Previous Page Next Page 
మధుమాసవేళలో ... పేజి 2


    
    "ఈ ఎండకి వడదెబ్బ కొట్టి ఠకీమని చచ్చేట్టున్నాను. ఇక్కడే" సొమ్మసిల్లటానికి సిద్దంగా వుంటూ అనుకున్నాడు. ఓ యింటికి తగిలించిన టులెట్ బోర్డు కనపడింది సరీగ అప్పుడే.
    
    అదిచూసి నడిరోడ్డుమీద సొమ్మసిల్లే తతంగం వాయిదా వేసి హుషారుగా ఈలవేసి ఆనందంగా ఎగిరి గంతేశాడు మదన్ గోపాల్. అదిచూసి ఆ దోవమ్మటే పోతున్న వకాయన "కాళ్ళు కాలాయికాబోలు పాపం!" అనుకున్నాడు. అలా అనుకున్నవాడు మదన్ గోపాల్ కాళ్ళవైపు చూడలేదు. చూస్తే చెప్పులు కనపడేవి. ఇతగాడు కాళ్ళు కాలికాదు ఎగిరి గంతేసింది. మరెందుకో? అని ఆలోచించేవాడే. చూడలేదు కాబట్టే ఆలోచించకుండా పోయాడు.
    
    ఎందుకయినా మంచిదని కళ్ళు నులుముకుని మరీ చూశాడు మదన్ గోపాల్. టులెట్ బోర్డు మరీ కుంకుడు గింజ లంకేసి అక్షరాలతో రాసిలేదు. ఆ రాసినవాళ్ళు తాటికా యంతేసి అక్షరాలతో రాశారు. అగ్రనాయకులు నటించిన స్కోప్ కలర్ వాల్ పోష్టరంత అందంగా అంత పెద్దగా వుంది. కళ్ళు లేనివారికి కూడా కనిపించేటంత వీలుగా వుంది.
    
    "ఇది నిజంగా వాల్ పోష్టరా! నిజంగా టులెట్ బోర్దా?" అని ఒక్క నిమిషం ఆలోచించి టులెట్ బోర్డే అని నిర్ధారణ చేసుకుని ముందడుగేశాడు మదన్ గోపాల్.
    
                                                           2
    
    "ఎవరండీ లోపల తలుపు తీస్తారా?" అంటూ వినయంగా పిలిచాడు మదన్ గోపాల్.
    
    తలుపులు తెరుచుకోలేదు.
    
    అలీబాబా నలభైదొంగలు కధలోలా తలుపులు తెరుచుకోటానికి బీజాక్షరాలు వల్లించలేదు. ఇది కధకాదు కాబట్టి "జైపాతాళభైరవీ, తలుపు తెరిచి సాయం శేయవేరా ఢింబకా!" అనటానికి ఇది సినిమా కాదు. కాబట్టి...మదన్ గోపాల్ ఈతఫా నోటికీ చేతికి పనికల్పిస్తూ "హేమండీ! ఒక్కసారి తలుపు తీస్తారూ?" అన్నాడు.
    
    భళ్ళున తలుపు తెరుచుకుంది.
    
    తెరుచుకున్న తలుపుని ఎదురుగావున్న అమ్మడుని చూసుకోక మరోసారి ఎదురుగావున్నది తలుపెసుకుని పిడికిలి బిగించికొట్టాడు మదన్ గోపాల్.
    
    ఆ అమ్మడిపేరు వైజయంతి. మాంచి తెలివికలది. తన దేహానికి దెబ్బ తగలకుండా చెయ్యడం పెట్టుకుంది. మదన్ గోపాల్ చేతికి గట్టిగా తలుపు తగలలేదు మెత్తగ చెయ్య తగిలింది. వెంటనే కరెంట్ షాక్ కొట్టినట్లు వెనక్కొ అడుగేసి ఆగిపొయ్యాడు.
    
    మదన్ గోపాల్ వేపు తీవ్రంగా బయటనున్న సూర్యుడు కన్నా నిప్పులు కక్కుతూ చూసింది వైజయంతి. ఆ కలువ పువ్వుల్లాంటి కళ్ళకే గనుక నిజంగా శక్తివుంటే రైలుబొగ్గులు కన్నా రగులుకున్న రాక్షసి బొగ్గులకన్నా వేడిగల బొగ్గుల తాలూకా నిప్పులు కక్కటం జరిగేదే.
    
    "క్షమించండి" అన్నాడు మదన్ గోపాల్ గొంతు పెగల్చుకుని.
    
    "ఎందుకు?" అంది వైజయంతి.
    
    "నా పేరు మదన్ గోపాల్!"
    
    "అయితే!"
    
    "మరి..."
    
    "ఊ...మరి...?"
    
    "క్షమించండి" కంగారు పడిపోయాడు మదన్ గోపాల్.
    
    "మళ్ళీ క్షమించాలా?" కొంటెగా అడిగింది వైజయంతి.
    
    నాలుక పూర్తిగా పిడచకట్టుకుపోయింది మదన్ గోపాల్ కి. నాలుకతో పెదవులు తడుముకున్నాడు. దాహం కావాలని అడగటానికి అదే దాహం తీరటానికి మంచినీళ్ళు అడగటానికి మొహమాటమేసి "ఇక్కడ సోడాలుండవాండీ?" అని అడిగాడు.
    
    "ఇది కూల్ డ్రింక్ షాపు కాదు. సోడాలు ఐస్ క్రీమ్ లు వుండటానికి" కోప్పడింది వైజయంతి.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS