Previous Page Next Page 
అర్ధచంద్ర పేజి 3


    
    ఆట మళ్ళీ కొనసాగుతోంది.
    
    అజహరుద్దీన్, రవిశాస్త్రి, అశోక్ మల్ హోత్రా, కపిల్ దేవ్ ఎవరూ చెప్పుకో దగ్గట్టుగా బ్యాటింగ్ చెయ్యలేకపోయారు. గవాస్కర్ సిక్స్ డౌన్ బ్యాట్స్ మేన్ గా వచ్చాడు, చేతికి దెబ్బ తగిలినందువల్ల కొంతవరకూ నిలకడగా ఆడి, తరువాత సహనం కోల్పోయి, ఒక అవుత గోయింగ్ బాల్ ఛేజ్ చేసి క్యాచ్ ఇచ్చాడు.
    
    తరువాత ఇండియా టార్గెట్ కి చేరుకోలేకపోయింది. ఇరవై పరుగులు ఇంకా కొట్టవలసి ఉండగా ఆలౌట్ అయిపోయారు.
    
    ఇండియా ఓడిపోయింది.
    
                                           * * *
    
    రాజాచంద్ర నీరసంగా వెళ్ళి మంచంమీద పడుకున్నాడు. విశారద వెళ్ళి "భోజనానికి రండి అని పిలిచింది."
    
    "నేను రాను."
    
    "అదేమిటి?"
    
    "నాకు మనసేం బాగాలేదు."
    
    విశారద అతని దగ్గరకెళ్ళి భుజంమీద చెయ్యివేసి "వాళ్ళు అసమర్ధుల్లా ఆడి ఓడిపోతే మీరు మనసు పాడుచేసుకోవటమేమిటండీ? ప్లీజ్ రండి" అన్నది మృదువుగా.
    
    "వీళ్ళంత చవటల్లా ఎందుకాడాలి?"
    
    "అంతకంటే శక్తిలేదు. ఓ విషయం చెప్పనా? ఎప్పుడో గెలిచారు కదా అని వాళ్ళ సమర్ధతమీద మీరనవసరంగా ఆశలు పెంచుకుంటున్నారు మన వాళ్లకి టీమ్ స్పిరిట్ లేదు. విజ్రుంభణ లేదు మంచి ఫాస్ట్ బౌలింగ్ లేదు. స్పిన్ కొంచెమో గొప్పో ఉన్నా ప్రసన్న, చంద్రశేఖర్, బేడీలకున్నటువంటి కేలిబర్ లేదు. అందుకని పరాజయాలే ఎక్కువగా చవిచూస్తూ ఉంటాం. దానికి అలవాటు పడిపోవాలి కాని దిగులు దేనికి?"
    
    "కొన్ని లక్షలమంది టీవీ చూస్తూ వాళ్ళమీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారన్న బుద్దేమయినా ఉందా?"
    
    "లేదు మరి ఏం చేస్తాం? రండి" అని అతని చెయ్యి పట్టుకుని లేవదీసింది.
    
    "నిజంగా నా కాకలిలేదు విశారదా! నేను తినలేను."
    
    "నేను పక్కన కూర్చుని గోరుముద్దలు చేసి తినిపిస్తాను రండి."
    
    అతనామె ముఖంలోకి చూశాడు. ఎంత ఆర్ద్రత, ప్రేమ... ఆ కళ్ళనిండా ఎంత వెలుగు!"
    
    "ఏమిటలా చూస్తున్నారు?"
    
    "ఊ"
    
    "అలా..."
    
    ఆమెను ఎంత కష్టపడి పొందగలిగాడు! ఆమెను ప్రేమించి ఆ ప్రేమ సాఫల్యం కోసం ఎన్ని ప్రయాసలు  పడ్డాడు!
    
    "ఊఁ!" అంది ఈసారి ఆమె.
    
    "ఏమీలేదు" అంటూ ఆమె వెంట డైనింగ్ రూమ్ లోకి నడిచాడు.
    
                                               2
    
    రాత్రి పది దాటింది. ఇంట్లో ఎవరూ లేరు. విశారద ఒక్కతే డ్రాయింగ్ రూమ్ లో సోఫాలో చేతిలో ఉన్న నవల యాంత్రికంగా తిరగేస్తూ కూచుని ఉంది.
    
    ఒక్కొక్క నిమిషమూ గడుస్తోంది.
    
    రాజాచంద్ర ఇంటికి ఆలస్యంగా వస్తానని చెప్పాడు. ఓ స్నేహితుడింట్లో ఫంక్షనుంది, దాదాపు పదకొండవుతుందని చెప్పాడు.
    
    అతనిది చాలా సున్నితమైన మనసు కఠినంగా ఉండాలని చాలాసార్లు ప్రయ్తఃనిమ్చి విఫలుడయ్యాడు. అతనికి భార్యమీద కోపమొచ్చినప్పుడూ, తాను చెప్పినమాట సరిగ్గా వినలేదని తోచినప్పుడూ ఉన్నట్టుండి గట్టిగా కేకలేసేవాడు. అతన్ని అరిచినంతసేపు అరవనిచ్చి విశారద తేలిగ్గా నవ్వేసేది.
    
    "ఊరుకోండి మీకు కోపగించటం కూడా చేతకాదు. మీరంత గట్టిగా కేకలేస్తోన్నా మీ మొహంలో కోపం కనబడ్డంలేదు."
    
    "నువ్వు నన్ను ఇన్ సల్ట్ చేస్తున్నావు."
    
    "ఇందులో ఇన్ సల్టే ముందండీ?" ఉన్న విషయం చెబుతున్నాను.
    
    "నాకు కోపం తెచ్చుకోవటం రాదనటం ఇన్ సల్ట్ కాదా? మా ఆఫీసులో నాకు కోపమొస్తే గడగడలాడిపోతారు తెలుసా?"
    
    "కొయ్ కొయ్."
    
    "అంటే నామాట నమ్మటం లేదన్నమాట."
    
    "కాదండీ మీరలా ఉంటేనే నాకిష్టం."
    
    "ఎలా?"
    
    "పసిపిల్లాడిలా."
    
    నిజంగా అతనిది పసిపిల్లాడి మనస్తత్వం చిన్న చిన్న వాటికి అలగటం, బ్రతిమిలాడించుకోవటం, చాలా చిన్న చిన్న కోరికలు...
    
    ఇద్దరి మధ్యా కోపమొచ్చినా కొన్ని గంటలకన్నా ఎక్కువసేపు ఉండేది కాదు. ఆమె వచ్చి పలకరించకపోతే అతను విలవిల్లాడిపోయేవాడు. ఆమె తిరిగి ఎప్పుడన్నా ముభావంగా ఉంటే తిరిగి మామూలు మనిషయేదాకా ఊరుకునేవాడు కాదు.
    
    పైగా అతను చాలా సెన్సిటివ్. చాలా  చిన్న సంఘటనకు కూడా అలజడితో అల్లాడిపోయేవాడు. ఇతరులు చేసిన తప్పులకి కూడా, అందులో తన పొరపాటు కూడా ఏమయినా ఉందేమోనని నలిగిపోతూ ఉండేవాడు.
    
    "మీరంత సెన్సిటివ్ గా ఉండకూడదండీ ప్రస్తుతం ప్రపంచం నడుస్తోన్న తీరుకది సరిపడదు" అనేది విశారద.
    
    అతనమాయకంగా నవ్వేసి ఊరుకునేవాడు.
    
    అదిగో, ఆ నవ్వే... ఆమె గుండెను దూసుకుపోతూ ఉండేది.
    
                                           * * *
    
    మరో అరగంట గడిచింది. విశారదలో టెన్షన్ క్షణక్షణానికీ పెరిగిపోతోంది. సాయంత్రం అయిదు గంటలకల్లా ముగ్గురూ బయటికెళ్ళారు. కలిసి వెళ్ళలేదు. కలిసివెళ్ళటం వాళ్ళకెప్పుడూ అలవాటు లేదు, ఎవరిదారిన వాళ్ళు వెళ్ళారు.
    
    మొదట్నుంచీ పిల్లల్ని చాలా భయభక్తులతో క్రమశిక్షణతో పెంచుదామనుకుంది. ఈ లోపమెక్కడుందో తెలీదు. పద్నాలుగు, పదిహేనేళ్ళ వయసొచ్చినప్పట్నుంచీ తమకు తెలీకుండానే చెయ్యిదాటిపోతూ వచ్చారు. ఎంత కంట్రోల్ లో పెడదామనుకున్నా సాధ్యమయ్యేది కాదు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS