Previous Page Next Page 
సూర్యుడు దిగిపోయాడు పేజి 2


    అనంతమూర్తి వ్రేళ్ళు, స్నేహితుడి వ్రేళ్ళచుట్టూ ప్రేమతో బిగుసుకున్నాయి.
    "గుర్తుంది" అన్నాడు విచారంగా.
    సముద్రం హోరుపెట్టింది.
    
                            * * *
    
    ఇద్దరూ పది పన్నెండేళ్ళ వయసునుండీ స్నేహితులు, స్నేహితులేకాదు ప్రాణస్నేహితులుకూడా.
    స్కూలునుంచి రాగానే ఇద్దరిలో ఒకరు రెండోవారింటికి పరిగెత్తేవారు. అక్కడ్నుంచీ యిద్దరూ కలసి, ఏ ఊరి బయటకో, పరస్పరం తోటల్లోకో, సముద్రపుటొడ్డుకో వెళ్ళి కబుర్లు చెప్పుకునేవారు. ఇలా కలుసుకోవటంలో ఏ ఒక్క రోజు తప్పిపోయినా యిద్దరికీ మనసు బాగుండేది కాదు. ఇద్దర్లోఒకరు ఇంట్లోవాళ్ళతో కలసి ఏదన్నా ఊరికి వెళ్ళినప్పుడు రెండోవాడు పిచ్చెత్తినట్లు, కాలుగాలిన పిల్లిలా తిరిగేవారు. ఒకర్నొకరు చూచుకునేదాకా వాళ్ళనుభవించే విరహం వర్ణించటానికి వీలులేనిది.
    ఇద్దరికీ మనసులు అంతగా దగ్గరపడటానికి ఓ కారణముంది. ఇద్దరిలోనూ ఏమాత్రమో కళాభినివేశం వుంది. అప్పట్లో వాళ్ళ భావాలకు సరిగ్గా స్వరూపాలు ఏర్పడలేదుగానీ మిగతావారిలా కేవలం రోడ్లమీద బలాదూరు తిరక్కుండా ఏ సంగీతాన్ని గురించో, సాహిత్యాన్ని గురించో తెలిసీ తెలియని చర్చలు చేసుకుంటూ వుండటం, అప్పుడప్పుడూ సాహిత్య సభలకూ, సంగీత కచేరీలకూ, నాటకాలకూ, వెళ్ళటం అలవాటు అనంతమూర్తికి పుస్తకాలపిచ్చి జాస్తిగా వుండేది. కనబడ్డ పుస్తకమల్లా వెర్రిగా చదివేవాడు. రాఘవరావుకు సంగీతమంటే అభిమానం. తనో గొప్ప గాయకుడయినట్లూ లేక ఏ వీణో, ఫిడేలో అద్భుతంగావాయించే వాద్యగాడయి నట్లు కలలుకనేవాడు.
    ఓ సాయంత్రం- అప్పుడే ఊరినుంచి వొచ్చిన అనంత మూర్తి ఆదరాబాదరాగా స్నేహితుడింటికి వెళ్ళాడు. ఎక్కడో వెళ్ళాడంది వాళ్ళమ్మగారు.
    తాను ఊళ్ళో లేనప్పుడు ఎక్కువగా సముద్ర తీరానికే వెళ్ళి కూర్చుంటాడని తెలుసు మూర్తికి. అందుకని అతన్ని వెతుక్కుంటూ ఆటే వెళ్ళాడు.
    సముద్రపు వొడ్డున యిసుకలో కూర్చుని రాఘవరావు కనిపించాడు. కాని అతను వొంటరిగాలేడు. ఇంచుమించుతమ యీడువాడే అయిన ఓ బెస్త పిల్లవాడితో మాట్లాడుతున్నాడు. ఆ పిల్లవాడి చేతిలో ఓ పిల్లన గ్రోవి వుంది.
    మూర్తిని చూడగానే రాఘవ ముఖం సంతోషంతో వెలిగింది. ఆహ్వానిస్తున్నట్లుగా చెయ్యిచాచి "మూర్తీ ఎప్పుడొచ్చావు? రా! యిటు కూర్చో......ఈ అబ్బాయి ఫ్లూట్ ఎంత బాగా వాయిస్తున్నాడో తెలుసా?" అని ప్రక్కన కూర్చోపెట్టుకుని ఆ అబ్బాయితో ఉత్సాహంగా "ఏదీ? యింకోసారి వాయించు. మా ఫ్రెండ్ వింటాడు" అనడిగాడు.
    ఆ పిల్లవాడిది గిరజాలజుట్టు, గోచీ పెట్టుకుని వున్నాడు.
    అడగగానే కాదనకుండా పిల్లనగ్రోవి పెదవుల దగ్గర పెట్టుకుని వాయించసాగాడు.
    ఆ గానంలో పరిపక్వత లేకపోవచ్చు గాని, వింటానికే మాత్రం చాలా శ్రావ్యంగా వుంది. మళ్ళీ మళ్ళీ వినాలనిపించే టట్లుగా వుంది. ఇద్దరి హృదయాలూ బరువెక్కాయి. చాలా సేపు మళ్ళీ మళ్ళీ పాడించుకుని విని, యిహ చీకటి పడేటట్లు వుందని యింటిదారి పట్టారు.
    దార్లో రాఘవరావు ఎక్కువ మాట్లాడలేకపోయాడు. కలల్లో తేలిపోతున్నాడు. అనంతమూర్తి ఎన్నోసార్లు పలకరించినా అతని చెవులకి వినిపించలేదు.
    ఇద్దరూ విడిపోయే దారి వచ్చింది.
    "రాఘవా మరి వెళ్ళవా?" అంటూ మూర్తి ప్రక్క సందులోకి తిరగబోయాడు.
    హఠాత్తుగా తెలివిలోకి వచ్చిన రాఘవ "మాట" అని అతడ్ని చెయ్యిపట్టుకుని ఆపాడు.
    చాలా ఆవేశంగా చెప్పసాగాడు. "నాకేం కావాలో యీవేళ నాకు తెలిసింది-నేను నిశ్చయించుకున్నాను. అవున్నేను నిశ్చయించుకున్నాను-నేను ఫ్లూట్ నేర్చుకుంటాను. అందులో ప్రావీణ్యం సంపాదిస్తాను. అందులో మొనగాడినవుతాను."
    ఇలా అని యిహ అక్కడ ఒక్క క్షణంకూడా ఆగకుండా, పూనకం వచ్చినవాడిలా తన సందులోకి గబగబ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.
    అప్పటికి ఇద్దరూ స్కూల్ ఫైనల్ చదువుతున్నారు. రెండు మూడు నెలల్లో పెద్ద పరీక్షలు. కష్టపడి చదవాలి. ఫ్లూట్ కొనుక్కునేందుకు చేతిలో డబ్బులేదు. తల్లిదండ్రులకి అతని పాకెట్ మనీక్రింద ఏమీ యిచ్చే అలవాటులేదు. అందుకని కూరలు తెచ్చేటప్పుడూ, వెచ్చాలు తెచ్చేటప్పుడూ కమీషన్ క్రింద కొంత కొట్టేసి, ఆ డబ్బు పదిలంగా దాచుకుంటూ వుండేవాడు.
    వీలయినప్పుడు ఆ బెస్త పిల్లవాడి దగ్గరకెళ్ళి అతన్ని బ్రతిమిలాడుకుని ఆ ఫ్లూట్ మీదే వాయించటం నేర్చుకుని వస్తూండేవాడు.
    యిద్దరూ పరీక్ష పాసయ్యారు.
    పైసాపైసా చొప్పునదాచుకొని రాఘవ ఎంతోకష్టం మీద డబ్బు ప్రోగుజేసుకుని సెలవుల్లో ఫ్లూట్ కొనుక్కున్నాడు. ఆ రాత్రి గది తలుపులు బిడాయించుకుని ఫ్లూట్ ని పెదవులముందు పెట్టుకుని వాయించసాగాడు. మరునిముషంలో అతని శరీరం పులకరించసాగింది. ఏవేవో అనుభూతులు మనసులో మెదిలాయి. వెర్రి ఉన్మాదం ఆవహించి నట్లయింది. టైము తెలియలేదు. అలా ఎంతసేపు గడిచిందో అతనికే తెలియదు.
    తలుపుమీద దబదబ చప్పుడయితే ఉలికిపడి యీ లోకంలోకివచ్చి లేచి తలుపు తీశాడు.
    ఎదురుగా తండ్రి ప్రళయకాల రుద్రుడిలా నిలబడ్డాడు.
    "ఏమిట్రా అది?"
    "యిదా? యిదీ....నాన్నా...యిది ఫ్లూట్..."
    "ఏదీ యిలాతే."
    తండ్రంటే అతనికి  హడలు. తల్లంటే అవధులే గౌరవం. వొణికిపోతూ దాన్ని ఆయనచేతికి అందిచ్చాడు.
    తండ్రి సీతారామయ్య దాన్ని అటూ యిటూ త్రిప్పి చూసి కన్నంలోంచి అటునుంచి ఏమయినా కనిపిస్తుందేమో నన్నట్టుగా కన్నుపెట్టిచూసి "ఎందుకు యీ గొట్టాంతో రాత్రుళ్ళు చప్పుళ్ళు చేస్తున్నావు?" అనడిగాడు.
    "అవీ....చప్పుళ్ళు కాదునాన్నా.... సంగీతం
...."
    "ఓహో! దీన్ని సంగీతమంటారా? నాకు తెలియదులే ఎవరు నేర్చుకోమన్నారు? నీ ఫ్రెండ్ మూర్తి సలహా యిచ్చాడా?"
    మూర్తంటే ఎందుకో సీతారామయ్యగారికి గిట్టదు మూర్తిపెద్దవాళ్ళతో మాట్లాడేప్పుడు జంకూ బొంకు లేకుండా వుండటం, అనదలచుకున్నది నిర్మొహమాటంగా ముఖంమీద అనెయ్యటం ఆయనకు నచ్చదు. ఆఅబ్బాయి పెద్దవాళ్ళపట్ల గౌరవ మర్యాదలు లేవని ఆయన దృఢ విశ్వాసం.
    "మూర్తి చెప్పలేదు నాన్నా! నాకే అనిపించింది భయంభయంగా అన్నాడు.
    "ఓహో! నీకే అనిపించిందా? ఎందుకు అనిపించిందట?"
    అతను మాట్లాడలేదు.  తలవంచుకున్నాడు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS