Previous Page Next Page 
రెండోమనసు పేజి 2


    "అలాగే!"
    చుట్ట నోట్లో పెట్టుకొని వెళ్ళిపోయాడాయన.
    చలపతి గోడ గడియారం వైపు చూశాడు. ఎనిమిదవుతోంది టైం. రెండు గంటల్లో తను స్టేషన్ బయల్దేరాలి. తన భవిష్యత్తుతో మాట్లాడటానికి రెండు గంటల టైముంది.
    అంతే, కానీ మరి ఇంతవరకూ సావిత్రి కదలేదెం? ప్రతిరోజూ ఈపాటికి లాంతరు పట్టుకొని పశువుల కొట్టాం దగ్గర చాకిరీ చేయడానికి కొచ్చేది, ఇవాలెందుకు రాలేదింకా?
    దూరంగా గడ్డివామి దగ్గర లాంతరు కనిపించింది చలపతికి. ఒక్క ఉదుటున లేచి చీకట్లోకి పరిగెట్టాడు. గడ్డి వామి లోంచి గడ్డి లాగుతోంది సావిత్రి.
    "సావిత్రీ !" నెమ్మదిగా పిలిచాడు చలపతి.
    ఆశ్చర్యంగా తనవంక చూసింది సావిత్రి "నువ్వా!" అంది చిరునవ్వుతో.
    "ఉదయం నుంచి నీకోసం ఎలా ఎదురుచూస్తున్నానో తెలుసా?" నిష్టూరంగా అన్నాడు.
    సావిత్రి జవాబివ్వలేదు . నవ్వి వూరుకుంది. ఆ నవ్వు వెనుక అర్ధాలు కూడా తెలుసు. మళ్ళీ తన పనిలో నిమగ్నమవబోయింది సావిత్రి. ఆమెకు అతి సమీపంగా వెళ్ళి నుంచున్నాడు చలపతి.
    "సావిత్రీ! నేను ఈ రాత్రికి వేళ్ళీపోతున్నాన్న విషయం నీకు తెలుసా?"
    "ఎందుకు తెలీదు?" మీ అత్తయ్య చాటింపు వేసేస్తోందిగా!"
    "అయితే తెలిసే పోతేపోనీ అని వూరుకున్నావన్నమాట!" కొంచెం కోపంగా అన్నాడు చలపతి.
    "బాగుంది!  పొద్దున్న రెండుసార్లు ఇంటికొచ్చాను! నువ్వేమో బజారు వెళ్ళావని మీ అత్తయ్య చెప్పింది. ఇంకేం చెయ్యను?"
    కొద్దిక్షణాలు చలపతి ఆనందంలో తేలిపోయాడు. సావిత్రి తనకోసం వచ్చింది!
    అంతే  తన కావలసిందంతే! అంటే ఆమెకూ తనతో మాట్లాడాలనే వుందన్నమాట.
    తన పిచ్చి గాని ఎందుకుండదు? ఆమెకు జీవితం మీద ఏమయినా ఆశలు ఉంటే అవి తనే కదా!
    "మళ్ళీ ఎప్పుడోస్తావ్?" అడిగింది సావిత్రి. లాంతరు చిమ్ముతోన్న ఆ గుడ్డి వెలుగులో కూడా ఆమె ముఖంలోని అందం దేదీప్యమానంగా వెలిగిపోతూ కనబడుతోంది.
    "ఏమో! వెళ్తే గానీ అక్కడి విషయాలు తెలీదు! నెలా లేకపోతె రెండు నెలలు, ఎప్పుడు ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా వచ్చేస్తాను!.........."
    "ఏమో! అందరూ ఇలాగే అంటారు! తీరా పట్నం వెళ్ళాక అన్నీ మర్చిపోతారు. సిటీ లైఫ్ అలాంటిది" నవ్వుతూ అందామె.
    "భలేదానివే! నన్ను అంతే అర్ధం  చేసుకున్నవన్నామాట!" బాధగా అన్నాడు చలపతి. "ఊరికే అన్నాలే! అంత కోపమెందుకు?" నవ్వేస్తూ అంది సావిత్రి.
    "నీకు ఉత్తరం రాయాలంటే ఎలా?" అడిగాడు చలపతి.
    "అమ్మో ! ఇంకేమయినా వుందా? అలాంటి పని చేయకు!" భయంగా అంది సావిత్రి.
    ఆమె ఏదయినా ఉపాయం చెబుతుందేమోనని ఆశలు పెట్టుకున్న అతను నిరుత్సాహపడిపోయాడు.
    "మరి నా విషయాలన్నీ నీకు తెలియజేయటం ఎలా?"
    "మీ అత్తయ్యకి రాస్తుంటావ్ కదా! నేను వెళ్ళి అడుగుతుంటానులే!"
    "మరి నీ సంగతేమిటీ? నువ్వు నాకు ఎలాగోలా రహస్యంగా ఓ ఉత్తరం ముక్క రాసి పడేస్తుండ కూడదూ?"
    "ఏమో! అది మాత్రం ఎలా కుదురుతుంది? నాకు కవరెవరు తెచ్చిస్తారు? రాసిన తరువాత ఎవరు పోస్టులో వేస్తారు? అన్నీ గొడవలే......" తల దిన్చుకుంటూ అంది ఆమె.
    "అదంతా నాకు తెలీదు! నీ దగ్గర్నుంచి ఉత్తరం కూడా లేకపోతే నేను అక్కడ వుండలేను!"
    సావిత్రీ మళ్ళీ నవ్వేసింది" నువ్వు చిన్నపిల్లాడిలా మాట్లాడతావ్!"
    "అవును! నీకలాగే వుంటుంది . అందుకే అంటారు ఆడదాన్ని అర్ధం చేసుకోవటం కష్టం అని. నిన్ను చూడకుండా నీకు దూరంగా ఎలా ఉండటమా అని నేను సతమతమవుతుంటే - నీకసలు ఈ విషయమే పట్టనట్లుంది - అలాగయితే నేను వెళ్తున్నాను! నేను నీకు ఉత్తరాలు రాయను. నువ్వూ నాకు ఉత్తరాలు రాయొద్దు. ఇంక నేనేసలు ఈ ఊరికి కూడా రాను!" కోపంగా అన్నాడు చలపతి.
    "అదుగో ! అంతలోనే కోపం వచ్చేసింది చూశావా? అందుకే చిన్నపిల్లాడి వన్నాను........" మరింతగా నవ్వేస్తూ
    "లేకపోతే ఏమిటి! నీకంతా నవులాటగా ఉంది!"
    'అదేంకాదు ! నువ్వు కొంచెం అలోచించు! నా పరిస్థితిలో నువ్వే వుంటే ఏం చేయగలవు? ఉత్తరాలు రాయగలవా? పిన్ని సంగతి నీకు బాగా తెలుసు! అలాంటి దేమయినా ఆమె కంటపడితే ఇంక నా పరిస్థితి ఎలా వుంటుందో ఊహించుకో! వెంటనే నన్ను ఏ రెండో పెళ్ళాడికో ఇచ్చి పెళ్ళి చేసి పారేస్తారు. నీకిది ఇష్టమయితే చెప్పు.......నెమ్మదిగా అందామె. అలా అంటుంటే ఆమె కళ్ళలో నీళ్ళు మెరిసాయ్.
    చలపతి ఉక్కిరిబిక్కిరయిపోయాడు. చటుక్కున ఆమె చేతిని అనుకొని మృదువుగా నొక్కాడు." సారీ, సావిత్రీ! నీ మనసు నొప్పించాను కదూ!"    
    "నాకు తెలుసు చలపతీ! నా మీద నీకెంత ప్రేమ వుందో, నన్నీ కూపం నుంచి బయట పడేయ్యాలని నువ్వెంత తహతహలాడుతున్నావో నేను గ్రహించుకున్నాను. నేను ఈ రోజు కోసం ఎంతగా ఎదురు చూశానో నీకు తెలీదు. త్వరగా ఉద్యోగం దొరకలనీ, అప్పుడు గానీ మనం ఒకటి అవడానికి అవకాశం దొరకదనీ ఎంతో ఆశపడ్డాను! అంతా అనుకోన్నట్లే జరుగుతోంది. ఇంక నేనెందుకు దిగులుపడాలి! నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నా , నాకు సంతోషంగానే వుంది. ఎందుకంటె ఈ దూరమే మనల్ని దగ్గర చేయడానికి మార్గంగా మారుతుంది ! అవునా, కాదా?"
    
                                                        ***
    
     చలపతి అమితంగా ఆనందపడిపోయాడు . సావిత్రి తనది. తను సావిత్రి మనిషి! తనకు "నా" అన్నవాళ్లు లేరు. సావిత్రికి వున్నా లేనివారితో సమానమే! అందుకే ఒకరినికరు సర్వస్వం అయి జీవితం గడపాలని తను కలలు కంటున్నాడు.
    "సరే సావిత్రీ! నేనిక వెళతాను. అక్కడకు వెళ్ళగానే పరిస్థితులు చూసుకుని అన్నీ సవ్యంగా వుంటే వెంటనే వచ్చి మన విషయం మీ నాన్నతో మాట్లాడతాను సరేనా?" తలూపిందామె.
    చలపతి అక్కడి నుంచి తనింటి వేపు నడిచాడు. అతనికిప్పుడు సంతృప్తిగా ఉంది. మనసులోని దిగులు చాలావరకూ తొలగిపోయింది. సావిత్రికింకేన్నాళ్ళు ఈ కష్టాలుండవ్. చాలా కొద్దిరోజులు అంతే. ఆ తరువాత మహారాణిలా జీవితం గడుపుతుంది.
    పదిగంటలకల్లా స్టేషన్ చేరుకున్నాడు చలపతి. టిక్కెట్ తీసుకుని ప్లాట్ ఫాం మీద నిలబడ్డాడు. అతనికి ఎంత ప్రయత్నించినా దుఃఖం ఆగటం లేదు.
    వచ్చేటప్పుడు వాళ్ళింటి బయట నిలబడి చేయి ఊపిన సావిత్రే అతనికి కళ్ళ ముందు మెదులుతోంది. తనకు తెలుసు, ఆమె లోలోపల ఎంత క్షోభించి పోతోందో! అదే తనకు భరింపరానిదిగా వుంది. సావిత్రి కంటతడి పెట్టడం, అందునా తనకోసం దుఃఖించడం తను సహించలేడు.
    రైలు బిగ్గరగా శబ్దం చేసుకొంటూ స్టేషన్ లోకొచ్చేవరకూ అతను ఆలోచనల్లోంచి తేరుకోలేదు. త్వరత్వరగా పెట్టె, బెడ్డింగ్ తీసుకుని, ఓ పెట్లో ఎక్కేశాడు. కూర్చునే ఖాళీ ఎక్కడా కనిపించలేదు. చాలామంది నంచునే వున్నారు. సామాను సీటు కిందకు తోసి తేలికగా గాలి పీల్చుకున్నాడు. చలపతి. రైలు కూత వేసి నెమ్మదిగా కదిలింది.

                                                              * * *

    హైదరాబాద్ చేరుకునేసరికి మధ్యాహ్నం ఒంటి గంటలయిపోయింది. సరాసరి స్టేషన్ ఎదుర్గానే ఉన్న హోటల్ ను చేరుకొని భోజనం చేశాడు చలపతి. చౌకలో గది దొరికే ఓ హోటల్ అడ్రస్ తెలుసుకొని రిక్షాలో అక్కడికి చేరుకున్నాడు. సామాను గదిలో పడేసి బట్టలు మార్చుకొని బస్ లో సనత్ నగర్ బయలుదేరాడు.
    తనకి ఉద్యోగం ఇచ్చిన ఫ్యాక్టరీ అక్కడే ఉంది. కొత్తగా పెట్టరది. చిన్న సంస్థ కావడంతో ఎక్కువమంది సిబ్బంది కూడా లేరు. నలుగురు గుమాస్తాలు, ఒక టైపిస్టు, ఒక ఫ్యునూ, మేనేజరూ! అంతే!


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS