Previous Page Next Page 
భార్యా గుణవతి శత్రు పేజి 3

   

      మాటకి మాటకి సంబంధం లేకుండా అకస్మాత్తుగా వచ్చిన ఈ ప్రశ్నకి ఆ కుర్రవాడు మాట్లాడలేదు. బ్రహ్మానంద స్నేహపురస్సరంగా నవ్వి "మొహమాటానికయినా ఒప్పుకోవోయ్" అన్నాడు.  
    కుర్రాడు కూడా జంకు తగ్గి నవ్వాడు.    
    "అయినా నా ప్రతిభని గుర్తించి ఎవ్వరూ అంచెలంచెలుగా నా జీతం పెంచుకుంటూ పోలేదు. దీన్నిబట్టి తేలిందేమిటంటే రాంప్రసాద్! తెలివి తేటలు వుండటం కాదు ముఖ్యం. వాటిని గుర్తించే వాళ్ళుండాలి. అవును సార్ అనూ."        
    "అవును సార్"    
    "తెలివితేటలు ఏ మాత్రం వున్నా ముందుకు దూసుకుపోయేలా చేస్తుంది. కొరియన్ చక్కర్. చేస్తుంది కదూ? చేస్తుంది సార్ అనూ!"    
    "చేస్తుంది సార్"    
    "కానీ ఒక్క తప్పుచేస్తే మన కింగ్ పిన్ అవతలి శత్రువుల మధ్యకి ఎంత వేగంగా వెళ్ళిందో అంత బలంగా చిక్కుబడిపోతుంది. కొలాప్స్... టోటల్ కొలాప్స్ ... ఏమిటీ?"    
    "కొలాప్స్".    
    "గుడ్ ... వచ్చినవాడు మనకి గ్రాంటులు ఇవ్వటానికి వచ్చినవాడు కాదని నేను వూహించగానే నీకేం చెప్పాను రాంప్రసాద్?"    
    "మీరు చెప్పినవన్నీ చేశాను సార్!"    
    "చేశావోయ్! నువ్వేకాదు. మనవాళ్ళు అందరూ చేశారు. అత్యంత శ్రద్ధతో ఇటుక వరసలు పేర్చారు. జాగ్రత్తగా రాట్నం నుంచి దారం వడికారు....అన్నిటికన్నా నాకు నచ్చిన విషయం ఏమిటంటే, నేను ఆహ్వానిస్తానని తెలిసి నువ్వు కొరియన్ చక్కర్ టేబిల్ అమర్చి వుంచటం నీ ముందు చూపుకి నా అభినందనలు. థాంక్స్ సార్ అనూ".    
    "థాంక్స్ సార్!"    
    "అంత జాగ్రత్తగా మన కోటలో అన్నీ చూపించినవాన్ని చివరలో ఎందుకు చంపుతాననుకున్నావ్ రాంప్రసాద్?"    
    అతను మాట్లాడలేదు.    
    "అంటే మధ్యలో ఏదో పొరపాటు జరిగిందన్నమాట- అవునా? అవుననకు, అది నీకూ నాకూ తెలుసు. లేడి.....ఒక చిన్నలేడి... మన రహస్యాన్ని బయటపెట్టింది. లేడి కాలుకు కట్టిన కట్టు కృత్రిమమైందని, దాని ద్వారా మనమేదో దొంగ రవాణా చేస్తున్నామని, అతనికి అనుమానం కలిగేలా నువ్వు ప్రవర్తించావు. ఆ లేడికి కాలులేదనీ, అది కృత్రిమమైన డొల్ల అనీ అతనికి తెలియడానికి కారణం - దాన్ని స్వేచ్చగా నువ్వు వదిలిపెట్టడం. దీనికి సంజాయిషీ ఏమిటి?" అతడు జవాబు చెప్పలేకపోయాడు.    
    "అదేమిటి రాంప్రసాద్! ఏదో తప్పుచేసిన వాడిలా అలా మౌనంగా వుండిపోతావ్! మన తప్పులేనప్పుడు ధీమాగా జవాబు చెప్పాలి. నేనే నీ స్థానంలో వుంటే ఏమంటానో తెలుసా? 'అదేమిటి సార్! మీరు చెప్పగానే చకచకా అంతా మార్చేశాను. కొద్ది నిముషాల్లో మొత్తం రంగస్థలం మార్చేయవలసి రావడంతో ఆ హడావిడిలో చిన్న లేడి విషయం మర్చిపోయాను' అంటాను. అంటానా లేదా?" "అవును సార్!" అంటారు.    
    "హ్హ...హ్హ....! గుడ్!.... వెరీగుడ్!! అంత హడావిడిలో ఈ చిన్న లేడిపిల్ల సంగతి గుర్తుకు రాకపోవటం సహజమే. ఆ కుంటికాలేసుకుని అది చెంగు చెంగున దూకుతూ వస్తుందని నువ్వు మాత్రం కలగన్నావా? కానీ ముందు ముందు ఇలాంటివి జరగకూడదు రాంప్రసాద్! మనని చూడటానికి వచ్చిన ప్రతీవాన్ని చంపి బైటపడేయలేం కదా! పోలీసులకి మరింత అనుమానం వస్తుంది. తప్పు చేయటం మానవ సహజం. కాని తప్పుచేశాక దాన్ని వెంటనే సరిదిద్దుకోవటం తెలివైన వాడికే సాధ్యం. ఈ ఆశ్రమంలో తెలివైన వాళ్ళకే చోటుంది. మరి నువ్వేం చేశావు రాంప్రసాద్?"    
    'అతడు చచ్చిపోగానే జేబులు వెతికాను సార్! ఐడెంటిఫికేషన్ కార్డూ, సిగరెట్ లైటరూ దొరికాయి. మీరనుకున్నట్టు సిగరెట్ లైటర్ మాటి మాటికీ వెలిగించినప్పుడు అతడు తీసింది ఫోటోలే. ఆ రీలు తీసి ఆంజనేయులు గారికి అందించాను. కార్డూ, లైటరూ అతడి జేబులో పడేశాను."    
    "కార్డూ, లైటరూ మళ్ళీ జేబులో ఎందుకు పెట్టేశావు?"    
    "అదేమిటి సార్! వాళ్ళ డిపార్టుమెంటు వాళ్ళకి మనం అతడి జేబులు వెతికిన అనుమానం రాకూడదుగా?"    
    "గుడ్! శహభాష్.... చేసిన తప్పుని క్షణాలమీద సరిదిద్దుకునేవాడే తెలివైనవాడు! కోటలో తెలివైన వాళ్ళకే చోటుంది. కొరియన్ చక్కర్ లో కింగ్ పిన్ లా దూసుకుపోయే నేర్పు వుంది నీకు. కానీ నాకొక్కటే అనుమానం రాంప్రసాద్! సిగరెట్ లైటరూ, కార్డూ వుందా లేదా అని వెతికిన డిపార్ట్ మెంట్ వాళ్ళు లైటర్ లో ఫిల్ము వుందా, లేదా అని వెతకరా? వాడిన ఫిల్ము తీసిన వాడివి మరో కొత్త ఫిల్ము పెట్టద్దా? అవును సార్ అను .... నేనే నీ స్థానంలో వుంటే 'తప్పయిపోయింది సార్! క్షమించండి' అనను .... 'మీరే శిక్ష వేసినా పడతాను సార్' అంటాను".    
    కుర్రాడి గొంతు తడారిపోయింది. "తప్పయిపోయింది సార్ మీరే శిక్ష వేసినా పడతాను" అన్నాడు.    
    అప్పుడు వినిపించింది చిన్న చప్పుడు. ఏం జరిగిందో అతడు గ్రహించే లోపులోనే మండుతూవున్నా ఇనుపవూచ గుండె లోతులో పెట్టి తిప్పినట్లయ్యింది ఛాతీని అదుముకున్న చేతికి చిక్కటి రక్తం అంటింది. సైలెన్సర్ అమర్చిన రివాల్వర్ నుంచి పైకి వస్తున్న సన్నటి పొగను చూస్తూ అతడు కిందకి జారిపోయాడు. బ్రహ్మానంద అక్కడి నుండి తాపీగా వెళ్ళిపోయాడు పిస్టల్ తుడుచుకుంటూ.    
    రెండు నిముషాలు గడిచాక నలుగురు వృద్దులు అక్కడికి వచ్చారు. బాగా వయసు పండినవాళ్ళు.    
    రాట్నం వడుకుతున్నప్పుడు ఎంత క్రమశిక్షణతో ఒకే భంగిమతో పనిచేశారో అదే విధంగా నిశ్శబ్దంగా అతడి శవాన్ని తమతో తెచ్చిన పాడెమీదకు ఎక్కించుకుని బైటకు నడిచారు.    
    కానీ వాళ్ళు శ్మశానం వైపుకి వెళ్ళలేదు. కోటలోనే వున్న ఇటుకలబట్టీ వైపు వెళ్ళారు. అతడి శరీరం ఇటుకల్ని కాల్చే కిల్న్ లోకి జారవిడువబడింది. శరీరంకాలిన వాసన అయిదు నిముషాల తర్వాత అదే బెల్టు ద్వారా అస్థిపంజరం బైటికి వచ్చింది. మరో మూడు నిముషాలకి ఒక పెద్ద ఇనుప చక్రం ఆ అస్థిపంజరాన్ని చిన్న చిన్న ముక్కలు చేసింది. చక్రం తిరుగుతూనే వుంది. పెద్ద పెద్ద ఎముకలు, కొమ్మలు పట పటా శబ్దం చేస్తూ దాని పళ్ళకింద విరిగి ముక్కలు అవుతున్నాయి. అవి మరింత చిన్నవై పెద్ద పెద్ద జల్లెళ్ళలో పొడిగా జల్లించబడుతున్నాయి. ఆ పొడి పశువులకీ, కోళ్ళకీ గ్రాసంగా బస్తాల్లోకి ఎక్కించబడుతుంది.    
    అటెండెన్సు రిజిస్టరులో ఒక పేరు తగ్గింది. అది సర్వ సామాన్య విషయంగా దాన్నెవరూ అంతగా పట్టించుకోలేదు - ఆ కోటలో.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS