమయిన ఓజ్జశ్శక్తిగా మార్చుకోవచ్చు. ఇచ్చట పదార్ధతత్వముతో కూడిన వీర్యము శక్తి ధాతువు (ఓజస్సుగా) మారుతుంది. ఒక ఉదా|| గట్టిగా ఉన్న మంచు ముక్క ద్రవరూపంలోని నీరుగాను, ఇంకా సూక్ష్మమైన అవిరిగాను మారుతోంది కదా. మనుష్యులకు 4 ఆశ్రమములు మన ఋషులు ఏర్పరచారు. 100 సంవత్సరములు ఆయుఃప్రమానములో మొదటి 24 సంవత్సరాల వరకు బ్రహ్మ చర్య పాలనమును, 50 సం||లు గృహస్థ్రశ్రమమును, 75 సంవత్సరముల వరకు వాన ప్రస్థాశ్రమమును, 75 సం||ల నుండి జీవితాంతము వరకు సన్యాసాశ్రమములో ఉండే నియమము చెప్పినారు. 24 సంవత్సరమూలా వరకు బ్రహ్మచర్య వ్రతముగావించిన నూరు సంవత్సరములు తప్పక జీ వించెదరు. ఆయుః క్షీణత కారణము బ్రహ్మచర్య నాశనమే. బ్రహ్మచర్యము పురుషుల వలె స్త్రీలు కూడా ఆవశ్యకము. విద్యార్ధిగా ఉండగా వీర్యపాతము చేయరాదు. కామముచే వీర్యపాతము కావించినచో భ్రష్టుడగును. ఇచ్ఛా లేక యే స్వప్నమున వీర్యపాతమైన యెడల ఉదయముననే చన్నీటి స్నానము చేసి సూర్యభగవానుని ప్రార్థించాలి. గృహస్థుడు తన భార్యతో ఋతుకాలమున నెలలో రెండు రోజులు మాత్రమే సత్ సంతానము కొరకు సంగమించువానిని బ్రహ్మచారిగా చెప్పినారు. సంభోగము దైవ్యకార్యము, సృష్టిని పెంపొందించుటకు భగవంతుడు దీనిని ఏర్పాటు చేసినాడు. భార్యతో సంభోగము - దైవకార్యము. పరస్త్రీతో సంభోగము - నింద్యము. ఎక్కువ సార్లు సంభోగించినచో క్రమముగా ఆయుస్సు తగ్గిపోవును. స్మరణశక్తి నశించును. గుండె సరిగా పని చేయదు. ఆకలి తగ్గును, సోమరితనము, బద్ధకము పెరుగును. స్వరము తగ్గును. అగ్ని మాంద్యము, వాతరోగాలు కలుగుతాయి. యౌవనములోనే ముసలిరూపం వస్తుంది. బలహీనమైన, అనారోగ్యముతో కూడిన బిడ్డలను పొందుదురు. ఇంకా అనేక రోగాలు వస్తాయి. ఇట్టి స్థితియే స్త్రీలకు కూడా వర్తిస్తుంది. వీర్యధారణ జాగ్రత్తగా కాపాడు కొనిన వారు పూర్ణాయుస్సు పొందుతారు. రోగాలు లేకుండా, సుఖముగా, తేజస్సుతో, మంచి తెలివితో ఉంటారు. వారికి అకాల మృత్యువు రాదు. త్వరగా ముసలి రూపు రాదు.

కామవాంఛ నిరోధానికి, బ్రహ్మచర్యము అవలంభించేందుకు తద్వారా లైంగిక శక్తిని మేధాశక్తిగా, ఆధ్యాత్మిక శక్తిగా, ఓజశ్శక్తిగా మార్చుటకు కొన్ని సూత్రములు:

లైంగిక సుఖాలను అణచి వేయటం హానికరం అనే సిద్ధాంతం పాశ్చాత్య దేశాలలో బాగా ప్రాచుర్యాన్ని పొందింది. ఇదే సిద్ధాంతాన్ని చాలా మంది అల్లోపతి వైద్యులు నమ్ముతూ ప్రజలకు చెప్తున్నారు. దీని వలన సమాజానికి కీడు జరుగుచున్నది. సామాన్య వ్యక్తులకు లైంగిక వాంఛ అణచివేత ప్రమాదకరం కావస్తుంది, వారు మితి మీరున లైంగిక కార్యంలో పాల్గొంటే వారికి రాబోయే నష్టమును మన మహర్షుల బోధనల నుండి సేకరించి వ్రాసిన ఈ వ్యాసం చదివి, వారు జ్ఞాన దృష్టితో తెలుసుకొని లైంగిక వాంఛను అణచుకొని ప్రయత్నం చేయాలి.

 

భగవంతుడి మీద ప్రేమను పెంచుకోవడం ద్వారా ధ్యానం, యోగ పద్ధతుల ద్వారా నిగ్రహాన్ని పాటించి తద్వారా కామమును ఉన్నతమైన ఓజశ్శక్తిగా మార్చుకొనే ప్రయత్నం చేసి కామాన్ని అణచివేత వల్ల వచ్చే మానసిక శారీరక రుగ్మతల నుండి బైటపడవలసి వస్తుంది.

 

ఈ సూచనలు ఈ క్రింది వారి మేలుకోరి వ్రాయుచున్నాను.

విద్యార్థులు - బ్రహ్మచర్యము అవలంభించేందుకు తద్వారా మేధాశక్తిని పొందేన్డుకుం సంసారులను - కామశక్తిని అదుపులో పెట్టుకొని నియమంగా వాడుకుంటూ మంచి ఆరోగ్యముతో సుఖసంసార జీవితము గడిపేందుకు, సత్ సంతానము పొందేందుకు, సాధన చేయు బ్రహ్మచారులు - కామ వాంఛను అణచివేసేందుకు.

 

1. మనోనిగ్రహము: కేవలం శారీరమైన పద్ధతుల ద్వారా మనిషి కామాన్ని అదుపు చేయలేడు. కామం వేళ్ళు మనస్సులో పాతుకొని ఉంటాయి, కాబట్టి ఈ సమస్యను మానసిక స్థాయిలో పరిష్కరించాలి. అందుచేత మనస్సు గురించిన వివరాలు తెలుసుకోవాలి. (మనస్సు గురించి వేరే వ్యాసము ఈ రచయిత వ్రాసారు. చదవగలరు) సాత్విక మనస్సును పెంపొందించుకొని పదే పదే మనస్సుకు మంచి సూచనలు యిస్తూ చెడు ఆలోచనలకు (Negative Thoughts) నిరోధిస్తూ వీటి స్థానంలో మంచి ఆలోచనలను (Positive Thoughts) ప్రవేశపెట్టి, కామవాంఛతో కూడిన మనస్సును నిగ్రహించి మన అధీనంలోకి తెచ్చుకోవాలి. మనస్సును నెమ్మదిగా బుజ్జగిస్తూ మన ఆధీనంలోకి తెచ్చుకొని విజయం సాధించాలి. కామం వలన వచ్చే నష్టాన్ని, బ్రహ్మచర్యం వలన వచ్చే లాభమును పదే పదే స్మరించాలి. సాత్విక మనస్సు, మనము చెప్పే మంచి సూచనలను గ్రహించి, మనకు మంచి స్నేహితుడిగా ఉండి, మనల్ని ఎల్లవేళలా కాపాడుతుంది.

 

2. ఆహారము: ఏ సాత్విక ఆహారము - తామసిక, రాజరిక ఆహారాన్ని విసర్జించి సాత్విక ఆహారాన్ని తినాలి. కామోద్రేకాన్ని అదుపు చేయడంలో ఆహారము ప్రముఖ పాత్ర వహిస్తుంది. భగవద్గీతలో 17 వ అధ్యాయములో సాత్విక, రాజరిక, తామసిక ఆహారము గురించి వివరంగా శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. ఆహారము శుద్ధముగా ఉంటే మనస్సు శుద్ధముగా ఉంటుంది. ఆహారము యొక్క సూక్ష్మ అంశం మనస్సుగా మారుతుందని చాందోగ్య ఉపనిషత్తులో చెప్పారు.

 

తామసిక ఆహారము: గొడ్డు మాంసము, సారా, ఉల్లి, వెల్లుల్లి, పొగాకు, నిలువ వుండి పాచి పోయిన పదార్ధములు. రాజసిక ఆహారము: చేప, గ్రుడ్డు, మాంసము, ఉప్పు, మసాలా, గేదెపాలు, గేదె పెరుగు. సాత్విక ఆహారము: మూపురము ఉన్న భారతదేశపు ఆవుపాలు, ఆవువెన్న, ఆవు నెయ్యి, కాయధాన్యములు, కాయకూరలు, తేనె, పళ్ళు. బి. మితాహారము: ఆహారము అమితంగా తినడం మంచిది కాదు. శరీర బలము పెరిగి బద్ధకము, మత్తు అజీర్తి రోగాలు ప్రాప్తిస్తాయి. మనస్సు, బుద్ధి మందగిస్తుంది. మితాహారము మంచిది, కడుపులో సగభాగము అన్నాదుల చేతను, పాతికభాగమునీటి చేతను నింపి తక్కిన భాగము గాలి ఆడేందుకు ఖాళీగా ఉంచాలి.

సి.శాకాహారము: సాత్విక గుణము కలిగిన శాఖాహారము భుజించాలి. మాంసమును విసర్జించాలి. మాంసాహారము మాంసమును పెంచుతుంది. బుద్ధిబలమును పెంచదు. శారీరక శ్రమ చేసేవారు మాంసం తినాలి. బుద్ధితో పని చేసేవారు శాఖాహారమే తినాలి. ఆహారాన్ని భగవంతునికి అర్పించి తినుట మంచిది.

డి. నియమిత కాలమున మాత్రమే ఆహారము సేవించాలి: ఇష్టమొచ్చినప్పుడల్లా ఆహారాన్ని సేవించరాదు. ఒకసారి తిన్న ఆహారము జీర్ణము అయిన పిదప మాత్రమే మరలా ఆహారం తినాలి, మానవునికి రెండు పూటలా భోజనం మంచింది. రాత్రి భోజనం, 7,8 గంటల లోపుగా మితముగా తినాలి. ఉదయం బహుకొద్దిగా ఉపాహారం తీసుకోవచ్చు.

ఇ) పళ్ళు: పళ్ళు ఎక్కువగా తీసుకోవాలి.

 

3. వ్యాయామం: బ్రహ్మచర్యం పాటించడానికి శరీరంలో ఎక్కువ అయిన శక్తిని మండించి వెయ్యాలి. శరీరంలో పేరుకు పోయిన శక్తి కామపూరిత ఆలోచనలకు, చెడు కలలకూ కారణమవుతుంది. క్రమం తప్పకుండా మితమైన వ్యాయామం చేయాలి. వ్యాయామం అమితంగా చేసి కండలు పెంచరాదు. దీని వల్ల గుండె మెదడులాంటి Vital Organs దెబ్బతిని రోగాలు వస్తాయి.

 

4. యోగాసనములు: కొన్ని ఆసనములు రోజులో కనీసం అరగంట పాటు చెయ్యడం వల్ల మనస్సు నిశ్చలమయి కామవాంఛ తగ్గుతుంది.

 

5. సద్గ్రంథ పఠనం: మహర్షుల బోధలు చదవాలి. శ్రీ రామకృష్ణ పరమహంస, శ్రీ వివేకానంద, ఏసుక్రీస్తు, బుద్ధభగవానుడు, మహాత్మాగాంధీ మొదలగు వారు. బ్రహ్మచర్యం గురించి చెప్పిన విషయాలు చదివి ఆచరించే ప్రయత్నం చేయాలి. అశ్లీల రచనలు చదవరాదు.

 

6. దైవప్రార్థన: కామమనే శత్రువుతో పోరాడేందుకు మానవ ప్రయత్నానికి తోడు భవగంతుని కృప తోడయిన ఆ పని మరింత సులువవుతుంది. కామశక్తిని జయించడానికి అవసరమైన దివ్యశక్తిని అనుగ్రహించమని సమయం దొరికినప్పుడల్లా మన ఇష్టదైవాన్ని శరణు వెడుతూ ఉండాలి.

 

7. భగవన్నామ జపం: కామాన్ని జయించేందుకు భగవంతుని నామం శక్తివంతమైన ఆయుధంగా పని చేస్తుంది. భగవత్ శక్తితో కూడిన శబ్దతరంగాలు శరీర కణములను, మనస్సును శుద్ధి చేస్తుంది. కామంతో నిండిన ఆలోచనలు మనస్సులో కలుగగానే భగవన్నామమును జపించుట ప్రారంభించాలి. దీని వలన కామపుటాలోచనలు గాలిలో ఆవిరిలా మాయమైపోతాయి.

 

8. ప్రాణాయామము: నాడీ శుద్ధి ప్రాణాయామము (అనులోమ విలోప ప్రాణాయామము)- రోజులో కనీసం 10 సార్లు చేసినచో వీర్యధారణ శక్తి పెరిగి పడిపోక పైకి బ్రహ్మ రంధ్రములోనికి ఆకర్షింపబడి ఓజస్సుగా మారుతుంది.

 

9. ధ్యానం: ధ్యానం ద్వారా మంచి మానసిక శక్తిని పొంది, మనస్సు లోతుల్లోని పొరలలో వేళ్ళు నాటుకొన్న చెడు ముద్రలను చెరిపి వేయవస్తుంది. ధ్యానం చేసే వారు ఉద్రేకమునకు లోనుగారు, శాంతంగా ఉంటారు. లైంగిక వాంఛతో కూడిన ఆలోచనలను తన ఆధీనంలోఉంచుకోనేందుకు మరియు మనస్సు నుండి తొలగించుకునేందుకు ధ్యానం బాగా ఉపయోగడుతుంది.

 

10. కామోద్రేకం కలిగినప్పుడు చల్లటి నీటితో స్నానం చేయాలి. అది కామపు వేడిని చల్లారుస్తుంది.

 

11. ఏకాదశి రోజులలో ఉపవాసం ఉన్నచో యింద్రియాలు అణచివేయబడి శరీరంలో ఎక్కువైన శక్తి అదుపు చేయబడును.

 

12. నిద్రపోయే ముందు దేవుని చిత్రపటాన్ని చూస్తూ దైవమును స్మరిస్తూ పడుకోవాలి. స్వప్నస్థలనమును, చెడు కలలను నివారించడానికి ఇది పనికివస్తుంది.