Previous Page Next Page 
క్లైమాక్స్ పేజి 2

అందుకని, అతని అభిమానుల హర్షధ్వానాలలో తనకీ భాగం వుందని వూహించుకుని, తనని తాను వురించుకుంటోంది మధుమతి.

డైరెక్టరు హీరో హరీన్ నీ, హీరోయిన్ మధుమతినీ, విలన్ శ్రీకాంత్ నీ దగ్గరికి పిలిచి, శీను వివరించడం మొదలెట్టాడు .

అతని మాటలని శ్రద్దగా వింటున్నారు ముగ్గురూ.

"ఇప్పుడు షాట్ చేజింగ్ సీన్ అన్నమాట! హీరోయిన్ పారిపోతుంటే విలన్ జీపులో చేజ్ చేస్తూ వుంటాడు.

"అప్పుడు హీరో హటాత్తుగా కొండల చాటునుంచి గుర్రం మీద ప్రత్యక్ష్మమై, హీరోయిన్ కి చెయ్యి అందించి, ఆమెని గుర్రం మీదకి లాగేసుకుని రక్షిస్తాడన్నమాట!

నెక్స్ ట్ సీను విలన్ తో హీరో ఫైటు! ఈజిట్ క్లియర్?"

ముగ్గురూ తలలు వూపారు.

కెమెరా ఫీల్డు ఎంతవరకు వుంటుందో వివరించి చెప్పాడు కెమెరామేన్. అనుభవం ఉన్న ఆర్టిస్టులు ఆ ఫీల్డు దాటి బయటికి పోరు. బయటికి పొతే కెమెరా ఫ్రేం లోకి రారన్నమాట.

ఎవరు ఎలా యాక్ట్ చెయ్యాలో మూవ్ మెంట్స్ తో సహా నటించి చూపాడు డైరెక్టరు.

ఒకప్పుడు అతనే ఒక స్టేజి నటుడు కూడా.

అసిస్టెంటు డైరెక్టరు అందించిన స్కిప్టు ఒకేసారి సరిచూసుకుని, డైలాగులు మననం చేసుకున్నాడు హీరో.

కొద్దిక్షణల తర్వాత, "నేను రెడీ" అన్నాడు.

కెమెరా సెట్ చేసుకున్నాడు కెమెరామన్.

"స్టార్ట్!" అన్నాడు డైరెక్టర్.

కెమెరాలో ఫిల్ము తిరగడం మొదలెట్టింది.

రొప్పుతూ పరిగెత్తడం మొదలెట్టింది హీరోయిన్ మధుమతి.

అప్పటికే జీపులో రెడీగా కూర్చుని వున్న విలన్ శ్రీకాంత్ జీప్ ని స్టార్ట్ చేసి చేజ్ చెయ్యడం మొదలెట్టాడు.

హటాత్తుగా కొండల చాటు నుంచి గుర్రం మీద గెలప్ చేస్తూ వచ్చాడు హీరో సెకండ్లలో ఆ జీపుని దాటేశాడు.

ఈలోగా -

చీర కుచ్చిళ్ళు పాదాలకి తగులుకుని కొండపడిపోయింది హీరోయిన్. అలా పడిపోయినట్లు అమోఘమైన నటన ప్రదర్శించింది.

ఆమెని చేరుకున్నాడు హీరో. గుర్రం మీద  నుంచే వంగి ఆమెకి చెయ్యి అందించాడు.

రిలీఫ్ ని చూపించే ఒక ఏక్స్ ప్రషన్ ఇచ్చి అతని చేతిని అందుకోవడానికి తన చేతిని జాచింది మధుమతి.

అప్పుడు -

దూరంగా, కొండల చాటునుంచి ఒక ఆర్తనాదం వినబడింది.

ఒక స్త్రీ కంఠం అది!

ఆ షూటింగ్ లో పాల్గొంటున్న పాత్రధారిణి ఎవరో పెట్టిన కేక కాదది! నటనలో భాగం కాదు!

నిజంగా ప్రాణాపాయంలో వున్న అతివ ఎవరో పెట్టిన చావుకేక అది!

అలర్టుగా అయిపోయి చెవులు రిక్కించి విన్నాడు హరీన్.

                                                 2

ఆపదలో వున్న ఆ ఆడపిల్ల ఆర్తనాదం వినబడింది హీరో హరీన్ కి. గుర్రం మీదనుంచి వంగి, కింద పడివున్న మధుమతి చేతిని అందుకోబోతున్న హరీన్, ఆ చేతిని వదిలేసి, కేకవచ్చిన వైపు దృష్టిని సారించాడు. మరుక్షణంలో గుర్రాన్ని ముందుకు వురికించాడు.

బంగారంలా వస్తోందనుకున్న షాట్ పాడయిపోగానే వెర్రికోపం వచ్చింది డైరెక్టరుకి. టోపిని గాల్లోకి ఎగరేసి గట్టిగా గర్జించాడు అతను.

ఆ సీను విలన్ శ్రీకాంత్ కంటపడింది. భయంతో అతని అరచేతుల్లో చెమటపోసింది. "అయ్యో షాట్ పాడయిపోయింది. ఇప్పుడెలాగండీ!" అన్నాడు శ్రీకాంత్ హీరోయిన్ మధుమతితో, అతని కాళ్ళు గజగజ వణుకుతున్నాయి.

"మరేం ఫర్వాలేదు! భయపడకండి! హీరోగారు రియల్ లైఫ్ లో కూడా హీరోనే! ఎవరికో ఏదో విపత్తు వచ్చి వుంటుంది. అదేమిటో తెలుసుకోవడానికే అయన వెళ్ళారు" అంది మధుమతి.

"అయన రియల్ లైఫ్ లో కూడా హీరోనే అని నాకు తెలుసునమ్మా! ఆయన్నెవరూ ఏమీ అనరు. అయన బాగానే వుంటారు. నా పరిస్థితే ఏమీ బాగాలేదు" అన్నాడు విలన్ శ్రీకాంత్. " డైరెక్టరుగారు అసలే చండశాసనుడు. నన్ను చెండుకు తింటాడెమో అయన" అన్నాడు కంపిస్తూ.

"ఇందులో మీ తప్పేమీలేదనీ ఆయనకి నేను నచ్చచెబుతాలెండి. మీరు వర్రీ కావద్దు" అంది మధుమతి అతన్ని అనునయిస్తూ. ఆమె మాటలతో అతను కొద్దిగా తేరుకుని, ఆమెకి సమీపంలోనే వినయంగా, ఒద్దిగ్గా నిలబడ్డాడు. ఆపదలో వున్న తనని రక్షించడానికి భువినుంచి దివికి దిగివచ్చిన దేవతలా కనబడింది ఆమె అతనికి.

"ఫస్టు టేకే బ్రహ్మడంగా వస్తోంది. నాకు ఫిల్ము అదా!" అనుకుని సంతోషపడబోతున్న ప్రొడ్యూసర్, ఈ అవాంతరం రాగానే జరిగిపోతున్న వేస్టేజీని తలుచుకుని బాధపడ్డాడు.

అప్పటిదాకా గోళ్ళు గిల్లుకుంటూ ఒక పక్కన నిలబడి వున్నాడు హీరో గారి డూప్ రతన్. అతను ఏక్స్ లెంట్ స్టంట్ మాన్. ఒడ్డు పొడుగూ అంతా హరీన్ లాగే వుంటాడు అతను. హరీన్ పిక్చరు అనగానే ఆటోమేటిక్ గా రతన్ ని కూడా బుక్ చేస్తారు గానీ నిజానికి అతనికీ పనేమీ వుండదు. తన ఫైట్స్, తన స్టంట్స్ అన్నీ తనే స్వయంగా చేస్తాడు హరీన్. అవన్నీ రియల్ గా చేసే నేర్పూ, ఓర్పూ, చెయ్యగల సాహసం కూడా అతనికి వున్నాయి.

ఒక ఆడపిల్ల ఆర్తనాదం విన్న హరీన్ అటువైపుగా గుర్రాన్ని దౌడు తియించగానే , ఆదుర్దా పడ్డాడు రతన్. అక్కడ స్పేర్ గా వున్న మరో గుర్రం ఎక్కి హరీన్ వెంట వేగంగా వెళ్ళిపోయాడు.

కొండమలుపు తిరగగానే అక్కడ కనబడుతోంది ఒక నది. దాని మీద ఒక బ్రిడ్జి వుంది.

ఆ బ్రిడ్జి మీద భయంగా వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ పరిగెడుతోంది ఒక అమ్మాయి. ఆమెని తరుముతున్నాడు ఒక జులాయి వెధవలాంటి మనిషి.

సంకోచించకుండా గుర్రాన్ని బ్రిడ్జి మీదికి వురికించాడు హరీన్. క్షణాల్లో వాళ్ళని చేరుకునాడు.

తన గుర్రాన్ని కూడా బ్రిడ్జి మీదకు వురికించబోయాడు స్టంట్ మాన్ రతన్? కాని చివరిక్షణంలో బలంగా కళ్ళెంలాగి గుర్రాన్ని ఆపేశాడు.

బ్రిడ్జి మీద మధ్య మధ్య గేప్స్ వున్నాయి. గుర్రం కాలు ఆ ఖాళీలలో ఇరుక్కుంటే తనపని ఖాళీ అయిపోతుంది! తను మంచి స్టంట్ మాన్! నిజమే! కానీ మంచి స్టంట్ మాన్ కి ఎప్పుడూ ముందు జాగ్రత్త వుండాలి. ముందు వెనుకలు చూడకుండా, సరైన ప్లానింగ్ లేకుండా ముందుకి దూకేస్తే ఏ స్టంట్ మాన్ కూడా ఎక్కువరోజులు బతకలేడు.

ఈ బ్రిడ్జి మీదికి గుర్రం మీద వెళ్ళడం చాలా డేంజరస్ ఫీట్!

తనలాంటి ఏక్స్ ఫర్టు స్టంట్ మాన్ కూడా చెయ్యడానికి వెనకాడే ఫీట్ ని సునాయాసంగా చేసేస్తున్నాడు ఈ హరీన్!  అందుకే అతను కనిపిస్తే చాలు కనకవర్షం కురిపిస్తారు ప్రేక్షకులు. హీరో హరీన్ సాహసాన్ని తలుచుకోగానే రతన్ కి కూడా తెగింపు వచ్చింది. ఏమయితే అది అవుతుందని హరీన్ కి సాయంగా తను కూడా వెళ్ళదలుచుకున్నాడు. గుర్రం మీద వెళ్ళడం తెలివైన పని కాదు కాబట్టి, గుర్రం దిగి బ్రిడ్జి మీదికి పరిగెత్తబోయాడు. అప్పుడు కనబడింది అతనికి - బ్రిడ్జి అవతల వైపు నుంచి వేగంగా వస్తున్న ట్రెయిన్ . ఏం చెయ్యాలి ఇప్పుడు?

ఎటూ తేల్చుకోలేక, సంకోచంగా అక్కడే ఆగిపోయాడు స్టంట్ మాన్ రతన్.

బ్రిడ్జి మీద అమ్మాయిని తరుముతున్న రౌడీని సమీపించాడు హరీన్. రౌడీ మెడ మీద బలంగా పడింది హరీన్ చెయ్యి. వాడిని కాలర్ దగ్గర పట్టుకుని దూది బొమ్మని పైకి ఎత్తినట్లు సునాయాసంగా గాలిలోకి ఎత్తాడు హరీన్. బూటుకాలితో అతని డొక్కలో ఒక తన్నుతన్నాడు. తర్వాత నదిలోకి తొంగిచుశాడు.

ఆ నదిలో నీళ్ళు ఎక్కువ లేవు. మోకాలి లోతున మాత్రమే వున్నాయి.

ఈ జులాయి వెధవని నదిలోకి తోసినా చచ్చేంత దెబ్బ తగులుతుందేమోగానీ, చావడు.

వాణ్ని ఇంకొక్క తన్ను తన్ని, నీళ్ళలోకి గిరావాటు వేశాడు హరీన్.

"అమ్మోవ్.........." అని కీచుగా అరుస్తూ కిందపడ్డాడు ఆ రౌడీ - ఇసకా నీళ్ళు కలిసి రబ్బరు పరుపులాగా అతని ఫాల్ ని అపాయి. బొద్దింకలా వెల్లకిలా పడ్డాడు అతను.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS