Previous Page Next Page 
మిసెస్ కైలాసం పేజి 2


                             తమసోమా జ్యోతిర్గమయ
    
    "ఎవరూ? గోపాలం నువ్వటోయ్? అలా చూడకుండానే వెళ్ళి పోతున్నావ్?"
    తల వంచుకొని అన్యమనస్కంగా నడుస్తున్న గోపాలరావు ఉలిక్కిపడి నడక్కు బ్రేకు పడ్డట్టు ఆగిపోయాడు.
    పచ్చగా, పొట్టిగా, లావుగా, గుండ్రంగా ఉన్న ఆ విగ్రహం ఒకదానిమీద ఒకటి మూడు సున్నాలు చుట్టినట్లుంది. షర్టులేకుండా కప్పుకున్న పచ్చని శాలువాలోంచి తొంగిచూస్తోంది బొజ్జ. మోకాళ్ళవరకు ధోవతి. చేతులకు సింహతలాటాలు. లలాటాలమీద కుంకుమబొట్టు. చేతిలో పంచాంగం. ఆయన్ను చూస్తూంటే అంత విసుగులోనూ గోపాలానికి నవ్వాలనిపించింది.
    "ఏఁవిటోయ్! అలా కొత్తవాణ్ణి చూస్తున్నట్లు చూస్తున్నావ్? నాన్నగారు కులాసాగా వున్నారా?"
    "ఆఁ....అబ్బే ఏం లేదండీ! ఏదో పరధ్యానంగా వున్నానంతే. నాన్నగారు మిమ్మల్ని అప్పుడప్పుడూ తలుస్తూనే వుంటారు."
    "నాకూ నాన్నగారిని చూడాలనే వుందోయ్. ఈమధ్య బొత్తిగా తీరి చావడంలేదు."
    "ఎందుకు తీరుతుంది. నాన్నగారు రిటైర్ అయాక ఇంటి పరిస్థితులు మీకు తెలియకపోతేగా?" మనస్సులోనే అనుకున్నాడు గోపాలం.
    వెంకటసుబ్బావధానులు మంచి సిద్దాంతిగా పేరు సంపాదించుకొన్నాడు. పెద్ద పెద్ద ఆఫీసర్ల ఇళ్ళలోనయితేనేం, మంత్రుల ఇళ్ళలో అయితేనేం, ఏ శుభకార్యం జరిగినా అవధాన్లకు పిలుపు వస్తుంది. జాతకాలు వ్రాయటంలో ఆయనకు ఆయనే సాటి అనిపించుకున్నాడు. మొత్తంమీద మంచి రాబడితో పాటు పదిమందిలో పలుకుబడి కూడా సంపాదించుకున్నాడు. పిల్లలందర్నీ మంచి చదువులు చదివించి ఉద్యోగాల్లో పెట్టాడు.
    "నాన్నగారి ఆరోగ్యం ఎలా వుంది?  నీ చదువు పూర్తయిందా?" తెచ్చిపెట్టుకున్నట్లుంది ఆ స్వరంలో ఆప్యాయత.
    "నాన్నగారికి ఒంట్లో అంత బాగా ఉండటంలేదు. నేను బి.ఏ. పూర్తిచేశాను. ఫస్టుక్లాసులో పాసయాను. ఆరునెలలుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా నాకు ఉద్యోగం దొరకలేదు. నాన్నగారికి ఇదో దిగులు?" దిగులుగా అన్నాడు గోపాలం.
    "దిగులుపడి చేసేదేముంది? అన్నీ తెలిసిన నాన్నగారు ఇంత చిన్న విషయాలకు దిగులుపడటం ఏమిటి?" వేదాంతిలా ముఖం పెట్టాడు సిద్దాంతి.
    గోపాలానికి వళ్ళు మండింది. "ఈ ఊరు వచ్చిన కొత్తలో మీరు గడిపిన జీవితాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి." అనాలనిపించింది గోపాలానికి. అప్పుడు తనకు పన్నెండు సంవత్సరాల వయస్సుండ వచ్చును. దిగాలుపడి కూర్చుంటే, నాన్నగారు ఆయనకు ధైర్యం చెప్పటం ఇప్పటికీ కళ్ళకు కట్టినట్లుంది.
    "అన్నీ తెలిసినవారికి జీవిత సమస్యలు వుండవా?"
    "ఉంటాయనుకో. దిగులుపడి చేసేదిమాత్రం ఏముంది? 'ప్రాప్తవ్య మర్ధం లభ్యతే మనుష్యః! దేవో2పీతం లంఘయితుం నశక్తి?' !" అన్నాడు అవధానులు అరమోడ్పు కన్నులతో, కుడిచేతిని గాలిలోకి విసురుతూ.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS