Previous Page Next Page 
షా పేజి 2

 

    "ఇక్కడ భోజనానికి లోటు లేదయ్యా. మీకు ఓపికుండాలే గాని సంతోషంగా వండిపెదతాను.
    "అన్నట్లోదినా ! నా స్కూటర్ బావుండలేదోదినా! ఎంతకాలం ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ డ్రైవ్ చేయటం? అందుకని అన్నయ్యకు రికమెండ్ చేసి సుజుకి కారు కొనిపిస్తే -చాలా బావుంటుంది? కావాలంటే నిన్ను వెనుక సీట్లో కూర్చోబెట్టుకుని రోజూ మీ ఫ్రెండ్స్ ఇళ్ళకూ, క్లబ్ కీ, సినిమాలకూ తిప్పుతావొదినా" అన్నాడు సృజన్.
    "నువ్వా! ఇప్పుడే వెయ్యిళ్ళ పూజారివి! ఇంక కారు కొనిస్తే మీ రంగా, నీ స్వరూప్ నీ వేసుకుని తిరిగి ఇంటికే రావు.
    "నో నో! అలా జరగదోదినా! అప్పుడు టైం టేబుల్ తయారు చేస్తాను కదా! రంగాగాడోచ్చి "పదరా , అలా గండిపేట వరకూ వెళ్ళి వద్దాం" అంటాడనుకో.
    "సారీరా రంగా! మధ్యాహ్నం మూడింటికీ కారు మా వదిన అధీనంలో వుంటుంది టైం టేబుల్ ప్రకారం " అంటానన్నమాట నేను."
    "అంతేనా?" అంటాడు రంగా కోపంగా.
    "అంతేరా! వదిన తర్వాతే మిగతా ప్రపంచం! సారీ! ఈ విషయంలో నేను నిస్సహాయుడిని?"
    వాడు కోపంగా వెళ్ళిపోతాడు.
    "ఇదంతా నువ్వు ఏ కర్టెన్ వెనుక నుంచో కిటికీ నుంచో చూస్తావ్ కదా! వెంటనే నా గదిలోకొచ్చి కన్నీళ్ళు పెట్టుకుని పశ్చాత్తాపంతో దహించుకుపోతూ "అయ్యో సృజన్ ! ఇంత గోల్డెన్ హృదయం  గల నిన్ను అపార్ధం చేసుకొని నువ్వు కారడిగిన వెంటనే మీ అన్నయ్యకు రికమెండ్ చేయలేకపోయాను కదా! నన్ను క్షమించు సృజన్ క్షమించు" అంటూ ఒకటే ఇదయిపోతావన్నమాట అప్పుడు........"
    సుభద్ర రెండు చేతులతో తల పట్టుకుర్చుంది.
    "అబ్బబ్బ! ఇంక అపు నాయనా నీ సోద.........మీ అన్నయాకు కారు గురించి చెప్తాను సరేనా?"
    సృజన్ రంగా వీపుమీద గట్టిగా చరిచాడు.
    "చుశార్రా! వాడినంటే ఇలా వుండాలి! ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి మా వాడినే ఈ జగతికి జీవనజ్యోతి....." అంటూ ఓ పాటుంది కదా!
    అది ఎవర్ని చూసి రాశాడనుకున్నారు ఆ కవి.
    "మాకు తెలుసులేరా! మీ వదినను చూసి ........" అన్నారిద్దరూ.
    'అబ్బబ్బ! మీ అమ్మ నీకింత వస ఎందుకు పోశారో ఏమో నా ప్రాణం మీది కొచ్చిందిప్పుడు........"
    "అయ్యో అలా అనకోదినా? ఇంత స్పోర్ట్స్ మన్ ని ఇంట్లో వుంటే నీ ప్రాణం మీదికేలా వస్తుంది? అన్నట్లు కొంచెం అన్నయ్యకు రికమెండ్ చేసి మారుతీ సుజికి కారు........"
    "అయ్యొయ్యో! ఇందాక చెప్పానయ్యా ఆ విషయం........." తల రెండుచేతుల్తో పట్టుకుంటూ అంది సుభద్ర.
    "చెప్పానా? ఎప్పుడూ?" ఆశ్చర్యంగా అడిగాడు.
    "ఇంతకుముందే చెప్పావు. మీరింక త్వరగా వెళ్ళండి! కాలేజీకి టైమవుతోంది."
    "సరే - వదినా! థాంక్ యూ- ఏదీ నీ చెయ్యి ఓసారివ్వు-"
    "ఎందుకు?"
    "ఇటివ్వు వదినా? క్వశ్చన్లేదుకు?"
    సుభద్ర చేయి చాపింది.
    "మా బంగారు వదిన" అంటూ ఆమె అరచేతిలో ముద్దు పెట్టుకుని బయటకు పరిగెత్తాడతను.
    

                                                *    *    *    *

    శ్రీధర్ బెల్ నొక్కేడు.
    "యస్సార్" స్ర్పింగ్ డోర్స్ తెరచుకుని లోపలికొచ్చాడు ఫ్యూన్.
    "రామనాధాన్ని పిలు........"
    "అలాగే సార్......." బయటికెళ్ళిపోయాడు కొద్ది క్షణాల తరువాత రామనాధం లోపలికొచ్చాడు.
    "యస్సార్?"
    "అందరూ వచ్చారా?"
    "వచ్చారు సార్"
    "ఎవరయినా అడ్రస్ చేస్తున్నారా వాళ్ళను?"
    "అవున్సార్! ఏరియా మేనేజరు గారు మాట్లాడుతున్నారు.........."
    "సరే అయన మాట్లాడటం అయిపోయాక నాతో చెప్పు......."
    "అలాగే సార్........." అతను వెళ్ళిపోయాడు.
    శ్రీధర్ తన ముందున్న ఫైల్ మరోసారి చదివాడు. చదువుతున్న కొద్దీ కలవరపాటు కలుగుతోందతనికి.
    తను మందుల కంపెనీ తయారు చేస్తోన్న అతి ముఖ్యమయిన మందులు రెండింటినీ ప్రభుత్వం బాన్ చేసింది. అదే ఫైల్లో వున్న విషయం.
    అవి రెండూ ఆరోగ్యానికి హానికరంగా యాక్టు చేస్తున్నాయన్న విషయం తమ మేనేజ్ మెంట్ కి అదివరకే తెలిసింది. కానీ తమ కంపెనీ తయారుచేస్తోన్న మందు అన్నింటిలోకి ఆ రెండే ఎక్కువలాభం సంపాదించి పెట్టెవి కావడంతో ఎవరికీ ఏం చేయడానికి తోచలేదు. ఆ రెండింటి ఉత్పత్తి మానివేస్తే ఇంచుమించుగా కంపెనీ మూసివేయాల్సిందే! అంత దారుణమయిన ప్రభావం వుంటుంది.
    రామనాధం లోపలికొచ్చాడు మళ్ళీ.
    "ఏరియా మేనేజరుగారు వచ్చేశారండీ!"
    "ఓ.కే! థాంక్యూ........" అంటూ లేచి మేడ మీద కాన్ఫరెన్స్ హాల్లోకి నడిచాడు. అక్కడ కూర్చున్న మెడికల్ రిప్రజెంటేటివ్ లు అతనిని చూడగానే లేచి నిలబడి విష్ చేశారు.
    డయాస్ మీద కూర్చున్నాడు శ్రీధర్.
    "ఏరియ మేనేజరు మీకు అన్నీ విషయాలూ వివరంగా చెప్పే వుంటాడు. మనం తయారుచేస్తున్న ట్రేటిన్ సిరప్, ఎమిడిరాన్ టాబ్ లెట్స్, ఈ రెండూ ప్రభుత్వం బాన్ చేసింది. అంటే మన మందుల్ని బాన్ చేయటం కాదు టెట్రాసైక్లిన్ విత్ విటమిన్ సి కాంబినేషన్ బాన్ చేశారు. అలాగే "ఎమిడో సైరిన్" కూడా బాన్ చేశారు. మనం తయారుచేస్తున్న "టేట్రిన్  సిరప్, ఎమిడి రాన్" ఈ రెండిటినీ బాన్ ప్రకారం మనం తయారు చేయడానికి వీలు లేదు. ప్రస్తుతం మార్కెట్ లో వున్నా స్టాక్ కూడా అమ్ముడవుతుందన్న నమ్మకం లేదు."


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS