Previous Page Next Page 
మౌన రాగాలు పేజి 2

 

    "తప్పు" అన్నట్టు తల మెల్లిగా వూపింది శశి. "సుధీర్! అలా మాట్లాడకండి! మనం పేషెంట్లని బతికిస్తున్నాం! పేషెంట్లిచ్చే డబ్బుతో బతుకుతున్నామా? ఇంకేదన్నా జోక్ చెప్పు! మనం పేషెంట్ల డబ్బుతో కాదు బతికేది. శశీ! ఏం చేసుకోవాలో తెలియనంతటి నీ ఆస్తిమీద బతుకుతున్నాం! మీ తాతగారు డాక్టరు! ఆయనకు కెమిస్ట్రీలో డాక్టరేట్ ఉంది. కెమికల్స్ ఫ్యాక్టరీ పెట్టి లెక్కలేనన్ని లక్షలు సంపాదించారు. మీ నాన్నగారూ డాక్టరే! అయితే ఆయనకు డాక్టరేట్ కామర్స్ లో వచ్చింది. బిజినెస్ లో వూపిరి తిరక్కుండా డబ్బు సంపాదించారాయన! మరి నువ్వో ! మనుషుల డాక్టరువైపోయి, వాళ్ళకి వూపిరి పొయ్యడానికి నీవూపిరి ఆగిపోయేటట్లు పనిచేస్తూ నీ ఆస్తి అంతా పేషెంట్లమీద తగలేస్తున్నావ్!"
    
    చిరునవ్వు నవ్వింది శశి. ఎంతపనిలో ఉన్నా శశి గుండెల మీద పమిట ఎలా తొలగిపోనివ్వదో, అలాగే ఎంత సీరియస్ కేసు ట్రీట్ చేస్తున్నా, ఎంత సీరియస్ విషయం మాట్లాడుతున్నా పెదిమల మీద చిరునవ్వు తొలగి పోనివ్వదు.
    
    చిరునవ్వుతోనే మాట మార్చేస్తూ, "సీరియస్ కేసులేం లేవు. అంతగా సీరియస్ అనిపిస్తే డాక్టర్ వీరభద్రరావుగారికి కబురంపించండి." అంది.
    
    "సీరియస్ కేసులొస్తే డాక్టర్ వీరభద్రరావుకి కబురంపించాలా? మరి నేనెవడ్ని? డాక్టర్ని కానా? కాంపౌండర్నా?" అన్నాడు కొంచెం కోపంగా.
    
    శశి నవ్వుతూ అతని జుట్టు చెరిపేసింది, ప్రేమగా. "మీరు నా బుజ్జి పాపాయి! తెలిసిందా! మీకు ప్రాక్టీసు మీద ఇంట్రెస్టు లేదని తెలుసు. మీ ఇంట్రెస్టంతా.." అంటూ సాభిప్రాయంగా చూసి ఆగిపోయింది.
    
    "నేనూ నీతో వచ్చేస్తాను."
    
    "ఎలా కుదురుతుందీ? అంది శశి. "ఈ వసుమతి పెళ్ళి హఠాత్తుగా సెటిలయిపోయింది. ముందరే తెలిసి ఉంటే - ప్రాక్టీస్ వీరభద్రరావుగారిని చూసుకోమని రిక్వెస్ట్ చేసి, ఇద్దరం వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. నెక్స్ట్ టైం అలా ప్లాన్డ్ గా చేద్దాం. ఏం?" అంది శశి బుజ్జగిస్తున్నట్లు.
    
    "నెక్స్ట్ టైం అంటే? వసుమతి మళ్ళీ పెళ్ళి చెసుకుంటుందేమిటి?" అన్నాడు సుధీర్ ఉక్రోషంగా.
    
    నవ్వేసింది శశి. నవ్వే సమాధానం అన్నిటికీ.
    
    శశి సాధారణంగా వూరు వదిలి వెళ్ళదెప్పుడూ. ఆ నర్సింగ్ హోం ఆమెకి మొదటి లవ్! తను సెకండ్ లవర్ మాత్రమే! పేషంట్లని వదిలి వెళ్ళాలంటే ఆమె మనసు విలవిల్లాడిపోతుంది.
    
    పెళ్ళయిన ఈ అయిదేళ్ళలో తామిద్దరూ కలిసి వూరికెళ్ళింది ఒక్కసారే!
    
    పెళ్ళయిన వెంటనే తిరుపతి వెళ్ళారు - దేవుడి దర్శనానికి. అక్కడ నుంచి కొడైకెనాల్ వెళ్ళారు - కాముడి దర్శనానికి. తిరుపతి శశి ఇష్టం మీద వెళితే, కొడైకెనాల్ తన బలవంతంమీద వెళ్ళాల్సి వచ్చింది.
    
    ఆ తరవాత -
    
    పేషెంట్లు ! పేషెంట్లు ! పేషెంట్లు!
    
    మోచేతి మీద లేచి, శశి వైపు చూశాడు సుధీర్.
    
    శశికి అప్పుడే నిద్రపడుతూంది. కళ్ళు అరమోడ్పుగా ఉన్నాయి - పెదిమలమీద చిరునవ్వు పూర్తిగా జారిపోలేదు. జడ వదులై, జుట్టంతా మొహంమీద పడుతూ మబ్బుల్లో చందమామని గుర్తు తెస్తూంది.
    
    తన భార్యని చూసుకుంటే గర్వంగా ఉందతనికి.
    
    డాక్టర్ శశివదన!
    
    చందమామ అంత అందమైన మొహం! వెన్నెల అంతటి చల్లటి చిరునవ్వు!
    
    వెన్నెల వేడిలాంటి వయసు! అంత తెల్లటి మనసు!
    
    మెల్లిగా నిద్ర పట్టేసింది అతనికి కూడా. నిద్రలో అర్ధంలేని పిచ్చి కలలు - శశి మంచి డాక్టరని తెలిసి కేరళలో జనం తనని అక్కడే బంధించేసి నట్టూ, తర్వాత శశి తన మంచితనంతో వాళ్ళందరినీ జయించి, వాళ్ళకు రాణి అయిపోయి, అక్కడే ఉండిపోయినట్లు. అతను నిద్రలోనే కలవరపడుతూ అటూ, ఇటూ దొర్లాడు.
    
                                                                  * * *
    
    "గుడ్ మోర్నింగ్ టు యూ!"
    
    కలలోలాగా గుసగుసగా వినబడుతూంది. రెండుసార్లు విని మూడోసారికి కళ్ళు తెరిచాడు సుధీర్.
    
    ఎదురుగా శశి -
    
    చేతిలో కాఫీగ్లాసు, పెదిమల మీద చిరునవ్వు.
    
    "వెళ్ళేముందు చివరిసారిగా నాచేత్తో కాఫీ ఇచ్చి వెళ్ళాలనిపించింది. లేపేశాను" అని, "మీ అలవాటు చొప్పున కాఫీ తాగి, తర్వాత పళ్ళు బ్రష్ చేసుకోండి!" అంది, 'మీ అలవాటు నాకు సుతరామూ నచ్చదు సుమా!' అనే భావం గొంతులో పలికిస్తూ.
    
    'చివరిసారిగా కాఫీ ఇవ్వడం' అన్నది సుధీర్ చెవులకి అపశ్రుతిలాగా వినబడింది. అతను బద్దకంగా లేచి కూర్చుంటూ, "దిసీజ్ ఎ వెరీ బేడ్ మోర్నింగ్! నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు" అన్నాడు ఆరోపణగా.
    
    "మూడురోజులు మాత్రమే!" అంది శశి, నవ్వుతూ "ఫ్లయిట్ కి టైమవుతూంది! మీరు నన్ను కాస్త ఎయిర్ పోర్టుకి తీసుకెళ్ళాలి. త్వరగా తయారవండి ప్లీజ్" అంది బతిమాలుతూ.
    
    పది నిమిషాల్లో సుధీర్ రెడీ అయి వచ్చాడు. అప్పటికే సూట్ కేసు కారులో పెట్టాడు నౌఖరు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS