Previous Page Next Page 
చిల్లర దేవుళ్ళు పేజి 2

    "సారంగపాణి. యాన్నో ఇన్ననేపేరు...."
    "సంగీతం -"
    "వెంకటేశ్వర్ల జాతర్లో పాటకచేరి చేసినవులే"
    "చిత్తం."
    "బాగానే పాడినవు."
    "నే" అనేది విని పాణి మనసు చివుక్కుమంది. కానీ, ఆ భావం ముఖంలో వ్యక్తం కానివ్వకుండా "ఏదో మీ దయ" అన్నాడు.
    "ఏమేమి వాయిస్తవు?"
    "వీణ, మృదంగం, డోలు, ఫిడేలు."
    "నీ తాన (నీ వద్ద) ఏమున్నదిప్పుడు?"
    "ఫిడేలుందండీ."
    "ఒక్కపాట పాడు" పరీక్షించడానికా అన్నట్లు అడిగారు.
    పాణి గుండెలో రాయి పడింది. ఎంత దూరం నుంచి వస్తున్నావు? అలసి ఉన్నావా? తిండి ఉందా? లేదా? అని అడక్క అమాంతంగా పాట పాడమంటున్నాడు అనుకున్నాడు. కాని ఏం చేస్తాడు? వచ్చింది ఆశ్రయించడానికి. వయొలిన్ పెట్టె తీసుకొని ఎదురుగా ఉన్న బల్లమీద కూర్చున్నాడు. పెట్టె విప్పి ఫిడేలు తీశాడు. ఈలోగా లోపల్నుంచి ఒక దాసీది గుండిచెంబుతో నీళ్ళూ సబ్బూ తువ్వాలూ తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోయింది.
    రెప్ప వేయకుండా చూశాడు దాసీదాన్ని.
    "మొఖం కడుక్కో పంతులూ!" రెడ్డిగారి మాట విని భూలోకంలో పడ్డాడు పాణి. కండువా తీసి బల్లమీద పెట్టి, లాల్చీ మోచేతులవరకు జరిపి అరుగు చివర్న కూర్చొని ముఖం కడుక్కొని చూస్తే ఆశాలత నిరాశా తాపానికి వాడిపోయింది. పాత పాడమని మళ్ళీ లోపలికి వెళ్ళాడు ముసలాడు అని విసుక్కున్నాడు. కాళ్ళు తుడుచుకొని బల్లమీద కూర్చునేవరకు వెండి పళ్ళెంలో ఫలహారం తెచ్చి బల్లమీద పెట్టి, దాని పక్కనే మంచినీళ్ళ వెండి గ్లాసుంచి మెరుపులా మాయమైంది దాసి.
    ఫలహారం ముగించి నీళ్ళు తాగడం కాగానే పాలగ్లాసు బల్లమీద పెట్టి ఖాళీ పళ్ళేమూ, గ్లాసూ తీసుకొని వెళ్ళిపోయింది. పాల గ్లాసు కూడా తీసికెళ్ళదానికి వస్తుందని నిరీక్షిస్తూ కూర్చున్నాడు పాణి.
    తువ్వాలుతో మూతి తుడుచుకుంటూ రెడ్డిగారు ప్రవేశించి "పాట శురుచేయి" అని ఆదేశించారు. అక్కడే ఉన్న పాలగ్లాసు చూచి "అరె ఎంకటిగా, ఎంగిలిగ్లాసు తీస్కపో" అని అరిచారు.
    సారంగపాణి గాలిమేడ కూలిపోయింది. ఫిడేలు తీసి శ్రుతి పెట్టసాగాడు. తాంబూలపు తప్తరీ" తెచ్చి ముందుంచి మాయమైంది దాసీది.
    పాట ప్రారంభించాడు పాణి-
    బాల! కనకమయచేల! సుజన పరిపాల!
    శ్రీరమాలోల! విధృత శరజాల!
    శుభద! కరుణాలవాల! ఘనలీల!
    నవ్యవనమాలికా భరణ!
    ఏలా నీ దయ రాదురా!
    పరాకు చేసేవేల! సమయముకాదురా!
    రారా దేవాది దేవ! రారా మహానుభావ!
    రారా రాజీవ నేత్ర! రఘువరపుత్రా!
    సారతర సుధాపూర! దనుజసంహార దశరథ కుమార!
    బుధజన విహార సకల శ్రుతి సార!
    ఏలా నాపై దయరాదురా||
    చేతులు వెనక్కు బల్లపై ఉంచి, తల పైకెత్తి, తన్మయుడై విన్నాడు రెడ్డిగారు. కోకిల పాడుతుందా? గండు తుమ్మెదలు గానం చేస్తున్నాయా? అన్నట్లుగా పాడాడు పాణి. గాయకునికి అంత దగ్గరగా ఉండి గానం విన్నది అదే మొదటిసారి రెడ్డిగారి జీవితంలో. హృదయాన్ని సంగీతం ఎలా కరిగించి ప్రవహింప చేస్తుందో తెలుసుకున్నదీ ఆనాడే రెడ్డిగారు. పాత నిలిచిపోతే అమాంతంగా గంధర్వలోకం నుంచి పడిపోయినట్లయింది రెడ్డిగారికి.
    "బాగా పాడినవు పంతులూ" అన్నాడు బల్లకానించి వుంచిన చేతులు తీసి దులుపుకుంటూ రెడ్డిగారు, "ఎంకా!" అని పిలిచారు. ఎంకడు రాగా" పంతుల్ను బండ్లమీద ముందరి అర్రల" దించు. భోజనం గిట్ట అడనే ఇంతజామ్ చెయ్యి" అని పురమాయించి పాణివైపు తిరిగి "పంతులూ జర పొలంకాడికి పొయ్యొస్త" అని జవాబుకై నిరీక్షించకుండానే లేచి నుంచున్నారు రెడ్డిగారు. పాణి ఫిడేలు బల్లమీద పెట్టి లేచి నుంచొని "చిత్తం" అన్నాడు. మెట్లు దిగి వెళ్ళిపోయారు రెడ్డిగారు. 
    "పదుండ్రి అర్రలకి" అని ఫిడేలు పెట్టె పట్టుకొని ముందుకు నడిచాడు ఎంకటి. బైటినుండి ఉన్న మెట్లెక్కి గదిలో ప్రవేశించారు పాణి. అది పెద్ద గది. రెండు పెద్ద పెద్ద కిటికీలున్నాయి. బజారు వైపు కిటికీలోంచి చూస్తే ఊరంతా స్పష్టంగా కనిపిస్తుంది. గదిలో ఒక పెద్ద మంచం, కావిడి పెట్టె, రెండు కుర్చీలూ ఉన్నాయి.
    ఎంకటి వయొలిన్ కేసు పెట్టెమీద పెట్టి, "ఎంత మంచిగ పాడిన వుండి, దొరసాన్లు గూడ మెచ్చుకున్నరు" అన్నాడు.
    "ఏ దొరసాన్లు?"
    "ఏ దొరసాన్లేదుండి? ఇద్దరట్లనే మెచ్చుకున్నరు" అని కాస్త ధ్వనితగ్గించి" చిందొరసాని కరిగిపోయిందనుకోరి" అన్నాడు.
    "చిన్నదొరసాని అంటే!"
    "ఆమెనుండి, దొరోరి బిడ్డ, మల్ల పాడ్తావున్రి" అడిగాడు ఔత్సుక్యంతో.
    "ఎందుకు పాడనూ?"
    "నువ్వు ఈడనే వుండి పోండ్రి, పాడుకుంట-"
    "సరేలే" అని చొక్కా విప్పి చిలక్కొయ్యకు తగిలించాడు. పాణి.
    "ఏదన్న కావలిస్తే పిలువున్రి, నీ బాంచను" అని వెళ్ళిపోయాడు ఎంకటి.
                                                               x        x       x
    కళ్ళుమూసుకొని ఏదో ఆలోచిస్తూ మంచం మీద పడుకొని ఉన్న పాణి కావిడి పెట్టె మీద పళ్ళెం చప్పుడు విని కళ్ళు తెరిచి చూచాడు. దాసీది భోజనపు పళ్ళెం కావిడి పెట్టెమీద పెట్టి వెళ్ళిపోతూంది. దిగ్గున లేచి కూర్చొని 'ఇదిగో' అని పిలిచాడు.
    గడప కవతల పడిన అడుగు వెనక్కి వేసి ముఖం తిప్పి, "ఏమిటి"? అన్నట్లు చూసింది దాసీది.
    'నీ పేరు?'
    'వనజ'
    'వనజ ....' చక్కని పేరన్నట్లు ఉచ్చరించాడు పాణి.
    వనజ వెళ్ళిపోయింది. ఆమె కానాడు ఏదో నూత్నానుభూతి కలిగింది. దాన్ని ఆనందం అనలేం గాని అల్లాంటిదే ఏదో అనుభవించిందామె.
    "వనజ" తన పేరు బావుందా? చక్కగా ఉందా? నిజంగానా? "వనజ" పలికి చూచుకుంది. మూడక్షరాలు. వాస్తవంగానే తన పేరు బావుంది. ఇంతవరకెవరూ అనలేదు, తనపేరు బావుందని, తన పేరులోని రమ్యతను తల్చుకొని తానే మురిసిపోయింది.
    తాను పుట్టిందీ, పెరిగిందీ ఈ (దొరలుండే మేడ) లోనే. ఇక్కడే చాకిరీ చేస్తూందీ పశువులా. తిండి పెడ్తాడు దొర. తిండి పెట్టి పశువులా చాకిరీ చేయించుకున్నా బాగుండేది. తాను వారికి విలాస వస్తువు, దొరలెవరైనా గడీకి వస్తే వారి గదుల్లోకి భోజనాలూ, ఫలహారాలూ, మోసుకెళ్ళాలి. అవి అక్కడ పెట్టి వస్తే సరిపోతుందా? వారి కోర్కెలకు తాను లొంగిపోవాలి. వారు పశువుల్లా ప్రవర్తిస్తూంటే తాను బొమ్మలా వుండాల్సిందే కాని కిమ్మనడానికి వీల్లేదు. ఇదీ తన బ్రతుకు. ఈ కుళ్ళు నుంచి దూరం కావడానికి గడీ వదిలి పారిపోదామనుకుంది చాలాసార్లు. కానీ, తాను ఆడబాప తెలంగాణలో దొరల ఇండ్లలో వుండే సేవికలు ఎక్కడున్నా పట్టితెప్పిస్తాడు దొర. కాకున్నా ఎక్కడికి పారిపోతుంది? ఏం చేస్తుంది? ఆడబాపగా బ్రతికిందాని కెవ్వడైనా అండ చూపుతాడా? వేశ్యగా జీవించాలి.
    ఆవిడకు మొదటి రాత్రి గుర్తుకు వచ్చింది.
    ఆరోజు ఇంద్రారెడ్డి వచ్చారు-ఇందిరమ్మ దొరసానికి తమ్ముడు. అడవికి వేటకు వెళ్ళి మనుబోతును కొట్టి తెచ్చాడు. గుర్రంలా ఉందది. జీతగాండ్లు దాన్ని కోసి కుప్పలేశారు. ఊళ్ళో పెద్ద మనుషులందరికీ గడీ నుంచి మాంసం పోయింది. గడీలో గుమ్మని వాసనకొట్టే మసాలాలతో రకరకాల కూరలు వండారు. తలంటిపోసింది తల్లి తనకు. పాలపిట్ట చీర కట్టించింది దొరసాని. కడుపునిండా తిండి పెట్టింది దొరసాని. తనదగ్గరకూర్చొని, ఆ రాత్రి ఎంత తాగారని దొరలు! ఒకళ్ళమీద ఒకళ్ళు పడ్డారు. తనకు ఫలహారాల పళ్ళెం యిచ్చి పంపింది దొరసాని. తనకళ్ళు చెమ్మగిల్లడం గమనించింది తాను. గుండెలో గుబులు నిండింది. అడుగు ముందుకు పడలేదు. దొరసాని గద్దించింది. తనకు కన్నీళ్ళు దుమికాయి. అడుగు ముందుకు పడింది. ఇప్పుడు పాణి ఉన్న గదిలోనే ఇంద్రారెడ్డి దిగింది. పలహారాల పళ్ళెంతో గదిలో ప్రవేశించింది తాను. ఎందుకో గుండె వేగంగా కొట్టుకొంది. తనను చూడగానే లేచి" రావే వయ్యారి" అని చేయిపట్టి లాగాడు. పళ్ళెం జారవిడిచి, కేకవేసి పరుగెత్తింది తాను. తల్లిమీదపడి పెద్దగా ఏడ్చింది. తల్లికూడ కన్నీరు రాల్చింది. ఆమె మాత్రం ఏం చేస్తుంది? దొరసాని గద్దించింది.
    మరొక దాసి తనను పట్టుకొనిపోయి గదిలోవేసి తలుపేసింది.
    ఆ దృశ్యం తల్చుకుంటే, ఆమె కళ్ళు జల్లుమంది. నాటినుంచి గడీకి వచ్చిన దొరల్లో చాలామంది తనను కోరుకున్నారు. వచ్చిన ప్రతివాడూ తననే చూసేవాడు: కళ్ళు చీల్చుకొని అలా చూచినప్పుడల్లా పిడుగు పడేది తనమీద. అయినా, యంత్రవతుగా వ్యవహరించాలి తాను. ఇందరూ తనను అత్తరులా, పన్నీరులా, సారాయిలా వాడుకున్నారే కాని, ఒక్కరైనా మనసుకు యింత హాయినిచ్చే మాట అన్నారా? "వనజ..." ఆ మాటలు తల్చుకుంటే ఆవిడ వళ్ళు పులకరించింది. మాటలు మనసుకు హాయినిస్తాయి! 'ఎంత మంచివాడు!' అనుకుంది. గడీలో యంత్రంలా, పశువులా, ఆటబొమ్మలా జీవిస్తున్న ఆమెకు సారంగపాణి పలుకులు ఎంతో ఆప్యాయత నిచ్చాయి. ఏదో తెలియని ఆనందం మైకంలా కమ్మింది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS