Previous Page Next Page 
ఒక గుండె సవ్వడి పేజి 2

   
    ఒకమ్మాయి...
    ఒకబ్బాయి...
    చీకటి ముసుగేసిన నగరానికి, లైట్ల వెలుతురు ఫినిషింగ్ టచ్ లా వుంది. చిరు జల్లులు ఆ జంటను చూసి ముచ్చట పడుతున్నట్టు వుంది.
    ఆ యిద్దరూ ఈ వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ, ఈ సమయం కోసమే ఎదుర్చూస్తున్నట్టు, ఇలాంటి అనుభవం కోసమే కాచుక్కూచున్నట్టు.... యిలాంటి అనుభూతి కోసం నిరీక్షించినట్టు...
    తాపీగా నడుస్తున్నారు.
    ఆ అబ్బాయి, ఆ అమ్మాయిని తన దగ్గరకు లాక్కొని, ఆ అమ్మాయి అందమైన, సన్నని నడుమ్మీద చేయివేసి, అతి పదిలంగా ఆ అమ్మాయిని నడిపిస్తున్నట్టున్నాడు.
    ఆ అమ్మాయి తన తలను, ఆ అబ్బాయి భుజంమీద ఆన్చి, రెండు చేతులను అబ్బాయి కుడిచేతికి బంధంలా వేసి నడుస్తోంది.
    ఆ అబ్బాయి అభినయ్.
    ఆ అమ్మాయి విరజ.
    వాళ్ళిద్దరూ వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.
    బ్లాక్ కలర్ జీన్స్ మీద, ఎల్లోకలర్ రౌండ్ నెక్ టీషర్ట్ వేసుకొని అతను.
    బ్లూ కాలర్ మలైసిల్క్ చీరకు, అదే కలర్ బ్లౌజ్ వేసుకొని సింపుల్ గా వున్న ఆమె...
    ఇద్దరూ నడుస్తూ వెళ్తుంటే చూసేవాళ్ళకు ముచ్చటగా వుంది.
    
                                     * * *
    
    "విరూ... ఈ వర్షం కురిసే సాయంకాలం.... యిలా వర్షంలో తడుస్తూ వెళ్తుంటే... ఎలా వుంది" అడిగాడు అభినయ్.
    విరజ అతనివంక ఓసారి చూసి.... "నిజం చెప్పమంటావా? అబద్దం చెప్పమంటావా?" పాతాళభైరవిలో తోటరాముడిలా అడిగింది.
    "సెటైర్లొద్దు..... బీ సీరియస్" ఆమె నడుంమీద గిల్లి అన్నాడు అభినయ్.
    "దానికి డైలాగు పార్టు చాలు...నడుంమీద గిల్లే 'యాక్షన్ పార్ట్' ఎందుకు?" అంది అల్లరిగా.
    "హూ... నిన్ను కదిలించాను చూడు....నాదీ....నాదీ బుద్ది తక్కువ...." అన్నాడు అభినయ్.
    "పాతికేళ్ళు 'డ్యాష్' కిందికి వచ్చేక నీకీ నగ్నసత్యం తెలిసిందన్న మాట....థాంక్స్...." అంది టీజింగ్ గా విరజ.
    "విరూ.... బీ సీరియస్ అని చెప్పానా?" మందలిస్తూ అన్నాడు.
    "అయితే మొక్కజొన్న పొత్తులు తిందామా? వర్షంలో తఃడుస్తూ మొక్కజొన్న పొత్తులు తింటూ వెళ్తోంటే వుంటుంది నా సామిరంగా..." అంది విరజ.
    "అబ్బ... నువ్వు 'నా సామిరంగా...' అంటుంటే భాష అదోలా వుంది. నీ పర్సనాల్టీ, స్టయిల్ కు 'నా సామి రంగా' అన్న వాక్యం సూటవ్వలేదు.
    "హూ.... ఇప్పుడింత 'క్లాస్' పీకడం అవసరమా?" అడిగింది విరజ మొహాన్ని దీనంగా పెట్టి.
    "అదిగో మళ్ళీ 'పీకడం' లాంటి బూతు మాటలు వుపయోగిస్తున్నావు".
    "చాల్లేరా..." అంది వళ్ళు మండిన విరజ.
    "రా"...నా? నన్ను చాల్లేరా అన్నావా? 'గుండెను చేత్తో పట్టుకొని అపనమ్మకంగా దిగాడు అభినయ్.
    "ఇంకాస్త ముందుకెళ్ళలేదు. సంతోషించు బే..." అంది విరజ.
    అభినయ్ కు సీన్ అర్ధమైంది. తను విరజను కదిలించి పొరపాటు చేసేడు. కందిరీగల తుట్టె, విరజా ఒక్కటే అని అతనికి అనుభవ పూర్వకంగా తెలుసు.
    "హల్లో... ఏంటి భాష.... షాకయ్యావా? దిమ్మె తిరిగిందా?" అడిగింది విరజ.
    "మరే దానమ్మ కూడా తిరిగింది... ఛ...ఛ... నాకూ నీలా బూతులొచ్చేస్తున్నాయేంటి?" అన్నాడు అభినయ్.
    "వచ్చేస్తున్నాయ్ కదా!.... ఇంకేమిటి.... రానీ.... రానీ.... వస్తేరానీ.... బూతుల్... నీతుల్...."
    తలపట్టుకొని "ముందు ఆ మొక్కజొన్న పొత్తుల సంగతి ఏమిటో చూడు" అంటూ ప్యాంటు జేబులో చేయి పెట్టాడు.
    "అదేమిటి ప్యాంటు జేబులో చేయిపెడుతున్నావు?" అభినయ్ కు ఆ ప్రశ్నతో ఎక్కడో కాలింది. కానీ, ఆ 'ఎక్కడో' కాలినదాన్ని విరజ ముందు పెడితే జరిగే రియాక్షన్ ఏమిటో తెలిసి షటప్పయి చెప్పాడు..." మొక్కజొన్న పొత్తులకు డబ్బులు యిద్దామని"
    శాంతి చర్చలకు సిద్దమన్న ముషారఫ్ ను అపనమ్మకంగా చూసినట్టు చూసి పగలబడి నవ్వింది విరజ.
    "అదేమిటలా ఆడవిలన్ లా నవ్వుతావు?" ఉక్రోషంగా అడిగాడు అభినయ్.
    "ఇంతందమైన ఫిగర్ ని... అందులో వర్షంలో తడిచిన కసుక్కుని, నన్ను డబ్బులడిగే వాళ్ళెవరు?" అంది కాన్ఫిడెంట్ గా.
    'అయితే డబ్బు లివ్వకుండా మొక్కజొన్న పొత్తులు తీసుకువస్తావా?"
    "డౌటా?" ఎదురడిగింది విరజ.
    ఆ క్షణం అతనికి విరజ మొహం చూడాలంటే భయమేసింది.
    అన్నంతపని చేయగలదు. అనిపించింది. అయినా ఎక్కడో అపనమ్మకం. అందుకే....
    "డబ్బులివ్వకుండా నువ్వు తీసుకురాలేవు" అన్నాడు కాసింత ధైర్యంగా.
    "బెట్..."
    "బెట్...."
    విరజ ఓసారి అభినయ్ వంక చూసి "ఇక్కడే వుండు. అయిదు నిమిషాల్లో వేడివేడి, లేతలేత పొత్తులతో వస్తాను" అంది నవ్వి, కన్ను కొడుతూ.
    "నేనా? నేనిక్కడెందుకు వుండాలి. నీతోపాటు వస్తాను".
    "నువ్వా!? నువ్వొస్తే వాడెందుకిస్తాడు పొత్తులు...." అని అదోలా అభినయ్ వైపు చూసి ముందుకు కదిలింది.
    సరిగ్గా అయిదంటే అయిదే నిమిషాల్లో రెండు లేతమొక్కజొన్న పొత్తులతో వచ్చింది. వేడిగా వున్నాయి.
    "కమాన్ అభీ..." అంది అతని చేతిని పట్టుకుని.
    ఇంకా చిరుజల్లు పడుతూనే వుంది.
    "నిజం చెప్పు విరూ.... వాడెలా యిచ్చాడు"
    "పై కవర్ పీకి, నిప్పుల్లో కాల్చి..." చెప్పింది విరజ.
    "నేను అడిగేది.... డబ్బుల్లేకుండా ఎలా యిచ్చాడని....?"
    "ఓహ్... అదా... ఎందుకు బాసూ... అయినా నువ్వధి తెలుసుకోకపోవడమే మంచిది..." అంది విరజ.
    అభినయ్ కు గుండెలో మిస్సయిల్ లాంచ్ అవుతున్న ఫీలింగ్.
    "అబ్బా... చెప్పు.... టెన్షన్.... భరించలేకపోతున్నా....".
    "చెబితే నాకు టెన్షన్.... చెప్పకపోతే నీకు టెన్షన్.... పోనీలే నీకోసం చెబుతా... అన్నట్టు వేటగాడు సినిమా చూశావా?"
    "ఎందుకు?" అడిగాడు అభినయ్.
    "అబ్బ చూశావా? లేదా? సే యస్ ఆర్ నో..."
    "చూశాను"
    "అందులే ఆకుచాటు పిందె తడిసె.... పాట చూశావా?"
    "చూశాను పదిసార్లు" అన్నాడు ఠకీమని.
    "నాకు తెలుసు.... రాత్రికిరా' - సినిమా వందసార్లు చూశావటగా! మీ ఫ్రెండ్ గోపీగాడు చెప్పాడు."
    "ఛ....ఛ....నాకలాంటి సినిమాల పేర్లు కూడా తెలియవు"
    "సర్లే... ఇంతకీ ఆకుచాటు పిందె తడిసె. పాట చూసానంటావు..."
    "చూశానని చెప్పావుగా! నేనేకాదు రామ్ గోపాల్ వర్మ కూడా ఆ పాట చూసి యింప్రెస్ అయ్యాడుట".
    "ఛా.....! నిజమా?... మరి రాం గోపాల్ వర్మ ఆ పాట చూసి అంత యింప్రెస్ అయితే. ఆ మొక్కజొన్నపొత్తుల వాడు ఎంత యింప్రెస్ అవుతాడంటావ్?"
    "ఏంటీ.... ఆ మొక్కజొన్నపొత్తులవాడు కూడా చూశాడటనా- ఆ సినిమా!"
    ""హూ.... అప్పట్లో నాడి ఆర్ధిక పరిస్థితి బాగాలేక చూడలేకపోయాడుట.... అందుకే..."
    "ఆఁ! అందుకే...." టెన్షన్ గా అడిగాడు అభినయ్....
    "ఇప్పుడు చూస్తానన్నాడు"
    "ఇప్పుడా!"
    "అవును- ఆ పాట సోలోగా ఎన్టీఆర్ లేకుండా చూపించేసాను... అందుకే. రెండు మొక్కజొన్న పొత్తులు యిచ్చాడు.... డ...బ్బు... ల్లే....కుం...డా..." తాపీగా చెప్పింది విరజ.
    అభిని అనుమానంగా విరాజ మొహంలోకి చూశాడు. చాలా ఫాస్ట్ గా తన ఫేస్ లో ఎక్స్ ప్రెషన్స్ చకచకా మారుస్తోంది విరజ!
    ఎందుకో... అతనికి విరజ వేటగాడులో శ్రీదేవి లా, ఆ మొక్కజొన్నపొత్తులవాడి ముందు 'ఆకుచాటు పిందె తడిసె' అని సోలోగా డ్యాన్స్ చేసినట్టు అనిపించింది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS