Previous Page Next Page 
ఆత్మజ్యోతి పేజి 2

   

     'ఈ ఊరు అయినమాట నిజమే కానీ అది యిదివరకు. భ్రమత చావక మళ్ళీ వచ్చాం. కానీ యిక్కడ నిల్చోడానికి ఎలాంటి స్థానంలేదు అని తెలుసుకుని మళ్ళీ పోతున్నాం.'
    
    'ఏమీ బోధపడలా'
    
    'ఎందుకు బాబూ బోధపడడం కూడా ఇదేమంత తెలుసుకోదగిన విషయంకాదు. మీలాంటి బాబులకు మనసు పాడుచేయడం తప్ప.'
    
    సరే. ఇహ వాళ్ళ విషయం అలా వుంచి నూతనాగంతకుల వైపు చూశాడు. యువతి అతనివంక కృతజ్ఞత నిండిన కళ్ళతో చూస్తోంది. అతని చూపు పడగానే తల ప్రక్కకు త్రిప్పుకుంది. బాగా తడిసిపోయింది. చీకటిగా వుండడం చేత గోవిందు లైటువేశాడు. విద్యుత్ వెలుగులో నీటిబిందువులతో నిండిపోయిన ఆమె వదనమండలం మిలమిల మెరుస్తోంది. తడిసిపోయిన పమిటచెంగుతోనే మాటిమాటికి ముఖం తుడుచుకుంటూ-ఫలితం లేకపోయినా ప్రయాస పడుతోంది. తడిసిన దుస్తులతో పర పురుషునిముందు..... అతనికి సిగ్గువేసి చూపు మరల్చుకున్నాడు. ఏమీ మాట్లాడకుండా పైకి వచ్చేశాడు.
    
    తిరిగి యధాస్థానంలో నిలబడ్డారు. అనుభవాలు గాయం చేశాయి. దృశ్యం ఇదివరకటంత మనోజ్ఞంగా లేదు. పైగా చీకటికూడా చిక్కగా అలుముకుంటోంది. ఏదో దిగులు, విరక్తి తనూ పోయి ఆ మనుషులలాగా చూరుక్రింద నిల్చోవాలనిపించింది. అలా నిల్చుని, ఇంటికి దూరంగా వుండి బాధపడుతోంటే ఎలా వుంటుందో. బాగా చలిగా వుంది. తనవంక ఒకసారి చూసుకునేసరికి తడిబట్టలు యింకా విడిచెయ్యలేదనే సంగతి స్ఫురణకు వచ్చింది. మెడమీది తన గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకొనేసరికి గోవిందు పైకి వచ్చాడు.
    
    వాళ్ళకు బట్టలు యిచ్చానని చెప్పాడు.
    
    'తుఫాన్ రేపటికిగాని తగ్గదు. ఈ రాత్రికి వాళ్ళందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చెయ్యి.
    
    'అందరికీనా' అన్నాడు ఆశ్చర్యంగా.
    
    'అంటే? కొంతమందికి పెట్టి కొంతమందిని ఉపవాసం చేయిస్తావా?' అన్నాడు శివనాథరావు నీరసంగా నవ్వి.
    
    'అది కాదండీ' అంటూ ఏదో చెప్పబోయి- మళ్ళా అభిప్రాయం మార్చుకుని సరేనంటూ వెళ్ళిపోయాడు. అతనికి ఏమీ తోచడంలేదు. గది తలుపులన్నీ వేసివున్నాయి. లేకపోతే గాలి భరించడం కష్టం. ఏదన్నా చదువుదామన్నా మనసు నిశ్చలంగా లేదు. పోనీ ఏదయినా ఓ విషయాన్ని గురించి దీర్ఘంగా యోచించి, అలా కృత్రిమంగా ఆలోచనా తరంగాల్లో తేలిపోదామన్నా వెనువెంటనే మరో ఆలోచన పెనుభూతంలా వచ్చి ఏకాగ్రతను చెదరగొడుతోంది. ఈ సమయానికి తల్లీ, తండ్రీ ఎక్కడ ఉన్నారో! ఏ ట్రావెలర్స్ బంగళాలోనో టీ త్రాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారుగావును. అక్కడకూడా తుఫాన్ వుంటుందా? తనుకూడా వాళ్ళతో వెడితే బాగుండేది.
    
    మెల్లిగా క్రిందకు దిగివచ్చాడు. నలుగురూ శుభ్రంగా తయారయ్యారు. గోవిందు తెలివితక్కువవాడేమీ కాదు. అమ్మగారు బాగాలేదని వదిలేసిన చీరెలే వాళ్ళకు యిచ్చాడు. నలుగురూ కబుర్లలో పడ్డారు. అతను గదిలోకి అడుగుపెట్టగానే మాటలు ఆపేశారు.
    
    'ఏం ఆపేశారేం?' అన్నాడు నవ్వి.
    
    వృద్దురాలు అంది 'వెగటుగా వుంటాయి బాబూ మా మాటలు మీకు.'
    
    'ఫర్వాలేదు చెప్పండి, నాకూ వినాలని వుంది' అని అక్కడున్న ఓ స్టూల్ దగ్గరగా లాక్కుని కూర్చున్నాడు.
    
    "మీరేం మాట్లాడుకుంటున్నారో చెప్పండి" అని ఎదురుగా కూర్చుంటే ఎవరికీ మాత్రం గొంతు పెగుల్తుంది? యువతి చెంగుచాటున ఓసారి నవ్వుకుంది.
    
    "నీ పేరేమిటి నాయనా?" అని అడిగాడు వృద్దుడు.
    
    "శివుడు" ఓ క్షణం ఆగి "మీరు ఎందుకంత తొందరపడ్డారు!" అన్నాడు.
    
    వృద్దుడు కళ్ళు తుడుచుకున్నాడు. "ఏం చెప్పేది? ముగ్గురు చచ్చిపోయాక వీడు పుట్టాడు. పురిట్లోనే చచ్చి బ్రతికాడు. ఎట్లా పెంచుకున్నామని వీడిని? మీరుకూడా అట్లా పెరిగుండరు బాబూ! మా ఇంటావంటా ఎవడూ యాపిల్ పండు రుచి చూడలేదు. చిక్కిపోతున్నాడని వీడితో రోజూ తినిపించాం. నేనెప్పుడూ మల్లుచొక్కా తప్ప మరొకటి వెయ్యలేదు. వీడికి సిల్కూ ఉలెనూ కుట్టించాం. రెండుపూట్లా పెరుగన్నం, బి.ఏ.దాకా చదివించాం. ఈ రెండక్షరాలూ వీడు తెచ్చుకునేందుకు వీడు పుట్టినప్పట్నుంచీ యివవయ్యేళ్ళు రెక్కలు ముక్కలు చేసుకున్నాం. ఇట్లా పెరిగిన యీ గాడిదకు పెళ్ళీడువచ్చింది. రాజకుమారుడికి మల్లే దేశమంతా వెదికి ఓ లక్ష్మిని - లక్ష్మి అనుకున్నాం మొదట. తెచ్చి పెళ్ళి చేశాం అంతే. వాడికీ మాకూ సంబంధాలు తెగిపోయినై. నూటయాభై రూపాయల ఉజ్జోగమైంది. వెధవ. దాని మైక్మలో పడిపోయాడు. అది ఆడినమాట వేదవాక్కయింది. చివరకు మమ్మల్ని ఇంట్లోంచి బయటకు తగలేశాడు. కన్నకొడుకు ఉజ్జోగం చేస్తుంటే వాళ్ళనూ వీళ్ళనూ దేబిరించే గతిపట్టింది. ఏంచేస్తాం నాయనా? ఖర్మ అనుకుని అక్కడా యిక్కడా యిన్నాళ్ళూ గుట్టుచప్పుడుకాకుండా బ్రతికాం. ఇదుట్టి వెర్రిబాగుల్ది. కొడుకుకోసం దీనిమనసు పెరపెరలాడింది. ఒద్దే-వాడు మనల్ని మరచిపోయాడని ఎంతో చెప్పాను. విన్నదికాదు. చివరికేం జరిగింది? ఇలా వొచ్చాం. భంగపడ్డాం. మాకు కొడుకులేడని తెలుసుకున్నాం. వెళ్ళిపోతున్నాం. ఈ ఊరంటే రోత పుట్టింది. ఈ గడ్డమీద వున్న కొద్దీ ఏదో దిగులు దౌర్భాగ్యం గుండెల్ని తొలుస్తూ వున్నాయి. అందుకని అలా తొందరపడ్డాం.
    
    ఓ నిట్టూర్పు విడచి శివనాథరావు "ఇప్పుడు ఎక్కడికి పోదామనీ?"
    
    "ఎక్కడికో ఏం చెప్పం? ఎవర్నో ఆశ్రయించాలి"
    
    ఇలా అని వృద్దుడు మౌనంగా కూర్చున్నాడు. వృద్దురాలు తలదించుకుంది. శివనాథరావు నడివయసు స్త్రీ వైపు తిరిగాడు.
    
    ఆమె వితంతువు, శరీరంలో దారుఢ్యం ఏమీ తగ్గినట్లులేదు. ముఖంలో ఏదో దిగులూ, విరక్తీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈమెను ఏమయినా అడగనా, వద్దా అని సంశయించసాగాడు. ప్రతివారికీ ఏవో గాథలూ, అగాధాలూ వుంటాయని ఎందుకనుకోవాలి? నిశ్శబ్దంగా అక్కడ కూర్చోవడం చేతగాక లేచి వెళ్ళిపోసాగాడు.
    
    "బాబూ!" అందామె.
    
    ఆగి, ప్రశ్నార్ధకంగా చూశాడు.
    
    "వాన తగ్గే సూచనలేవైనా కనిపిస్తున్నాయా?"
    
    "లాభం లేదు. ఈ రాత్రికి మీరెక్కడికీ కదల్లేరు. గాలివాన రేపటికిగానీ శాంతించదు."
    
    "అయ్యో" అంది ఆ స్త్రీ.
    
    "ఏం? అర్జెంటు పనులేమైనా వున్నాయా?"
    
    "అర్జెంటూ" అని విరక్తిగా నవ్వి, "దిక్కులేని ఆడదాని పనులు అర్జెంటయినా ఎవరు ఖాతరు చేస్తారు బాబూ? మేము ఎవరమో మీకు తెలవదు. ఈ రాత్రికి ఇక్కడ తిష్టవేసి ఎలా బాధ కలిగించేది మీకు?" అన్నది.
    
    శివనాథరావు లజ్జితుడై "మరేం ఫర్వాలేదు. మీరంతా స్వేచ్చగా ఇక్కడ విశ్రాంతి తీసుకోండి."
    
    ఓ క్షణం ఆగి ఆమె "మీరు ఆదరించకపోతే మా గతి ఏమయిపోయేదో" అని నిట్టూర్చింది.
    
    "ఇదేపని మనుషులు చేస్తే అతడ్ని క్రూరుడనీ, కఠినుడనీ తూలనాడతారు. ఆ పరమాత్ముడు మీకు యింతటి విపత్తు తెచ్చిపెట్టినా ఆయన్ని నిందించరేం?"
    
    "దేముడూ, మనిషీ ఒకటేనా బాబూ?"
    
    "కాదు. కాబట్టే దేముడు ఆటలాడుతున్నాడు." అంటూ అతను నవ్వాడు.

    అతని ఈ హాస్యానికి ఓ ముసిముసి నవ్వు జవాబొచ్చింది సుదూరంనుంచి. గోవిందు వంటగదిలో ఏదో చప్పుడు చేస్తున్నాడు.
    
    "ఈ లోకంలో ఏ స్త్రీకీ న్యాయం జరగదు" అన్నదా స్త్రీ.
    
    "అలా అంటారేం?"
    
    "అంతే అది. దిక్కులేని ఆడది బ్రతకడం కన్నా చచ్చిపోవడం మేలు. అమాయకుల్ని ఆడించడం లోకానికి ఓ చెలగాటం. ఉదాహరణకు మా సంగతి చూడండి."
    
    "అబ్బ! ఊరుకోవే" అని మృదువుగా కసిరింది ఆ యువతి. అతనీసారి ఆమె ముఖంవంక కాస్త పరిశీలనగానే చూశాడు. ఎవరివో పోలికలు గోచరిస్తున్నాయి. అరె! ఔను. ఆమాట నిజమే. అతనికి బాగా దగ్గరవారి పోలికలు.
    
    "ఉండవే, చెప్పనియ్యి" అని అతనివంక తిరిగి "ఆయన పోయినప్పుడు యిది పదేళ్ళపిల్ల దమ్మిడీ ఆస్థిలేదు. సెంటు భూమిలేదు. ఆడదానికి వచ్చిన ముఖ్యమైన విద్య ఒక్కటే. అది యిటువంటి స్థితిలో ఉపకరిస్తుంది. వంటలు చేసుకుని బ్రతకట మారంభించాను. అలాగే కష్టపడి దీనికి పెళ్ళిచేశాను. అతని పైమెరుగు చూసి అమ్మాయి అదృష్టవంతురాలని మురిశాను. కానీ అబద్దం. ఈ పిల్ల మొహం చూడు బాబూ!" అంటూ చటుక్కున ప్రక్కనే నిల్చున్న కూతురి చుబుకం పట్టుకుని ముఖం పైకెత్తింది. లజ్జాభారంతో ఆ అమ్మాయి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. విడిపించుకుని దూరంగా జరిగింది. శివనాథరావుకి కూడా సిగ్గుతో శరీరం రోమాంచితమైంది.   


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS