Previous Page Next Page 
వెన్నెల మెట్లు పేజి 2


    
    హాస్పిటల్లో ప్రతిమతో మాట్లాడిన తర్వాత స్కూటర్ని నేరుగా కేశవరావు పనిచేసే ఆఫీసు వైపు పోనిచ్చాడు శ్రీరాం.
    
    ఆ ఆఫీసు చుట్టూ వారం రోజుల నుండీ తిరుగుతున్నాడు తను. తన పేపర్లని తొక్కిపెట్టేసి, పని కానివ్వడం లేదు కేశవరావు.
    
    బాస్టర్డ్! వీడి పెళ్ళి చెయ్యాలి ఇవాళ!
    
    ఆఫీసులో కేశవరావు లేడు అరగంట ముందుగానే లంచ్ కి వెళ్ళిపోయాడుట.
    
    సెక్షనులోనుంచీ బయటికి వచ్చి, అక్కడే ఉన్న ఒక చెట్టుకింద నిలబడ్డాడు శ్రీరాం. ఆ చెట్టుమీద రాత్రంతా గబ్బిలాలు తలక్రిందులుగా వేలాడుతుంటాయి. పగలంతా ఆ చెట్టు కింద మనుషులు తలక్రిందులుగా నిలబడి, తమ పనులు కావాలని తపస్సు చేస్తూ ఉంటారు.
    
    ఆ ఆఫీసులో కేశవరావు పనిచేసే సీటు కామధేనువు లాంటిది. ఆ సీటులో ఉండబట్టే ప్రతిమని మెడిసిన్ చదివించగలిగాడు ఆయన.
    
    రెండవుతుండగా సీటుకి వచ్చాడు కేశవరావు. అసహనంగా నిలబడి ఉన్న శ్రీరాంని చూడగానే మొహం చిట్లించి-
    
    "ఇవాళే వచ్చారేమిటండీ? చెప్పాను గదా? ఇంకో నాలుగురోజుల దాకా మీ పని కాదని!" అన్నాడు గీరగా.
    
    శ్రీరాం మొహం కోపంతో జేవురించింది.    

    "ఇప్పటికే వారం రోజులనుంచీ తిరుగుతున్నాను -- ఇంకెన్నాళ్ళు?"
    
    "ఆఁ తిరిగితే! ఎవరి కోసం తిరుగుతావ్? నీకు ఇక్కడ పని ఉంది. దానికోసం వెయ్యిసార్లు తిరుగుతావ్! ఏదో నన్ను ఉద్దరించడానికి వస్తున్నట్లు ఫోజు పెడతావేమిటి? వెళ్ళు! వెళ్ళు!" అన్నాడు కేశవరావు అదిలిస్తున్నట్లు.
    
    తను ప్రభుత్వోద్యోగిననీ, ప్రజలకు సేవ చేయడానికే తను జీతం తీసుకుంటున్నాడు గానీ, ప్రజలు తన సేవకులు కారనీ ఆయన మర్చిపోయాడు, చాలాకాలం క్రితమే!
    
    ఆగ్రహాన్ని ఆపుకోవడానికి పళ్ళు బిగపట్టాడు శ్రీరాం పెద్ద పెద్ద అంగలతో తన స్కూటర్ దగ్గరికి నడిచాడు. కోపం అంతా స్కూటర్ మీద చూపిస్తూ, బలంగా ఒక్క 'కిక్' ఇచ్చి స్టార్ట్ చేశాడు.
    
    స్కూటరు గేటు దాటుతుండగా ఒకతను అడ్డం వచ్చాడు. చేతిలో హ్యాండ్ బ్యాగు.
    
    "ఆఫీసులో ఏదన్నా పని ఉందా, సార్?" అన్నాడు వరాలిచ్చే దేవదూతలాగా.

    ఒక్క క్షణం అయోమయంగా చూశాడు శ్రీరాం తర్వాత అతనికి అర్ధం అయింది.
    
    సో, ఇదన్న మాట లింకు! ఈ ఆఫీసులో వాళ్ళు డైరెక్టుగా డబ్బులడగరు. అన్ని వ్యవహారాలూ బ్రోకరు ద్వారానే జరగాలి.
    
    క్షణంలో ఒక నిర్ణయాని కొచ్చేశాడు శ్రీరాం. "అవును! కేశవరావు దగ్గర పని."
    
    నవ్వాడు బ్రోకరు.
    
    "కేశవరావు దగ్గర పని కావాలంటే ఇన్ని రోజులు తిరగాలా, సార్! నాతో ఒక్కమాట చెబితే సగం పూటలో అయిపోయేది!"
    
    "ఎంత?" అన్నాడు శ్రీరాం చులకనగా చూస్తూ.
    
    బ్రోకర్ శ్రీరాంని అంచనా వేస్తున్నట్లు చూసి, "ఒక్క వెయ్యి అవుతుంది, సార్!" అన్నాడు.
    
    పళ్ళ బిగువున నవ్వాడు శ్రీరాం.
    
    "రేపు మధ్యాహ్నానికి నాకు ఆర్డర్సు కావాలి. ఆ వెంటనే నీకు డబ్బులిస్తాను."
    
    "తప్పకుండా అవుతది" అంటూ వివరాలు తీసుకుని వెళ్ళిపోయాడు బ్రోకరు.
    
    ఏడు రోజులు తిరిగినా కాని పని. 'కాని పని' చేస్తూ లంచం పెడితే ఒక్క పూటలో అవుతుందన్న మాట!
    
    శ్రీరాం ఒంట్లో రక్తం సలసల మరుగుతున్నట్లు అనిపించింది. వెంటనే దీపక్ దగ్గరికి బయలుదేరాడు. దీపక్ అతనికి క్లాస్ మేటు అవినీతి నిరోధక శాఖలో పనిచేస్తున్నాడు.
    
    తమ కేసులో ఇరికించబోయేది తను పెళ్ళాడగోరిన ప్రతిమ తండ్రినే అని శ్రీరాంకి తెలియదు - అప్పట్లో!
    
                                                              * * * * *
    
    దీపక్ దగ్గరనుంచీ తన ఆఫీసుకి తిరిగి వచ్చాడు శ్రీరాం. రివాల్వింగ్  ఛెయిర్లో కూర్చుని కాలితో పరధ్యానంగా తోస్తుంటే ఆ కుర్చీ తనచుట్టూ తాను తిరుగుతోంది. అతని ఆలోచనలు మాత్రం ప్రతిమ చుట్టూ పరిభ్రమిస్తున్నాయి.
    
    మైకెలాంజెలో మళ్ళీ బతికివచ్చి పాలరాతిలో మలిచిన స్త్రీ మూర్తిలా ఉంటుంది ప్రతిమ! జీసస్! ఏం అందం! ఫాంటాస్టిక్! ఫాబ్యులస్! ఓహ్! మై! మై!
    
    స్ప్రింగ్ డోర్ తెరుచుకుని లోపలికి వచ్చాడు మేనేజరు అనిల్ పాండే.
        
    "ఇంటర్వ్యూకి కేండిడేట్స్ వచ్చారు, బాస్! పంపమంటారా?"
    
    టైమ్ చూసుకున్నాడు శ్రీరాం. మూడున్నర అయింది.
    
    "అనిల్! కాసేపు కేండిడేట్స్ ని అలా వెయిట్ చెయ్యనివ్వు! ఈలోగా నువ్వు వాళ్ళ బిహేవియర్ గమనించు! ధైర్యంగా కూర్చుంటున్నారా? నెర్వస్ గా ఫీలవుతున్నారా? అతి చొరవా? వెకిలి వేషాలా? - అన్నీ అబ్జర్వ్ చెయ్యి బాగా! సరిగ్గా నాలుగవగానే లోపలికి పంపు! ఎంతమంది వచ్చారు?"
    
    "తొమ్మిది మంది అమ్మాయిలు."
    
    "బావున్నారా?" అన్నాడు శ్రీరాం.
    
    అతని మనసులో మరే దురుద్దేశమూ లేదు. ప్రెవేట్ సంస్థలలో అంతే! మోడల్ గరల్స్ లా మోడరన్ గా, షోకేసుల్లో పెట్టుకునే పింగాణి బొమ్మలంత అందంగా ఉండే అమ్మాయిలు తమ దగ్గర సెక్రెటరీలుగా, సేల్సు గరల్స్ గా పనిచేయడం తమ 'ఇమేజి'ని పెంచుతుందనీ, వ్యాపారానికి దోహదం చేస్తుందనీ చాలామంది అభిప్రాయం.
    
    "ఇంటర్వ్యూకి వచ్చిన అమ్మాయిలు బాగున్నారా?" అని శ్రీరాం అడగటంలో ఉద్దేశం కూడా అదే! ఇన్నాళ్ళనుంచీ అతనికి లేడీ సెక్రెటరీ లేదు. మగ స్టెనోగ్రాఫరు శేషగిరిరావు మాత్రం ఉన్నాడు. ఆ విషయం అతనికి ఫ్రెండ్స్ సర్కిల్ లో చాలా చిన్నతనం కలిగిస్తూంది.
    
    "బాస్! చెబితే మీరు నమ్మరు! ఒక అమ్మాయి అచ్చం నీతూ సింగ్ లానే ఉంది." అన్నాడు అనిల్ నవ్వుతూ.
        
    నీతూ సింగ్ శ్రీరాంకి ఫేవరేట్ హీరోయిన్. ఆ అమ్మాయి పిక్చర్ రిలీజయితే ఫస్టు డేనే చూసేవాడు యిదివరకు.
    
    "నీతూకి కజినేమో!" అన్నాడు శ్రీరాం కూడా నవ్వుతూ.
    
    కానీ అరగంట తర్వాత ఆ అమ్మాయిని చూసినప్పుడు అతను కొద్ది క్షణాలసేపు రెప్ప వెయ్యడం మర్చిపోయి ఆశ్చర్యంగా చూశాడు.
    
    "మీ పేరు?"
    
    "సౌందర్యా సింగ్!" అంది ఆ అమ్మాయి స్నేహంగా నవ్వుతూ అంతలోనే అతని ఆశ్చర్యాన్ని గమనించి, "నీతూసింగ్ కి ఏమీకాను ఇద్దరం పంజాబీలం! అంతే సంబంధం!" అంది. పోలికలనిబట్టీ, పేరుని బట్టీ ఆ ప్రశ్న ఆ అమ్మాయిని చాలామంది అడిగి వుంటారని అర్ధమయిపోతూనే ఉంది.
    
    "ఐసీ! ఐసీ! ఏం చదివారు?" అన్నాడు శ్రీరాం తేరుకుంటూ.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS