Previous Page Next Page 
హ్యూమరాలజీ-1 పేజి 3


    వాళ్ళంతట వాళ్ళేలేపేవరకూ శాయీరామ్ కి మెలకువ రాలేదు. నలుగురూ నిక్కర్లూ చొక్కాలూ తొడుక్కుని చేతుల్లో మెరిసే కత్తులు పట్టుకుని నిలబడి ఉన్నారు. శాయీ రామ్ కి వణుకూ, దడా వచ్చేసినయ్.
    "దొ... దొ... దొ... దొంగలు" అన్నాడు వణికిపోతూ.
    "ష్! ఏటా ఎదవకూతలు! దొంగలు కాకపోతే దొరలొత్తారా, నీ బోడికొంపకి! నోర్మూసుకుని ఆ ఇనుపబీరువా తాళం చేతులివ్వు!" అన్నాడో లీడర్ దొంగ కత్తి చూపుతూ.
    శాయీరామ్ మాట్లాడుకుంటూ తలగడకిందున్న తాళం చేతులు వాళ్ళకిచ్చాడు.
    అవి తీసుకుని ముగ్గురూ లోపలికెళ్ళారు.
    ఇదే అదననుకొని "దొంగ-దొంగ" అని తీతువుగా అరిచాడు శాయీరామ్.
    మరుక్షణంలో దొంగ అతని నోరుమూసి చేతిమీద ఒక్కపోటు పొడిచాడు కత్తితో!
    "నోర్మూసుకోకపోయావంటే ఛాతీలో గుచ్చుతూ" అన్నాడు కోపంగా.
    దాంతో శాయీరామ్ నోరు మూసేశాడు.
    స్టీలు అల్మారాలోని నగలూ, డబ్బూ, ఇంకా కొన్ని విలువయిన వస్తువులూ అన్నీ చక్కగా ప్యాకింగ్ చేసుకు వెళ్ళిపోయారు వాళ్ళు. శాయీరామ్ భార్య స్వల్పంగా గాయమయిన భర్త చేయిచూసి శోకాలు పెడుతూ పాత చీరచింపుకొచ్చింది.
    అతను అర్జంటుగా చేతికికట్టుకట్టుకుని బయటకు పరుగెత్తి "దొంగ దొంగలు" అంటూ కేకలు వేశాడు.
    నలుగురు సభ్యులున్న వాచ్ మెన్ పార్టీ అతని ఇంటిముందున్న మల్లెపందిరి కింద నుంచి బయటికొచ్చారు ధైర్యంగా.
    "దొంగలు వెళ్లిపోయారా?" అడిగారు వాళ్ళు.
    "ఇప్పుడే - ఇటే వెళ్ళారు."
    "హమ్మయ్య! ఈ ఒక్క ఇంటితో వదుల్తారో వదల్రో అని హడలిచచ్చాం" అన్నాడొకతను.
    "అంటే వాళ్ళు రావడం మీరు చూశారా?" ఆశ్చర్యంగా అడిగాడు శాయీరామ్.
    "చూడకపోవడం ఏమిటి? వాళ్ళే మమ్మల్ని కత్తిచూపి తీసుకొచ్చి ఈ మల్లెపందిరి కింద కూర్చోబెట్టారు."
    "మరి మీరు కత్తులతో ఎదురుతిరగలేదూ?"
    "వాళ్ళు తిరగనిస్తే కదా! మేము నలుగురం ఆ చివరింటివేపు వెళుతోంటే వెనుకనుంచి వచ్చి మెడమీద కత్తిపెట్టారు. 'తిరుగుతే చస్తారు - పదండి" అన్నారు. ఇంకేం చేస్తాం! మల్లెపందిరి కిందికి వెళ్ళాం! అక్కడనుంచీ కదలొద్దన్నారు - వాళ్ళు మర్యాదగా చెప్పాక బావుండదని కదల్లేదు."
    శాయీరామ్ కి వళ్ళు మండిపోయింది.
    అప్పటికే కాలనీవాళ్ళంతా ఒక్కొక్కరే గుమికూడి పోయారక్కడ.
    "నేను చెప్పలేదూ? వాళ్ళు నలుగురున్నా - మనం పదిమందున్నా ఒక్కటే!" అన్నాడు. శంకర్రావు.
    "అవును - మనకేమో పెళ్ళాం బిడ్డలుండిరి. వాడేమో ప్రాణాలకు తెగించినవాడాయె" అన్నాడు వెంకట్రావ్.
    అందరూ శాయీరామ్ పోగొట్టుకున్న ఆస్థిలెక్కలు వేశారు. మొత్తం పదకొండువేల ఆస్థి గోవిందా!
    "పదండి! పోలీసులకు రిపోర్టిద్దాం!" అన్నాడు గోపాలరావు ఆవేశంగా.
    "పోలీస్ స్టేషన్ కి ఎందుకు ముందు పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేయండి" ఎవరో అరిచారు.
    "అవును! ఆ దొంగలు ఎంతో దూరం వెళ్ళివుండరు. ఈ రోడ్డువెంట ఇప్పుడే వెళ్తున్నారని చెప్తే -కంట్రోల్ రూమ్ వాళ్ళు వైర్ లెస్ లో అందరూ మాట్లాడుకుని ఆ దొంగల్ని ఇట్టే పట్టేస్తారు."
    "అయితే పదండి! మార్తాండరావుగారింట్లో ఫోన్ ఉంది."
    అందరూ మార్తాండరావు ఇంటిదగ్గరకెళ్ళారు. "గోపాల్రావ్ ని మాట్లాడమనండి! జర్నలిస్టు అంటే  భయపడతారు పోలీసులు" అన్నారొకరు.
    గోపాల్రావు కంట్రోల్ రూమ్ నెంబర్ డయల్ చేశాడు గర్వంగా.
    'ఎంగేజ్ డ్' అన్నాడు. వెంటనే మరోక్షణం ఆగి మళ్ళీ రింగ్ చేశాడు. మళ్ళీ 'ఎంగేజ్ డ్' అన్నాడు. అక్కడున్న వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగింది.
    "కంట్రోల్ రూమ్ ఫోన్ ఎంగేజ్ ఎలా ఉంటుందయ్యా - అదీ ఇంత రాత్రప్పుడు! ఒకవేళ అది చెడిపోయి అఘోరించిందేమో! లోకల్ అసిస్టెన్స్ కొట్టో రింగ్" సలహా ఇచ్చాడు. రాజేశ్వర్రావు.
    లోకల్ అసిస్టెన్స్ కూడా ఎంగేజే వినిపించింది.
    "భలే తమాషాగా వుందే! అర్దరాత్రి కూడా ఇంత డిమాండ్ ఉంటుందా కంట్రోల్ రూమ్ కీ, లోకల్ అసిస్టెన్స్ కీనూ" ఆశ్చర్యంగా అన్నాడు కుటుంబరావు.
    గోపాలరావు మళ్ళీ కంట్రోల్ రూమ్ కి రింగ్ చేశాడు - ఉహు! ఇంకా ఎంగేజ్ చూపిస్తూనే ఉందది. పావుగంట గడచిపోయింది. అనుకోకుండా లోకల్ అసిస్టెన్స్ నెంబరు రింగయింది.
    "హలో అసిస్టెన్స్" అంది ఆపరేటరు.
    "పోలీసు కంట్రోల్రూమ్ ఎంగేజ్ చూపిస్తోందండి. ఇరవై నిమిషాల నుంచీ! అర్జంటుగా అక్కడికి కనెక్షన్ ఇవ్వండి - దొంగలు పారిపోతున్నారు."
    ఆమె క్షణం తర్వాత మాట్లాడింది.
    "సారీ! ఇటీజ్ ఎంగేజ్ డ్ -"
    "ఎంగేజ్ డా! ?"
    "అవును"
    "ఇందాకట్నుంచీ ఎంగేజ్ డేనా?"
    "అవునండి!"
    "ఇంత రాత్రప్పుడు ఎంగేజ్ ఏమిటండీ నా మొఖం! "స్టయిల్ గా అన్నాడు గోపాలరావు.
    "మీ మొఖం సంగతి నాకు తెలీదుగానండి! ఆ ఫోన్ మాత్రం ఎంగేజ్ ఉంది!"
    గోపాలరావు కంగారుగా చుట్టూ చూశాడు. పొరపాటున ఆ మాట ఎవరయినా విన్నారేమోనని.
    "ఇదిగో చూడండి! నేను న్యూస్ పేపర్ జర్నలిస్టుని. ఈ టైమ్ లో కంట్రోల్ రూమ్ ఎంగేజ్ యెలా వుంటుంది? మరోసారి ట్రై చేయండి."
    "కంట్రోల్ రూమ్ ఎప్పుడు బిజీగా ఉండేదీ తెలీని జర్నలిస్టులు కూడా ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంది" అందామె.
    "అంటే రాత్రి రెండు గంటల సమయంలో అదెప్పుడూ ఎంగేజ్ ఉంటుందన్నమాట!"
    "అవును స్వామీ అవును!" అనేసి ఫోన్ పెట్టేసిందామె.
    "రాత్రంతా ఆ ఫోన్ అలా ఎంగేజ్ ఉండటమేమిటి?" ఆశ్చర్యంగా కుటుంబరావు నడిగాడు గోపాల్రావు.
    "అవునయ్యా! ఎడతెరపి లేకుండా దొంగతనాలు జరగబట్టే - ఇలా ఫోన్ ల కెగబడుతున్నారు జనం" ఎవరో అన్నాడు.
    "ఒక్క దొంగతనాలేమిటి! మనం ఉన్నది ఆంద్రప్రదేశ్ రాజధానిలో కదా! దోపిడీలు, మర్డర్ లు, కార్లలో తిరిగి ఒంటరిగా కనిపించిన ఆడవారిని ఎత్తుకుపోయి మానభంగాలు చేయడం, రౌడీలు వీరవిహారాలు చేయడం - ఇవన్నీ రాత్రుళ్ళే ఎక్కువగా జరుగుతాయి కదా! అందుకే కంట్రోల్ రూమ్ తెగ బిజీగా ఉంటుంది."
    మరోసారి కంట్రోల్ రూమ్ కి రింగ్ చేశాడు గోపాల్రావ్. అతని మొఖం వెలిగిపోయింది. హఠాత్తుగా చెయ్యి పైకెత్తి "సైలెన్స్! నిశ్శబ్దంగా ఉండండి! దొరికింది" అంటూ వెర్రికేక వేశాడు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS