Previous Page Next Page 
8 డౌన్ పేజి 2

    ఆమె కన్నీరు తుడుచుకుంటూ తలూపింది.
    ఆ పక్క కంపార్టుమెంటులో మీసాలు, గడ్డాలూ తెల్లబడిపోయిన ఓ స్వామీజీ బెర్తు నెంబరు థర్టీ త్రీ మీద ఆసీనులయి వున్నారు. ఆయన చుట్టూ భక్త పరమాణువులు గుమికూడిపోయారు. అందరూ వరుసగా నిమిషానికోసారి ఆయన పాదాలమీద పడిపోతున్నారు.
    "స్వామీజీ, మా అబ్బాయి గుండెజబ్బు నయమౌతుందంటారా"
    స్వామి చిరునవ్వు నవ్వారు.
    "ఎన్నడా మా అబ్బాయి, మా అమ్మాయి, మా భార్య.  ఏమిడా ఇది. ఇదెల్ల మిథ్యరా తంబీ" వైరాగ్యంవుట్టిపడుతూండగా శెలవిచ్చాడాయన.    
    "ఈ బొందిలో ప్రాణమున్నంతవరకూ ఈ తపన తప్పదుకదా స్వామీజీ"    
    "ఈ శరీరందానే మిథ్య తంబీ ఏదొకనాడు మట్టిలోకలిసిపోవచ్చి, దీని మీద మమకారం రొంబ ప్రమాదమే"    
    ఇంకో భక్తుడు ముందుకొచ్చాడు "స్వామీ మా కుటంబంలో సమస్యలు ఎప్పటికి పరిష్కారం అవుతాయి స్వామీ"    
    "పిచ్చివాడా నువ్వులేదు, నేను లేదు ఈజీవరాసులన్నింటిలో నేనుదా వున్నానని శ్రీ కృష్ణభగవాన్ దాచెప్పినారే మరంచినావా"    
    "భగవంతుడుమనలో వుంటేమరీ బాధలేమిటి స్వామీ"    
    స్వామీ చిరాగ్గా చూశాడతనివేపు. అప్పుడే ఇంకో భక్తుడు హడావిడిగా వచ్చాడు.    
    "స్వామీజీ, ఎయిర్ కండిషన్ కోచ్ లో బెర్తు కోసం అడిగాం గానీ టి.టి.యిలేదంటున్నాడు".    
    స్వామీజీ మొఖంలోచిరాకు కనిపించింది.
    "అంటే వైజాగ్ వరకూ సెకండ్ క్లాస్ లో పోతామా ఏమి ఇట్లా సేస్తారు. నా శరీరానికి వేడికొంచెం కూడా పడదనిముందే సెప్పినాన..."    
    "ఎ.సి.కోసం టి.టి.ఇ.ని రిక్వెస్ట్ చేశాము స్వామీ. కానీ ఒక్క బెర్తు కూడా కేన్సిలేషన్ కాలేదంటున్నాడు" అన్నాడు భక్తుడు వినయంగా.    
    "ఈ తెలుగు టి.టి.ఇ.లు దైవభక్తిలేని సన్యాసులుదానే ఉండారు. వాండ్లేకాదు అసలు ఈ తెలుంగుభక్తులే నిండాయూస్ లెస్ బాస్టర్డ్స్ మా టమిళియన్స్ సూడండి. స్వామీజీలకునిండా రెస్పెక్ట్ ఇస్తారు. ఎ.సి. రూమ్. ఎ.సి. టికెట్ ఇస్తారు. హార్డుకాష్ ఇస్తారు" మండిపడి తపస్సులోకివెళ్ళిపోయాడు స్వామీజీ    
    ఆ పక్క కంపార్టుమెంటులో బెర్తు నెంబరు ఫార్టీవన్ లోకిటికీ దగ్గర ఓ యువతి కూర్చుని వుంది.    
    అసాధరణమైన ఆమె అందం చూసి స్టన్ అయిపోయాడు భవాని శంకర్. అయితే యువరాణిలా వెలిగిపోతుంది. ఆమె అందాన్ని, ఆమె అలంకరణలు మరింత దట్టంగా పెంచేస్తున్నయ్. ఆమె ధరించినమధ్య తరగతి దుస్తులు ఆమె అందాన్ని చాలా తగ్గించేసి నార్మల్ గా కన్పింపజేయడానికి విశ్వప్రయత్నం చేసి ఓడిపోతున్నాయ్.   
    ఆమె పక్కనే ఓ ముసలయన మిడిల్ క్లాస్ పోలికలతో, పుట్టెడు దిగుళ్ళతో కుమిలిపోతున్నట్లు కూర్చుని వున్నాడు.    
    వారి మధ్యలో పదిపన్నెండేళ్ళ బాలక్ ఒకడు కూర్చుని లైట్ స్విచ్ లు పని చేస్తున్నాయోలేదో పరీక్షిస్తున్నాడు.    
    భవాని శంకర్ ఆ యువరాణి అందాన్ని చూస్తూ నిలబడిపోయేసరికి ఓ లావుపాటి ఆకారం వచ్చి అమాంతం అతనిని డాష్ కొట్టేశాడు. ఆ వేగానికి భవాని శంకర్ ముందుకుకు తూలి చార్టు పట్టుకుని ఫోజులో నిలబడ్డ టి.టి.ఇ కి డాష్ ఇచ్చాడు.    
    టి.టి.ఇ. కిందపడబోయి బెర్తుకోసంతెగ ప్రాధేయపడుతున్న పాసెంజర్ ని కిందికితోసి తను నిలదొక్కుకున్నాడు.    
    కిందపడ్డ పాసింజెరు కోపంగా లేచి నిలబడి "ఇప్పటికయినా బెర్తుఇస్తారా, ఇయ్యరా" అనడిగాడు మండిపోతూ.    
    టి.టి.ఇ. గత్యంతరంలేక తలూపి బెర్తుఇవ్వాల్సి వచ్చినందుకుకోపం పట్టలేక తనమీద పడ్డ భవానిశంకర్ వేపు తిరిగాడు. భవానిశంకర్ ఆ ప్రమాదం గ్రహించిచప్పున యాక్షన్ లోకొచ్చేశాడు. బాడ్జిమీద అతని పేరు ఓ సారి చూసుకుని "హలో మైడియర్ వెంకట్రావ్, హౌ ఆర్ యూ బ్రదర్ నేన్నీకు గుర్తున్నానా? ఇద్దరం రెండేళ్ళక్రితం టి.టి.ఇ. పాసెంజర్ హోదాలో ఎ.సి. ఎక్స్ ప్రెస్ లో ప్రయాణం చేశాం అన్నాడు చిరునవ్వుతో.
    "ఎ.సి. ఎక్స్ ప్రెస్ లోనా" ఆలోచనలోపడుతూ అన్నాడు టి.టి.ఇ.    
    "యస్ బ్రదర్ బైదిబై ఎక్ స్ట్రా కోచ్ అంటే ఏది? ఇదేనా, వెరీ గుడ్ ఈ ఎక్ స్ట్రా కోచ్ అనేది ఎక్కడవుంటుందో సగంమంది రైల్వేవాళ్ళు చెప్పలేకపోయారు ఫ్రెండ్. ఇంతకూ ఎక్ స్ట్రా కోచ్ అన్న పేరు ఎందుకొచ్చిందో చెప్పగలరా".
    టి.టి.ఇ. పొంగిపోతూఒకసారి టై సరిజేసుకున్నాడు.    
    ఎక్స్ ట్రా కోచ్ అనేది మామూలు కోచ్ లు చాలనప్పుడు అంటేరష్ ఎక్కువయి వెయిటింగ్ లిస్టు పెరిగి స్లీపర్ కోచ్ లు తక్కువున్నప్పుడు మామూలు కోచ్ లకు అదనంగా వెయిటింగ్ లిస్టులో వున్న ప్రయాణీకులు అంటే ఒక స్లీపర్ కోచ్ గానీ లేకరెండు స్లీపర్ కోచ్ లు గాని....." ఇంతవరకు చెప్పి కన్ఫ్యూజయిపోయి ఆ విషయం భవానీ శంకర్ కి తెలీకుండా ఉండడం కోసం ఓ దగ్గు దగ్గి" వేరీజ్ యువర్ టికెట్" అనడిగాడు.
    
                                         2    
    భవాని శంకర్ వెంటనే టికెట్ తీసి అతనికి చూపించాడు.    
    చార్టులో టికెట్ నెంబర్ చెక్ చేసి" ఎక్స్ ట్రా కోచ్ ఇదే బెర్తు నెంబరు ఫార్టీఫోర్" అన్నాడు తిరిగి ఇచ్చేస్తూ.    
    "థాంక్యూ, మైడియర్ వెంకట్రావ్ ప్రయాణీకుల సేవయే మా విధి అన్న స్లోగన్ మీ ప్రతి మూవ్ మెంట్ లోనూ కనబడుతోంది బ్రదర్, కీపిటప్ ఏదోరోజు మదర్ థెరీసా అవార్డు తప్పకవస్తుంది మీకు" అంటూ కోచ్ ఎంట్రన్స్ వేపునడవబోయాడు.    
    అయితే అంతవరకూ చేరకముందే వెనకనుంచి మళ్ళీ అదే పెద్దమనిషిమళ్ళీ భవానిశంకర్ ని మళ్ళీ అదేవెలాసిటీతో డాష్ ఇచ్చి భవాని శంకర్ బొక్కబోర్లా పడకముందే క్రేన్ హుక్ లాగా అతని కాలర్ పట్టుకుని ఆపేశాడు.    
    "ఎక్స్ క్యూజ్ మీ యంగ్ మాన్, ఈ ఎక్స్ ట్రా కోచ్ అనేది ఎక్కడుంటుంది. స్టేషన్ మాస్టర్ ని అడిగాను, తెలీదన్నాడు. లైసెన్స్ కూలీనడిగాను తెలియదన్నాడు. గేట్ దగ్గర టి.సి.ని అడిగాను, తెలీదన్నాడు. లైసెన్స్ కూలీ నడిగాను తెలీదన్నాడు".    
    భవాని శంకర్ అతనివేపు జాలిగా చూశాడు.    
    "వ్వాట్, ఎక్స్ ట్రా కోచ్ ఎక్కడుందో తెలీదా! వెరీ బాడ్ జంటిల్మన్ దిసీజ్ ఎక్స్ ట్రా కోచ్ అనబడేపదార్ధం".    
    ఆ పెద్దమనిషి మొఖంలో ఆనందం కనిపించింది.    
    "ఓ దిసీజ్ ఎక్స్ ట్రా కోచ్ వెరీ ఫైన్. మామూలు కోచ్ ఎక్స్ ట్రా కోచ్ కీ తేడా ఏమిటో ఇంకా అర్ధం కాలేదు. స్టిల్ రైల్వే లాంగ్వేజ్ ఈజ్ లాంగ్వేజ్. ఇవాళ బోయింగ్ ఫెయిలయిపోయింది. అందుకని రైలెక్కాల్సివచ్చింది. సాధారణంగా రైల్లో వెళ్ళను. ఎప్పుడో ఎనిమిదేళ్ళ    కిందట వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు తప్పలేదు, బైదిబై అసలు దీనిని ఎక్స్ ట్రా కోచ్ అని ఎందుకంటారు? ఆ పేరెలావచ్చిందో చెప్పగలరా".    
    భవాని శంకర్ అతనిని చూసి జాలిపడ్డాడు.    
    "వ్వాట్! ఎక్స్ ట్రా కోచ్ అంటే తెలీదా! వెరీ పాథటిక్ కండిషన్ జంటిల్మన్ మీలాంటి రిచ్ ఎడ్యుకేటెడ్ బిజినెస్ మాన్ ఎక్స్ ట్రా కోచ్ అంతే తెలియకపోవడం యావద్దేశానికి తలవంపులు, మైడియర్ సర్, ఎక్స్ ట్రా కోచ్ అంటే మామూలు స్లీపర్ కోచ్ లు గాని లేక ఇతర జనరల్ కోచ్ లు గాని చాలనప్పుడు అంటే విపరీతమయిన ప్రయాణీకుల రద్దీలో వెయిటింగ్ లిస్టు అనేది అడ్డదిడ్డంగా పెరిగిపోయి ఆయా స్లీపర్ కోచ్ లను అపర్మితంగా మించిపోయి అంటే మరో ఒకటో లేక రెండో లేక మూడో స్లీపర్ కోచ్ లకు సరిపోయేంత ప్రయాణీకుల వేచియున్న లిస్టే ఉన్నచో అట్టిసందర్భాలలో మామూలు స్లీపర్ కోచీలకన్న జనరల్ కోచీలకన్న అదనంగా ఇంకొకటో రెండో, లేక మూడో లేక ఎన్నో వెయిటింగ్ లిస్ట్...."    
    అక్కడితో భవాని శంకర్ ఫ్లో ఆగిపోయింది.
    కన్ ఫ్యూజన్ తారాస్థాయి చేరుకుంది. ఆ పరిస్థితిలో తనవంక థౌజెండ్ వాట్స్ బల్బ్ ని చూస్తున్నట్లు ఆశగా చూస్తున్న ఆ రిచ్ బిజినెస్ మెన్ ని నిరాశ పరచటం ఇష్టంలేక చప్పున ఓ దగ్గుదగ్గి, గట్టిగా నవ్వి ఆరిపోయేలోపల "సోదటీజ్ కాల్డ్ ఎక్స్ ట్రా కోచ్. ఇప్పుడు మీకు క్షుణ్ణంగా అర్ధమయిందనుకొంటాను" అన్నాడు ఆయన భుజంమీద చేయివేసి ఎంకరేజింగ్ గా భుజం తడుతూ.
    ఆ పెద్దమనిషి మొఖమాటపడి "ఓ యస్, అయ్ గాటిట్ నౌ. థాంక్యూ వెరీమచ్ ఫర్ యువర్ ఎలాబరేట్ లెక్చర్" అనేసి వెనుక సామాన్లతో నిలబడ్డ నౌఖరుకి సైగచేసి ఆ కోచ్ లో కెక్కి ఆ యువరాణీ కి ఎదుటి బెర్తులో కూర్చున్నాడు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS