Previous Page Next Page 
మనసున మనసై పేజి 3


    డ్రాయింగు రూములో కూర్చున్న వాసంతి, దమయంతి, సుమంత్ చిన్నగా మాట్లాడుకుంటున్నారు. సుమంత్ 'చిన్నక్క ఏమిటి ఇలా అందరికీ వంకలు పెడుతుంది తను మహా అందంగా వున్నట్టు' అన్నాడు కాస్త తిరస్కారంగా. అందరిలోకి చిన్నవాడు ఇంజనీరింగు రెండో ఏడు చదువుతున్నాడు. దమయంతి మూడో ఆడపిల్ల బి.ఏ.బి.ఇడి చేసి ఓ ప్రైవేటు జూనియర్ కాలేజీలో కొత్తగా ఉద్యోగంలో చేరింది. ముగ్గురు ఆడపిల్లలు పుట్టడంతో కొడుకుకోసం నాలుగోసారి ప్రయత్నించి నెగ్గారు వెంకటేశ్వరరావుగారు. ఆయనకి పెద్దకూతురు వాసంతితో ఏగొడవా లేకపోయింది. బుద్దిగా డిగ్రీ పూర్తిచేసి తల్లీతండ్రి చూసిన సంబంధం చేసుకొంది. పెళ్ళయ్యాక భర్త ఇష్టంతో ఓ చిన్న కంపెనీలో టైపిస్టుగా ఉద్యోగం చేస్తుంది. నలుగురు పిల్లలతో బ్యాంక్ ఉద్యోగి వెంకటేశ్వరరావు సామాన్య మధ్యతరగతి సంసారి. బ్యాంకులోనుతో ఓ అపార్ట్ మెంట్ కొనుక్కొన్నారు. రిటైరవ్వడానికింకా నాలుగేళ్ళు వుంది. ఈలోగా ముగ్గురు ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయిపోవాలని ఆయన తాపత్రయం. వాసంతి పెళ్ళయి నాలుగేళ్ళయింది. ఆ పెళ్ళి ఖర్చునుంచి ఓ ఏడాది తేరుకున్నాక రెండో కూతురికి సంబంధాల వేట మొదలుపెట్టారు. ఈమూడేళ్ళలొ కనీసం ఓ పదిపన్నెండు సంబంధాలు చూశారు జయంతికి. ప్రతిదానికి ఏదో వంక పెట్టి తిరస్కరించింది. నలుపని, పొట్టని, ఉద్యోగం నచ్చలేదని, ఫ్యామిలీ నచ్చలేదని కొన్ని సంబంధాలు కాస్త బాగున్నవి వాళ్ళే నచ్చలేదని తిరస్కరించారు. వాళ్ళు జయంతికి నచ్చి, వాళ్ళు నచ్చలేదని రాసినపుడు మొహం మాడ్చుకుని "ఏడిశాడు వెధవ" అంటూ ఎగిరేది. ఎన్ని సంబంధాలు తెచ్చినా నచ్చలేదంటూంటే ఓసారి తల్లి గట్టిగా దెబ్బలాడింది. 'అసలు ఏమిటి నీ ఉద్దేశం మీనాన్న అడగమన్నారు. ప్రతివాడికి ఏదో వంకలు పెడ్తున్నావు. మన తాహతు ఎగిరే మాట్లాడుతున్నావా, ఇంత కంటే గొప్ప సంబంధాలు వెతికే శక్తి మాకు లేదు' నిష్కర్షగా అందావిడ.
    'మహా చాలా గొప్ప సంబంధాలు' వెకసక్కంగా అంది జయంతి, 'ఒకటుంటే ఒకటి లేదు చాలా మంచి సంబంధాలుట' వెటకారంగా అంది.
    "అంటే.... తమరికి ఏ సినీ హీరోలాగానీ, నవలా హీరోలా ఆరడుగుల ఆజానుబాహుడు, అందగాడు, లక్షాధికారి, ఐదంకెల జీతగాడు..... కార్లు, మేడలు అవి తేవాలా, అమ్మా తల్లీ కోరికలు అందరికీ వుంటాయి. కావాలనుకునే ముందు మన గురించి మనం ఆలోచించుకోవాలి. లక్షలు, మేడలు, అందం, పెద్ద ఉద్యోగం అన్నీ వున్నవాడు నీలాంటి దాన్నెందుకు చేసుకుంటాడు. అవన్నీ వున్న అందమైన గొప్పింటి దాన్ని చేసుకుంటాడు" పద్మావతి హేళనగా అంది. జయంతి చురచుర తల్లి వంక చూసింది. 'లక్షాధికార్లు, మేడలు కారు కావాలని నీకు చెప్పానా' గయ్ మంది.
    'మరేం కావాలిట నీకు. అదేదో సరిగా చెప్పి ఏడు' విసుగ్గా అంది పద్మావతి.
    'ఉద్యోగం కనీసం ఆఫీసరవాలి, పొడుగ్గా స్మార్ట్ గా రంగుండాలి. సెన్సాఫ్ హ్యూమరుండాలి'    
    "తమరెంత పొడుగున్నారమ్మా, ఐదు రెండు, రంగు ఛామనఛాయ, నీకున్నట్టే ఆ వచ్చినవాడికీ రంగు, పొడుగున్న అమ్మాయి కావాలనుకోడు. సెన్సాఫ్ హ్యూమరా... పెళ్ళిచూపుల్లో తెల్సిపోతాయా, మగాడిలో చూసుకోవాల్సింది చదువు, ఉద్యోగం, కుటుంబంమంచి చెడ్డలు, ఆ తర్వాత నీ అదృష్టం బాగుంటే మంచివాడు, సంస్కారవంతుడు నీవన్న సెన్సాఫ్ హ్యూమర్ వున్నవాడు అవచ్చు. అంతేగాని ముందే గొంతెమ్మ కోరికలు కోరితే ఈ జన్మకి పెళ్ళికాదు....ఆలోచించుకో" చెప్పాల్సింది చెప్పి ఆవిడ లోపలికెళ్ళింది.
    జయంతి ఉక్రోషంగా తను ఏమడిగిందని వీళ్ళు ఇన్ని నీతులు చెప్తారు. కాస్త స్మార్ట్ గా మంచి ఉద్యోగంలొ వుండాలని కోరుకోకూడదా! అనుకుంటూ గింజుకుంది.
    జయంతి ముందునుంచి దేన్లోనూ సర్దుకునే మనస్తత్వం కాదు. తనన్నది కావాలి. దొరకాలి అనే పంతం, అది దొరికే వరకు పట్టుదల. చిన్నప్పుడు వాసంతివి పొట్టయిన బట్టలు తొడిగితే విప్పి పారేసేది. వాసంతి క్లాసు పుస్తకాలు పాతవి వాడమంటే వప్పుకునేది కాదు. తనకి వేరే పక్క కావాలి తప్ప అక్క చెల్లెలు దగ్గిర పడుకునేది కాదు. తన పుస్తకాలు ఎవరన్నా ముట్టుకున్నా, పెన్ను, పెన్సిలు లాంటివి వాడినా తిట్టేది. ఏ మాటయినా అనడానికి వెరుపు లేదు. పెద్దా చిన్నా అన్న తేడా లేకుండా తనకిష్టం లేనిది మొహంమీద ఫెడీమని జవాబిచ్చేయడం, స్కూల్లో కూడా తనకి నచ్చనివారితో మాట్లాడేది కాదు. క్లాసంతటికీ ఎవరో ఒక అమ్మాయితో స్నేహంగా కాస్త స్నేహంగా వుండేది. నోట్సులు ఇచ్చిపుచ్చుకోవడం, ఎవరి మీద ఆధారపడటం ఇష్టం ఉండేది కాదు..... 'అమ్మ, తల్లి రాక్షసి....ఎవడొస్తాడో కానీ దీనితో వేగలేక చస్తాడు' అనేది తల్లి. జయంతి మరీ విసిగించినపుడు తక్కిన వాళ్ళు సర్దుకోవాలి తప్ప తను సర్దుకునే మనస్తత్వం లేని జయంతి ఆ యింట్లో వంటరి! వీలయినంత వరకు వంటరిగా గదిలో చదువప్పుడు చదువు. లేకపోతే ఏ పుస్తకమో చదవడం....తనేదో మిగతా వారి కంటే ప్రత్యేకం అన్నట్లుండేది. పెద్దయ్యాక ఆమెతో పాటు ఆమె అభిప్రాయాలు ఇంకా బలపడ్డాయి. ఉన్న పిల్లల్లో కాస్త బాగుండటం, చదువు బాగా చదవడం పుస్తకాలు చదువుతూ అన్ని విషయాలలో జ్ఞానం అలవరచుకోడంతో తనేదో మిగతా వారికంటే గొప్పది అన్న భావం తనకు తానే ఏర్పరచుకుంది. అమ్మలక్కల కబుర్లన్నా, స్నేహితుల షికార్లు, సినిమాలన్నా కలిసేది కాదు. చిన్నప్పటినుంచి ఊహాలోకంలోనే విహరిస్తూ తన పెద్ద ఉద్యోగం చేస్తూ మంచి ఇల్లు, కార్లు... మొగుడు పెద్ద ఆఫీసరు బంగళా తనని మురిపెంగా చూసుకోడం... ఇంట్లో తన మాటే నెగ్గుతూ భర్త అడుగులకి మడుగులు వత్తుతూ అలరిస్తాడని, ఆమె కలల్లో రాకుమారుడు అందగాడు, సరసుడు అయి కనపడేవాడు. కానీ తీరా పెళ్ళీడుకొచ్చి వాస్తవంలొ తన ఊహలకి ఎక్కడా పొంతన కుదరని పెళ్ళికొడుకులు వచ్చేసరికి నిరాశ, నిస్పృహలు తట్టుకోలేకపోయేది. తనదీ బ్యాంక్ ఉద్యోగం.... కార్లు, బంగళా ఉండే ఉద్యోగం కాదు.... కనీసం మొగుడయినా మంచివాడు దొరక్కపోతే ఎలా అని ఆలోచించేది. తల్లీ తండ్రి ఎన్నివిధాల చెప్పినా సర్దుకునేది కాదు, మొండిగా వాదించేది. అలాంటి వాడు దొరక్కపోతే పెళ్ళేచేసుకోను అనేది- సంబంధాలు చూసి చూసి తల్లి తండ్రి విసిగిపోయారు. తననుకున్నవి జరగనందుకు జయంతిలో అసహనం పెరిగిపోయింది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS