Previous Page Next Page 
ప్రేమ తరంగం పేజి 2

    చిరునవ్వుతో ఓరగా చూసి హొటల్లోకి నడిచింది లావణ్య. రెండడుగులు వెనగ్గా నడుస్తున్న శ్రీహర్ష ఆరాదనగా ఆమెని చూశాడు.
ఆ అమ్మాయి చాలా పొడుగు కిందే లెక్క. అయిదడుగుల అయిదంగుళాలు వుండొచ్చు. నొక్కు నొక్కుల జడ, లావుగా , పొడుగ్గా, నడుము దాటి పిరుదల మీదు పడుతుంది. ఆ నొక్కులు గనక లేకపోతే మోకాళ్ళ దాకా వచ్చేంత పోడుగుంది జుట్టు. మేడపైన ఒత్తుగా, అలలు అలలుగా, ఆరోగ్యంగా షాంపూ అడ్వర్ టైజ్ మెంటులా కనబడుతున్న జుట్టు. నూనే రాసుకోక పోవడం వల్ల ఎప్పుడూ తలంటి పోసుకున్నట్లే కనబడుతుంది.
నలుపూ, సిమెంటు రంగూ కలిసిన అమెరికన్ జార్జేట్ చీరే, సిమెంటు రంగు జాకెట్టు. అస్పష్టంగా జాకెట్లోంచి కనబడుతున్న నల్లటి బ్రా. నడుస్తున్నప్పుడు చీరెకి, పాదానికి మధ్య క్షణంలో సగంసేపు కనబడి అద్రుశ్యమౌతున్న నల్లపరికిణి తాలూకు నల్లలేసు- సున్నితమైన నగిషిలా ఉంది. ఎత్తుగా ఉన్న నలుపూ ఎరుపు కలిసిన ప్లాట్ ఫారం హీల్స్- జాగ్రత్తగా ఇష్టంగా అలంకరించుకున్న తీరు ఆ అమ్మాయి వంటిమీద ప్రతి అంగుళం తెలియబరుస్తోంది.
హొటల్ లోపల
డిమ్ గా వున్న లైటింగ్. గోడలోపలికి కట్టిన చిన్న గదిలాంటి దాన్లో కూర్చున్నారు.
బెరర్ మెనూ కార్డ్ తీసుకొచ్చి ముందు పెట్టాడు.
శ్రీహర్ష తీసుకుని చూశాడు.
"నాకు మొహమాటం లేదు. బ్రహ్మాండమైన ఆకలేస్తోంది. ఇష్టమొచ్చినంత తినేస్తాను. ఏమి అనుకోకూ!" అంటూ బెరర్ వైపు తిరిగి "నర్గిస్ కోప్తా, స్టఫ్ డ్ పరోటాస్, మిక్సేడ్ వెజిటబుల్ సూప్ , వెజిటబుల్ పలావ్ పట్రా" అన్నాడు.
లావణ్య కళ్ళు విప్పార్చి చూసింది.
"రోజు ఇలాగే తింటారా? లావెక్కిపోగలరు జాగ్రత్త!" అంది.
"ఎంత తిన్నా అరిగిపోయే పని ఉంటుంది నాకు. భయపడకు, నీకేం కావాలో అర్దరిచ్చేయ్"
మెనూ ఒక్కసారి పరికించి చూసింది లావణ్య.
"పెరుగు వడ, లెమన్ జ్యూసూ" అంది బెరర్ తో.
శ్రీహర్ష జాలిగా చూశాడు.
"ఇలా తింటే నువ్వు చిక్కిపోతావు."
"అదే కావాల్సింది.
"తినడానికి భయపడుతూ బతకడం కష్టం."
"బతకడం కోసం కాస్త తినటం. అంతేకాని తినడం కోసం బతకం కదా?"
"నా విషయంలో రెండోదే నిజం"
ఒక్కక్షణం అతని వైపు ప్రేమగా చూసింది లావణ్య.
"అవును. మీకు తినడం ఎంత ఇష్టమో నాకు తెలియదా? ముందు మంచి భోజనం- తర్వాత లావణ్య- ఇవే మీ ఇష్టాలు. తొమ్మిదిన్నర లోపల లావణ్యని సినిమాకి తీసుకెళ్ళాలా, హోటళ్ళు మూసేసే లోపల భోజనం చెయ్యాలా అన్న ప్రశ్న వస్తే ప్రతిసారి భోజనమే ప్రిపేర్ చేస్తారనుకుంటాను మీరు."
శ్రీహర్ష నవ్వాడు. "మరీ అంత అన్యాయంగా మాట్లాడకు."
"అయినా బెరర్ హడలిపోయేట్లు అన్ని డిషెస్ ఒక్కసారిగా అర్దరివ్వకుండా ఒకదాని తర్వాత ఒకటి చెబితే ఏం పోతుందో?"
మళ్ళీ నవ్వాడు శ్రీహర్ష.
స్పూన్ తో నాజుగ్గా పెరుగు వడని ముక్కలు చేసి తింటోంది లావణ్య.
ఫోర్కు, స్పూను పక్కన పెట్టి శుభ్రంగా చేత్తో తినేస్తున్నాడు శ్రీహర్ష.
"స్పూన్లు ఫోర్లుల కంటె చేతులూ , వెళ్ళు ముందర ఇచ్చాడు" అన్నాడు శ్రీహర్ష. అలా మాటకు మాట జవాబు చెబితే ఆ అమ్మాయికి కోపం వస్తుందని తెలుసు. అయినా కోపం వచ్చినప్పుడు ఇంకా బావుంటుంది లావణ్య. తనకి కోపం తెప్పించి మళ్ళీ పోగొట్టడం శ్రీహర్ష సరదా.
లావణ్య మొహం ఎర్రబడింది.
"లావణ్యా! నువ్వు డబ్బులో పుట్టి పెరిగిన దానివి. ఇంగ్లీషు సామెతని కాపి కొట్టి చెప్పాలంటే, వెండి స్పూను నోట్లో పెట్టుకొని మరీ పుట్టావు. పోర్కు ఎలా వుపయోగించాలో, చాకుతో శాండ్ విచేస్ ఎలా  కొయ్యాలో కుడా నేర్పించే ఖరీదైన స్కూల్స్ లో చదివావు. నేనలా కాదే. మాములుగా పెరిగిన మనిషిని. నాకెలా చేతనవుతాయి చెప్పు ఇవన్ని! నువ్వు మెల్లమెల్లగా నేర్పించు. బుద్దిగా నేర్చుకుంటాను. ఒక్క రోజులోనే అన్నీ నేర్పించావనుకో. గుర్తుంచుకోలేక రేపు కాఫీ ఫోర్కుతో గుచ్చి తాగుతాను" అన్నాడు.
నవ్వేసింది లావణ్య.
"అబద్దాలు చెప్పకండి. బద్ధకం అని ఒప్పేసుకోకూడదు? మీకు తెలియనిదేమిటి? మీరు తలచుకుంటే నేర్చుకోలేనిది ఏమిటి?"
"థాంక్యూ! ఆ మాత్రం సదభిప్రాయం ఉంది నా మీద"
"అయినా మాటి మాటికి మీకు డబ్బు లేదు. డబ్బు లేదు అనుకుంటారెందుకో? నా డబ్బు మీది కాదా? మీరసలు డబ్బేలేని బీదవారా?"
"మొత్తం నా ఆస్తంతా వేలం వేస్తె తొంభై వేలు కూడా రాదు. పోనీ లక్ష అనుకో"
"లక్ష!" అంది లావణ్య వెక్కిరిస్తూ.
"పదిరూపాయలు మాత్రమే అన్నంత చులాగ్గా చెప్పేస్తున్నారు."
"ఏమి లేనివాళ్ళతో పోలిస్తే అక్షరాల ఎక్కువే కావొచ్చు.....కానీ మీ నాన్నగారు కట్టే టాక్సుకి సమానం కాదు."
"ఆ లెక్కన మా ఆస్థి మొత్తం బిర్లా చేసే దానధర్మాలకు సమానం కాదేమో! దీనికి అంతేక్కడా?"


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS