Previous Page Next Page 
వలపు సంకెళ్ళు పేజి 2

"ఎమ్మే చదివిన నేను కూడా ఇంత లక్షణంగా బతుకుతున్నాను" అన్నాడు దగ్గరలోనే నిలుచుండిన ఒకతను.
పక్కమ్మాయి అప్రయత్నంగా పమిట సర్దుకుని మాట్లాడకుండా కూర్చుంది. లత మాత్రం భయపడలేదు.
"ఎమ్మే చదివినా ఉద్యోగం రాలేదా?" అంది.
"నేను నిరుద్యోగిగా పుట్టి ఇవ్వాళకి రెండేళ్ళయింది. ఇవాళ నా రెండో బర్త్ డే! జేబులో డబ్బుల్లేవుగానీ, వుంటే ఇక్కడుండిన అందరికీ, ముఖ్యంగా ఎంప్లాయిమెంట్ ఎక్సేంజివాళ్ళకి మంచి పార్టీ ఇద్దును" అన్నాడతను నవ్వుతూ.
అతని వైపు యధాలాపంగానే చూసింది లత. అయినా అతనిలో ఉండిన కొన్ని ప్రత్యేకతలు కొట్టొచ్చినట్లు కనబడిపోతున్నాయి. అతను చాలా పొడుగు. దాదాపు ఆరడుగులుండొచ్చు.పొడుగుకి తగిన లావు. జేబుల దగ్గర మాసి, కొద్దిగా నలిగిన తెల్లపాంటూ, తెల్లషర్టూ ఎవ్వరినీ లెక్క చెయ్యనట్లుండే చూపు! కానీ ఆ చూపుల్లోనే స్నేహం, చనువూ! 'వాయిస్ ఆఫ్ అమెరికా' రేడియో అనౌన్సర్ల గొంతులాగా మొగతనం ధ్వనిస్తున్న అతని గొంతులో 'మంచిగా వుంటే నువ్వు నా మిత్రుడివి' అనే స్నేహభావం, 'నాతో మంచిగా ఉండకపోతే నేను నీశత్రువుని' అనే హెచ్చరిక కూడా వినబడుతుంటాయి.
అతడిని చాలా సార్లు చూసింది తను. ఎక్స్చేంజిలో, ఇంటర్వ్యూలలో కూడా. 'కొద్దిగా పొగరు ఇతనికి' అని మాత్రమే అనుకుంది అతడి గురించి. కానీ అతను అంత చదువుకుని ఉంటాడని ఊహించలేదు.
"మీకే ఉద్యోగం దొరక్కపోతే ఇంక నాకేం దొరుకుతుందీ? అయినా మీలా ఎమ్మేలూ, పీ హెచ్ డీలూ చేసినవాళ్ళు కూడా క్లర్కు ఉద్యోగాలకి కాంపిటీషన్ వచ్చేస్తే ఇక మా గతేమిటి?" అంది నవ్వుతూనే.
"క్లర్కు ఉద్యోగాలేమిటి? ఫ్యూన్ ఉద్యోగాలకి కూడా కాంపిటీషన్ వెళ్ళాను కొన్నిసార్లు. అవి కూడా రాలేదనుకోండి!" చెప్పాడు.
అతడిని ఫ్యూన్ గా ఊహించుకోగానే అప్రయత్నంగా నవ్వొచ్చింది లతకు. కాస్త గొంతు పెద్దది చేస్తేనే తిరగబడి కొట్టేలా వుండిన ఇతడిని బెల్ కొట్టి పిలిచి 'గ్లాసుతో మంచినీళ్ళు తీసుకురా!' అని చెప్పే ధైర్యం ఉంటుందా ఎవరికైనా!
ఇంతలో లోపలినుంచి ఒక క్లర్కు వచ్చాడు.
అందరూ దగ్గరగా వెళ్ళి నిలబడ్డారు. లతతో మాట్లాడుతున్న అతను నిర్లక్ష్యంగా సిగరెట్ వెలిగించి, నడుంమీద చెయ్యి పెట్టుకుని నిలబడి, క్లర్కు చెప్పేది వింటున్నాడు.
"జానకీదాస్ అండ్ కంపెనీలో రేపు పదిన్నరకు ఇంటర్వ్యూ ఒక క్లర్కు పోస్ట్. ఆరుమందిని పంపుతున్నాం." చెప్పాడు క్లర్కు.
"జీతమెంత?" అని వినబడిందొక గొంతు.
తక్కినవాళ్ళు అతడిని వింతగా చూశారు.
"బెగ్గర్స్ కెనాట్ బీ ఛూజీ? బిచ్చగాళ్ళు ఏం పడేస్తే అది, యెంత పడేస్తే అంత తినాలి" అన్నాడు 'ఎమ్మే' కొంచెం వ్యంగ్యం, కొంచెం తీవ్రతా కలిసిన గొంతుతో.
నిస్సహాయతతో కూడిన నవ్వులు.
"జీతం రెండొందల అరవై" అంటూ లోపలికెళ్ళిపోయాడు క్లర్కు.
ఇందాక తనతో మాట్లాడినతనివైపు చూసి 'వెళ్ళివస్తాను' అన్నట్లు తల పంకించి బయలుదేరింది లత.
    
                                                                  * * *
    
ఉద్యోగం వస్తుందని నమ్మకం లేకపోయినా, ఇంటర్వ్యూలకి హాజరవడం తప్పదు.
పొద్దున్నే ఎనిమిదిన్నరకల్లా టొమాటో పచ్చడీ, మజ్జిగా వేసుకుని అన్నం తినేసి, ఇంటర్వ్యూల కోసమే తను దాచిపెట్టిన లేత ఆకుపచ్చరంగు నైలాన్ చీర అందంగా కట్టుకుని, సర్టిఫికేట్లు బ్యాగులో పెట్టుకుని "అమ్మా! వెళ్ళొస్తా" అంటూ బయలుదేరింది లత. "దేముడికి నమస్కారం పెట్టుకున్నావా" అంది అమ్మ.
"నమస్కారం' అనే పదంలోనే 'మస్కా' ఉంది. నేనెవరికీ మస్కా కొట్టను. చివరికి దేముడికి కూడా!" అనేసి తల్లి అనేది వినిపించుకోకుండా చకచక నడిచింది లత.
దారిలో బస్టాప్ కనబడుతుంది. అయినా అక్కడ ఆగదు తను. ఈ మధ్య బస్సుల్లో వెళ్ళడం మానేసింది అదో దండగని.
ఇవాళ బస్టాప్ లో రాధ నిల్చుని ఉంది. "ఇంటర్వ్యూ నా?" అంది పలకరింపుగా.
"బావుంది! పట్టుచీర కట్టుకుంటే పెళ్ళికో, పేరంటానికో అనుకున్నట్టు నేను నైలాన్ చీర కట్టుకుంటే ఇంటర్వ్యూ కెళతానని నీకూ తెలిసిపోయిందన్న మాట!" అంది లతా దగ్గరగా వచ్చి నవ్వుతూ.
రాధకూడా నవ్వింది.
"ఎక్కడ ఇంటర్వ్యూ? ఏ బస్సులో వెళ్ళాలి?"
"బస్సులేదూ ఏమీలేదు. నడిచి వెళ్ళిపోవడమే! ఎందుకంటావా? లావెక్కకుండా, స్లిమ్ గా సినిమా హీరోయిన్ లా ఉండడానికి" అని నవ్వేసి 'బై' చెప్పి కదిలింది.
కొద్దిగా ఇబ్బంది ఫీలవుతూ, "బెస్టాఫ్ లక్!" అంది రాధ.
లత వెనక్కి తిరిగి చూసి, నవ్వి చెయ్యి ఊపింది.
అదే లతలో ప్రత్యేకత! అతి సులభంగా పెదిమలమీదికి వచ్చేసే నవ్వు!
కళ్ళలో పుట్టి, పెదిమలమీదకి జారిపోయే స్వచ్చమైన, అందమైన చిరునవ్వు!
ముళ్ళచెట్టుకి తెల్లపూలు పూసినట్టు బాధలనీ, ఇబ్బందులనీ మనసులో తొక్కేస్తూ మొహంమీద కనబడే నవ్వు!
సికింద్రాబాద్ లో ఉంది జానకీదాస్ అండ్ కంపెనీ! ఎంతలేదన్నా యాభయి నిమిషాల నడక.
త్వరత్వరగా నడుస్తూ ఉంటే చెప్పు తెగంది. అది హవాయ్ చెప్పు. ఆకు చెప్పయితే ఈడుస్తూనయినా కొంతదూరం నడవొచ్చు. హవాయ్ చెప్పు తెగితే పాదం బెణికినట్లు అక్కడే ఆగి పోవాల్సిందే!
చిరాకుతోబాటు నవ్వుకూడా వచ్చింది లతకి.
"నాకు ఉద్యోగం రావడం నీకు కూడా ఇష్టం లేదన్నమాట!" అనుకుంది చెప్పుని చిరుకోపంగా చూస్తూ. చెప్పుని ఈడుస్తూ ఫుట్ పాత్ దగ్గరికి నడిచి అక్కడ నిలబడింది.
చెప్పులు కుట్టేవాడికోసం చూడడం అనవసరం!
తన పెద్ద బ్యాగ్ లో చిన్న పైసా కూడా లేదు.
సరిగ్గా సగం దూరం నడిచి వచ్చేసింది తను. ఇంకో రెండు కిలోమీటర్లు నడిస్తే ఆఫీసు వస్తుంది.
ఆఫీసు వస్తుంది కానీ ఉద్యోగం వస్తుందా?


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS